అసమర్థ పాలనతో రాష్ట్రం తిరోగమనం

తీవ్ర ఇబ్బందుల్లో అన్ని వర్గాల ప్రజలు
ప్రాజెక్టులు ఎండిపోతున్నాయి
చేనేత కార్మికులు, రైతులు బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితి
కాలం సృష్టించిన కరువు కాదు…కాంగ్రెస్‌ సృష్టిస్తున్న కరువు
ప్రజలు ఉద్యమిస్తారు…జాగ్రత్త
సిరిసిల్ల మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌
బిఆర్‌ఎస్‌ మద్దతుగా ఉంటుంది… రైతులు ధైర్యంగా ఉండాలి
కరీంనగర్‌ జిల్లాలో ఎండిన పంటపొలాలు
పరిశీలించిన బీఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌

సిరిసిల్ల/కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం తిరోగమిస్తుం దని, అన్ని వర్గాల ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని, చేనేత కార్మికులు, రైతులు బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితి ఏర్పడుతుందని, ప్రాజెక్టులు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిరదని, అసమర్థ ప్రభుత్వంతో ప్రజలంతా దిక్కుతోచని స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారని కాంగ్రెస్‌ పాలనపై బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల బిఆర్‌ఎస్‌ భవన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కెసిఆర్‌ మాట్లాడుతూ…కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు నీటి కొరత లేకుండా చేశామని, తాము నాలుగు సజీవ జలధారలను సృష్టించామని, అన్నారం బ్యారేజి, వరద కాలువను రిజర్వాయర్‌గా మార్చామని, కాకతీయ కాలువ నీటితో నిండి ఉండేదని, అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనతో నాలుగు నెలల్లోనే ప్రాజెక్టులు ఎండిపోయాయని, మిడ్‌మానేరు నెర్రెలు వారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 2014 కంటే ముందున్న పరిస్థితి ఎదురైందని, సాగునీరు, తాగునీటికి కరువు ఏర్పండిరదని విమర్శించారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామలను ఇప్పటి వరకు నెరవేర్చడం లేదని ఆరోపించారు.

తెలంగాణలో ఇప్పటి వరకు 15 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని, నీటి నిర్వహణ సామర్థ్యం లేని ప్రభుత్వం వైపల్యమేనని ఆయన అన్నారు. గత వర్షా కాలంలో 25 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని, దీనిని మరిచి, తమపై ఆరోపణలు చేస్తున్నారని కెసిఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టం పరిహారం కింద ఎకరానికి 25 వేలు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. నాగార్జున సాగర్‌లో 14 టిఎంసిల నీరున్నప్పటికినీ వినియోగించడం లేదని అన్నారు. మేడిగడ్డ బ్యారేజి కుంగడం సాథారణమేనని, దానిని సరిచేసి వెంటనే నీటిని సరఫరా చేయాల్సి ఉండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. తన పర్యటన ఉందని తెలిసి వరద కాలువకు నీటిని విడుదల చేశారంటే తమను బద్‌నామ్‌ చేయడానికేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రస్తుతం వ్యవసాయం సంక్షోభంలో కొట్టు మిట్టాడుతుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చి హామీలన్నింటిని క్గాగ్రెస్‌ ప్రభుత్వం  విస్మరించిందని, దళిత బంధు, గొర్రెల యూనిట్లు, పంటల బోనస్‌, కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, వృద్దాప్య పెన్షన్లు పెంచడం చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల బకాయిల చెల్లింపు, రైతుల రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాళేశ్వర ప్రాజెక్టును సరిగా నిర్వహించాలని, లేని పక్షంలో తాము ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్‌ నాయకులు కెటిఆర్‌, దేశపతి శ్రీనివాస్‌, వినోద్‌కుమార్‌, గంగుల కమలాకర్‌, కొండూరి రవీందర్‌రావు, తుల ఉమ, చల్మెడ లక్ష్మినర్సింహారావు, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎండిన పైరును పరిశీలించిన కెసిఆర్‌
బోయినిపల్లి మండలం కేంద్రంలోని గంగు రమేశ్‌ అనే రైతుకు సంబంధించిన పొలాన్ని బిఆర్‌ఎస్‌ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం పరిశీలించారు. బిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థి బోయినిపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యేలు కె.తారక రామారావు, గంగుల కమలాకర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బాల్క సుమన్‌లతో కలిసి ఆయన బోయినిపల్లి మండల కేంద్రానికి చేరుకుని సాగునీరు లేక ఎండిపోయిన వరిపొలాన్ని పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మిడ్‌ మానేర్‌ బ్రిడ్జి వద్దకు చేరుకుని నీటి మట్టాన్ని పరిశీలించారు. కాంగ్రెస్‌ పాలనతో కరువు వొచ్చిందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో చూడని రీతిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బిఆర్‌ఎస్‌ మద్దతుగా ఉంటుంది…రైతులు ధైర్యంగా ఉండాలి : కరీంనగర్‌ జిల్లాలో ఎండిన పంటపొలాలు పరిశీలించిన బీఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌
కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : రైతులకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఉంటుందని, ధైర్యంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతన్నలకు భరోసానిచ్చారు. కరీంనగర్‌ జిల్లా రూరల్‌ మండలం ముగ్ధుంపూర్‌లో ఎండిపోయిన పంటలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పొలాలకు నీటి సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు గులాబీ దళపతి ముందు సమస్యలు ఏకరువు పెట్టారు. సాగునీటికి తీవ్ర ఇబ్బందవుతుందని తెలిపారు. గత సంవత్సరం నీరు సమృద్ధిగా ఉండేదని.. వరి కోత కోసేందుకు ఇబ్బందయ్యేదని పేర్కొన్నారు. ఇప్పుడు పొలమంతా ఎండిపోయిందని, ఒకసారి వాగులోకి నీళ్లిస్తే రైతులందరు బతుకుదురని చెప్పారు. మంచినీళ్లకు కూడా గోసవుతుందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పోయిన సంవత్సరం మండుటెండల్లో కూడా చెక్‌డ్యామ్‌లు మత్తడి పోశాయని..ఈ సంవత్సరం చుక్కా లేకుండా అడుగంటిపోయాయని మరో రైతు తెలిపారు. స్పందించిన కేసీఆర్‌ రైతులకు బీఆర్‌ఎస్‌ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. రైతులు ధైర్యంగా ఉండి పోరాటం చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *