ఆకాశంలో నీటిబానలు
భళ్లుమని శబ్దం చేస్తూ
బద్దలయ్యాయేమో?
వరుణుని ఇంటి పోరులో
అలకపూనిన ఇంతి కన్నీటి
కరకట్ట పగిలిందేమో?
కర్రిమబ్బులకు మోజులుడిగి
నీటిబిందువులకు విడాకులు ఇచ్చి
ఇంటికి పంపేస్తున్నాయేమో?
అమ్మను కన్న మైమరపులో
ఆదిదేవుడు జటాజూటాన్ని
ముడివేయడం మరచాడేమో?
వేడితాపాలకు సుస్తీ చేసిన
సూరీడుకి నీళ్లు గుమ్మరించి
చల్లబరిచారేమో?
వినువీధుల విహారంలో విసుగొచ్చిన
కడలి వెనుతిరిగి గబగబా
ఇంటికొచ్చేస్తున్నదేమో?
ఆశ తీరని మనిషికి ఆడిగినన్ని
వరాలు ఇవ్వలేక దేవతలందరూ
రోదనలు చేస్తున్నారేమో?
ఏమి అయ్యిందో ? ఏమి జరిగిందో ?
ఆకాశం నుండి అఖండ జలపాతం
అలుపు లేకుండా పడిపోతోంది!
ఏమి అయ్యిందో? ఏమి జరిగిందో ?
అంబరపు అగాధంనుండి అశ్రుధారలు ఆగకుండా కారుస్తోంది!
– ఉషారం, 9553875577




