ఆకలి కేకలు ఓ వైపు.. ఆహార వృధాలు వేరొక వైపు…

అన్నమో రామచంద్రా…’ అంటూ కోట్లమంది అన్నార్తుల ఆకలి కేకలు ఓ వైపు ఆహారపు వృధాలు వేరొక వైపు మనకు సర్వత్రా కనిపించే పరిస్ధితి. ఆహారం విలువ కొంత మందికే తెలుసు. ఎందుకంటే ఆహారం తినే వారికన్నా దానిని పండిరచే వారికే దాని విలువ ఎక్కువ తెలుస్తుంది. ఆహారం పారేయడానికి ఒక్క క్షణం చాలు, కాని ఆ ఆహారాన్ని పండిరచడానికి కనీసం మూడు నెలలు పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పెద్దలు అన్నం పరబ్రహ్మా స్వరూపం దానిని వృధా చేయకూడదు అని అంటారు..ఈ విషయం తెలిసినప్పటికీ కూడా చాలా మంది దానిని వృధా చేస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక ఉత్పత్తి విధానాల ద్వారా ఆహార ఉత్పత్తి మెరుగైనప్పటికీ ఆకలి మరణాలకు మరొక ప్రధాన కారణం ఆహారపు వృథాగా చెప్పవచ్చు. ప్రపంచంలో ఒక వైపు కొందరు ఆకలితో అలమటిస్తుంటే, మరొకవైపు కొందరు నిర్లక్ష్యంగా ఆహార పదార్థాలను వృథా చేస్తున్నారు. ఈ వృథా అనేది భారీ స్ధాయిలో నెలకొంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ ఆహార వృథాల పరిమాణం చూస్తే ప్రతి ఏటా 931 మిలియన్‌ టన్నులు కాగా, ఇందులో 569 మిలియన్‌ టన్నుల గృహ వ్యర్థాలు (61 శాతం), 244 మిలియన్‌ టన్నులు ఆహార సేవల వ్యర్థాలు (26 శాతం), 118మిలియన్‌ టన్నుల రిటేల్‌ ఆహార వ్యర్థాలు (13 శాతం) ఉన్నాయని విశ్లేషించారు. ప్రపంచ దేశాల వార్షిక తలసరి వ్యర్థాలు 121 కేజీలు ఉండగా, అందులో 74 కేజీలు గృహ వ్యర్థాలు, 32 కేజీలు ఆహార సేవల్లో వ్యర్థాలు, రిటేల్‌లో 15 కేజీల ఆహారం వ్యర్థమవుతున్నది.
భారత దేశంలో పరిశీలిస్తే…   68.7 మిలియన్‌ టన్నుల ఆహారాన్ని వ్యర్థ పదార్థంగా ఇంట్లోంచి చెత్తకుప్పలో వేస్తున్నారని ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంటల్‌ ప్రోగ్రామ్‌ ‘’ఆహార వ్యర్థాల సూచిక-2021 (ఫుడ్‌ వేస్ట్‌ ఇండెక్స్‌ రిపోర్ట్‌-2021)’’ నివేదిక బహిర్గత పరిచింది. అంతేకాదు సంపన్న దేశాలతో పాటు నిరుపేద దేశాల్లో సైతం ఆహార వృథా దాదాపు ఒకే స్థాయిలో జరుగుతోందని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఏటా దాదాపు 130 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. జనాభా వినియోగించే ఆహార పరిమాణంలో ఇది దాదాపు మూడో వంతు. వృథా అవుతున్న ఆహారం విలువ సుమారు 2.6 లక్షల కోట్ల డాలర్లు. ఎఫ్‌ఏఓ లెక్కల ప్రకారం సంపన్న దేశాల్లో సగటున ఏటా 67 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతుంటే, పేద దేశాల్లో సగటున 63 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. మన దేశంలో పెరుగుతున్న జనాభాతో పాటు ఆహార ఉత్పత్తి కూడా అనూహ్యంగా పెరిగింది. అయితే మన దేశంలో ఉత్పత్తి అయ్యే ఆహారంలో 40శాతం వృథాగా మట్టిపాలవుతోందని, దాని విలువ ఏడాదికి దాదాపు లక్ష కోట్ల రూపాయలని ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ లోగడే లెక్కగట్టింది!

