- తడిచిన ధాన్యంతో సహా ప్రతి గింజ కొనుగోలు, మూడు రోజుల్లో చెల్లింపులు
- చివరకు మొలకెత్తినా ఒక్క రూపాయి తగ్గించకుండా కొంటాం
- ధాన్యం కొనుగోళ్లపై బిఆర్ఎస్ దుష్ప్రచారం
- డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21 : సన్న ధాన్యంపైనే రూ.500 బోనస్ అని తాము అనలేదని, కేవలం సన్నాల కొనుగోళ్లతో పక్రియ ప్రారంభించామని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. మంగళవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…ధాన్య కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తడిసినా, చివరకు మొలకెత్తినా కూడా రేటు ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా చివరి గింజ వరకు కొంటామని భట్టి వెల్లడిరచారు. అంతే కాకుండా కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని కూడా ఆయన తెలిపారు. ధాన్య కొనుగోళ్ల విషయంలో బిఆర్ఎస్ రాష్ట్ర ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నదని విమర్శించారు.
వారు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నదని, అబద్ధాలు చెప్పడం వారికి కొత్తేమీ కాదని భట్టి దుయ్యబట్టారు. రైతులను ఇబ్బంది పెట్టేం విధంగా రాజకీలు చేయొద్దని ఆయన హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అసలు ధాన్యమే కొనుగోలు చేయడం లేదని, కలలలలళాల్లోనే ధాన్య తడిసి ముద్దవుతుందని బిజెపి, బిఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. అందులో ఎంత మాత్రం నిజం లేదని, తాము 15 ముందుగానే కొనుగోళ్లు ప్రారంభించినట్లు, గతంలో కంటే ఎక్కువగా 7,215 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు వివరించారు.
గత ఏడాది ఇదే సమయంలో తాను పాదయాత్ర చేస్తుండగా రోడ్లకిరువైపులా రైతులు ధాన్యాం పోసి ఇబ్బందుల పాలయిన విషయాన్ని భట్టి ఈ సందర్భంగా గుర్తు చేశారు. బిఆర్ఎస్ మాదిరిగా కాకుండా తాము కొనుగోలు కేంద్రాలను పెంచామని, ఎన్ని టన్నుల ధాన్యం పండినా కొంటామని ఆయన స్పష్టం చేశారు. ఆనాడు వరి వేస్తే ఉరే అన్న కెసిఆర్ ప్రకటనను ఈ సందర్భంగా భట్టి గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాలు ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రైతుల్లో పెరుగుతున్న ఆదరణ చూసి వారు ఓర్వలేక పోతున్నారని అన్నారు. అందుకే వారు తప్పుడు ఆరోపణలు చేస్తూ..అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లే ప్రయత్న చేస్తున్నారని భట్టి దుయ్యబట్టారు.





