– ఇద్దరు పైలట్ల దుర్మరణం
– వారిలో ఒకరు ‘ఆపరేషన్ సిందూర్’ పైలట్ పూర్వేశ్
న్యూదిల్లీ, మార్చి 6: అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్లో వైమానిక దళానికి చెందిన సుఖోయ్ జెట్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు చనిపోగా వారిలో ఒకరైన ఫ్లైట్ లెప్టినెంట్ పూర్వేష్ దురాగ్కర్(28) ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పూర్వేష్ తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న విషయం ముందుగా తమకు తెలియదని, ఆపరేషన్ ముగిసిన 15 రోజుల తరువాత తెలిసిందని పూర్వేష్ తండ్రి రవీంద్ర దురాగ్కర్ తెలిపారు. యుద్ధ సమయంలో పూర్వేష్ వద్ద ఫోన్ లేదని, యుద్ధం ముగిసిన తరువాత తమకు కాల్ చేసి విషయం చెప్పాడని తెలిపారు. అస్సాంలో ప్రమాదం జరగడానికి ఒక రోజు ముందు కొడుకుతో మాట్లాడినట్లు రవీంద్ర తెలిపారు. ఇంతలోనే ఇలా జరిగిందంటూ కన్నీరుమున్నీరయ్యారు. తన కొడుకు భారత వైమానిక దళంలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉందన్నారు. పూర్వేష్ ఎప్పుడు మాట్లాడినా యుద్ధ విమానాలను నడిపిన అనుభవాన్ని, ఐఏఎఫ్ జెట్ల వేగం గురించి ఆసక్తిగా చెబుతుండేవాడని, తన సహోద్యోగులను ఎంతో గౌరవించేవాడని రవీంద్ర తెలిపారు. ‘నా కొడుకు దేశ సేవలో తనను తాను త్యాగం చేసుకున్నాడు.. తన కలను నెరవేర్చుకున్నాడు.. కానీ తను కోరుకున్నంతగా దేశానికి సేవ చేయలేకపోయాడు.. నాలుగేళ్లు మాత్రమే పనిచేశాడు.. పది రోజుల క్రితం ఇంటికి వచ్చాడు.. తిరిగి విధుల్లో చేరిన తరువాత ఇలా జరిగింది’ అంటూ విలపించారు. ఫ్లైట్ లెప్టినెంట్ పూర్వేష్, స్క్వాడ్రన్ లీడర్ అనుజ్ శిక్షణ మిషన్లో ఉన్నారు. జోర్హాట్ వైమానిక స్థావరం నుండి వీరి జెట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కనిపించకుండా పోయింది. సాయంత్రం 7:42 గంటలకు సుఖోయ్తో కమ్యూనికేషన్ కోల్పోయినట్లు తెలిపిన అధికారులు జోర్హాట్ వైమానిక స్థావరం నుంచి 60 కి.మీ దూరంలో కూలిపోయినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