గిడ్డంగి సౌకర్యాలు లేమి
ఆహార ధాన్యాలను భవిష్యత్‌ అవసరాల కోసం నిల్వ చేసుకునేందుకు తగిన సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా దేశాల్లో దాదాపు 40శాతం మేరకు తిండి గింజలు వినియోగానికి పనికి రాకుండా నాశనమైపోతున్నాయి. ఈ పరిస్థితి ఆకలి సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది.
పంట కోతలో ఆధునిక పరికరాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల భారీ స్థాయిలో ఆహార నష్టం వాటిల్లుతోంది. ప్రత్యేకించి మన దేశంలో వివాహాలు,సామాజిక వేడుకలు  వంటి సందర్భాలలో వృథా కాబడే ఆహార పదార్ధాలు పరిమాణాలు మనం చూస్తూనే ఉన్నాం. ఆహార పదార్థాల వృథాను సమర్థంగా అరికట్టగలిగితే ఆకలి సమస్యను చాలావరకు అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆహార వృధాలను అరికడితే ఆహార ఉత్పత్తిని చేపట్టినట్లే. ఆహార వృథా కారణంగా పర్యావరణంపై చాలా ప్రతికూల ప్రభావం పడుతోంది. వృథా అవుతున్న ఆహార పదార్థాల కారణంగా ఏటా  330 టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ పర్యావరణంలో కలుస్తోంది. వృథాగా పారవేసిన ఆహార పదార్థాలు కుళ్లిపోయే దశలో విడుదలయ్యే మీథేన్‌ వాయువు కూడా పర్యావరణంపై  ప్రతికూల ప్రభావం చూపుతోంది. కేవలం బొగ్గు, చమురు ఇంధనాల వల్ల మాత్రమే కాదు, ఆహార వృథా కారణంగా కూడా భూతాపం అంతకంతకు పెరిగి పర్వావరణానికి తీవ్ర హాని కలిగిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న కర్బన ఉద్గారాల్లో 8-10శాతానికి వృథా అవుతున్న ఆహారమే కారణం. రెండేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం వెలువరించిన నివేదిక ప్రకారం ప్రపంచ ఆహార సరఫరాలో పంటకోత తరవాత చిల్లర విపణికి చేరేలోగా 14శాతం వృథా అవుతోంది. ఆ తరవాత దాన్ని వినియోగించేలోగా మరో 17 శాతాన్ని నష్టపోవాల్సి వస్తోందని అంచనా. భారత్లో ఏట 6.88 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. ప్రపంచ ఆహార వృథాలో భారత్‌ వాటా ఏడు శాతం.చైనాలో ఒక్కో ఇంటినుంచి సగటున ఏడాదికి 64 కిలోల ఆహారాన్ని బయట పారబోస్తున్నారు. మరోవంక అమెరికన్లు సగటున 59 కిలోలు, భారతీయులు 50కిలోల ఆహారం వృథా చేస్తున్నారు. అవసరానికి మించి కొనుగోలు చేయడం, శీతలీకరణ సదుపాయాలు లేకపోవడం మన దేశంలో ఆహార వృథాకు కారణంగా చెప్పవచ్చు.

2018లో విడుదలైన ఓ నివేదిక ప్రకారం భారత్లో వృథా అవుతున్న ఆహారం- యూకేలోని ప్రజలు వినియోగించే మొత్తం ఆహారానికి సమానం! మరో అంచనా ప్రకారం- దేశంలో సుమారు 10శాతం నుంచి 20 శాతం వరకూ ఆహారం- వివాహాది శుభకార్యాల్లోనే వృథా అవుతోంది.
భారత్లో పంటల కోత తరవాత అత్యధికంగా పండ్లు 6-15శాతం, కూరగాయలు 5- 12శాతం వృథా అవుతున్నాయి. మత్స్య రంగంలో వృథా తొమ్మిది శాతం ఉంది. ఈ మేరకు ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధ్యయనం వెల్లడిరచింది.

2021లో వెలువడిన నివేదిక ప్రకారం.. 2019లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన ఆహారంలో 17 శాతం వృథా అయినట్టు అంచనా వేశారు. ఇది 93.1 కోట్ల టన్నులకు సమానం. కాగా ప్రతి వ్యక్తి ఏడాదికి దాదాపు 79 కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నట్టుగా పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఇది రోజుకు కనీసం వంద కోట్ల భోజనాల వృథాకు సమానమని పేర్కొన్నారు. ఈ వృథాలో ఎక్కువగా అంటే 60 శాతం గృహాల నుంచే ఉంటోంది. ఆహార సర్వీసులు లేదా రెస్టారెంట్ల నుంచి వృథా దాదాపు 28శాతం ఉండగా.. రిటైలర్ల వృథా దాదాపు 12శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది తీవ్రమైన క్షుద్బాధను ఎదుర్కొంటున్న నేపథ్యంతో ఆహార వృథా పెరిగిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఐక్యరాజ్యసమితి తాజాగా ఆహార వృధా సూచిక నివేదిక 2024 విడుదల చేసింది.దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఓవైపు కోట్లాది మంది తిండిలేక క్షుద్బాధను అనుభవిస్తుంటే.. మరోవైపు టన్నుల కొద్ది ఆహారం వృథా అవుతోందని తాజా నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది ఆకలి కోరల్లో చిక్కుకోగా, మరోవైపు ఆహారంలో 19 శాతం (2022లో) వృథా అయ్యిందని వెల్లడిరచింది.

2022 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయిన ఆహారంలో దాదాపు 19శాతం వృథా అయినట్టు ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) తాజా నివేదిక పేర్కొంది. ఇది దాదాపుగా 105 కోట్ల మెట్రిక్‌ టన్నులకు సమానమని తెలిపింది. ఈ పరిస్ధితిని అధిగమించడానికి ప్రపంచవ్యాప్తంగా రీటైల్‌, వినియోగదారుల స్థాయుల్లో తలసరి ఆహార వృథాకు అడ్డుకట్ట వేసి 2030 నాటికి పరిమాణాన్ని సగానికి సగం తగ్గించాలన్నది ‘సమితి’ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కీలకమైనది. అయితే ఈ లక్ష్య సాధనలో భారత్‌ కు ఇక ఆరు సంవత్సరాల సమయమే మిగిలి ఉంది. చట్టాలు ఆశయాలు ప్రకటిస్తే సరిపోదు. క్షేత్రస్థాయిలో పౌరసమాజంతో వాటిని సమన్వయం చేసుకొని ముందుకు సాగితేనే ఆహార వృథాను అరికట్టగలుగుతాం.దీని కోసం ప్రతి పౌరుణ్నీ ఈ మహత్తర క్రతువులో భాగస్వామిగా మార్చాలి. ఫలితంగా పర్యావరణ సమస్యలకు అడ్డుకట్ట వేయడంతోపాటు, ఆకలి ముప్పునూ ఎదుర్కోగలుగుతాం.

రుద్రరాజు శ్రీనివాసరాజు, 9441239578

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *