ఆకాశమంతా ఉల్కాపాతం
మిలమిలా మెరిసిపోతూ
గగనం నుండి వెండితళుకుల
హిమపాతం ధారగా కురిసిపోతూ!
రోదశి యుద్ధంలో ఓడిన
గ్రహాశకలాలన్నీ రాలిపోతూ
చీకటి రాత్రిలో నింగినుండి
భూగోళంపై క్షిపణుల్లా జారిపోతూ!
శకునం చెప్పే తోకచుక్క కధనాలు,
మబ్బులయుద్ధపు మెరుపు విశేషాలు,
సిగపట్లకు రేగే ఉరుము ద్వానాలు
అలసి సొలసి రాలిపోయే నక్షత్రాలు!
కదిలి తరలిపోతున్న పాలపుంతలు,
నీడభూతాలకు బెదిరే గ్రహారాజులు,
ఖగోళాన్నే ఆకర్షించే కృష్ణబిలాలు,
చిత్రాగమనాల మరగుజ్జుగ్రహాలు!
పగటి పూట ప్రశాంతంగా,
తెల్లటి మబ్బుల మధ్య
నిశ్చల నిబ్బర నీలాకాసం!
రాత్రివేళ అల్లరిచేస్తూ
నిశీధిలో రంగుజిలుగుల
విద్యులతలమయం!
ఓహ్ సందడే సందడి!
అంబరమంతా సంబరం,
అవధులులేని ఆనందం!
రాత్రంతా కోలాహలం
చుక్కలింట్లో దీపోత్సవం!
కాంతి పుంజాలా సమాహారం
చీకట్లో ఉదయించిన అంతరిక్షం!
అబ్బురంగా ఆకాశంవైపు చూస్తూ
విస్మయంగా మిన్నుకదనం కంటూ
అవగతం అయ్యింది నాకు!..
చుట్టూ చీకటి కమ్ముకున్నా
సంబరంగా ఉండాలని!
యుద్ధం చేస్తూనే ఉన్నా
ప్రశాంతంగా ఉండొచ్చని!
– ఉషారం
9553875577




