అవగాహనా రాహిత్యంతో మాట్లాడొద్దు

  • కేటాయింపుల ప్రకారం ఎరువులు సరఫరా కాలేదు
  • యూరియా కొరతఇక్కడే కాదు.. పక్క రాష్ట్రాల్లోనూ ఉంది
  • కేంద్రం ఇచ్చినట్టు వివరాలుంటే చెప్పండి
  • బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌కు మంత్రి తుమ్మల సూచన
    హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 14: దేశంలో ఏ రాష్ట్రంలోనూ యూరియా కొరత లేదని, రాష్ట్ర ప్రభుత్వమే కృత్రిమ కొరత సృష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం ఎంత యూరియా కేటాయించింది, ఎంత సరఫరా చేసింది అనే వాస్తవాలను ముందుగా తెలుసుకోవాలని సూచించారు. కేవలం తెలంగాణలోనే కాదు,.. పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో కూడా యూరియా కొరత ఉందని తెలిపారు. బీజేపీది రైతు మిత్ర ప్రభుత్వం కాదని, రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. కేంద్రం రాష్ట్ర అవసరాలకు మించి యూరియా ఇచ్చిందని, కానీ తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంపిణీ చేయలేకపోయిందని విమర్శించడం శోచనీయమని, అర్ధరహితమని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆరోపణలు బీజేపీ తెలంగాణ శృాఖకు రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని శంకింప చేస్తున్నాయన్నారు. అన్ని వివరాలు తెలుసుకున్నాక సీబీఐ ఎంక్వైరీల వంటి ప్రగల్భాలు పలకాలని హితవు పలికారు. ఏప్రిల్‌ నుండి ఆగస్టు వరకు కేంద్రం రాష్ట్రానికి కేటాయించింది 8.30 ఎల్‌ఎంటీఎస్‌ అయితే సరఫరా చేసింది కేవలం 5.12 మాత్రమే. అంటే ఆగస్టు వరకు రాష్ట్రానికి రావాల్సిన యూరియా కంటే 3.20 ఎల్‌ఎంటీఎపస్‌ యూరియా తక్కువగా సరఫరా చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇంతకుముందు ఉన్న నిల్వలు కలుపుంటే మొత్తం 7.04 ఎల్‌ఎంటీఎస్‌ యూరియా రైతులకు అందుబాటులో ఉంచి, జిల్లాల వారీగా కేటాయింపులు చేశామని చెప్పారు. ఇందులో ఇప్పటివరకు రైతులు 6.52 ఎల్‌ఎంటీఎస్‌ యూరియాను కొనుగోలు చేయగా ప్రస్తుతం 0.76 ఎల్‌ఎంటీఎస్‌ యూరియా అందుబాటులో ఉందన్నారు. మీ దగ్గర ఏమైనా వివరాలు ఉంటే ఇవ్వండి.. అంతేకానీ నరం లేని నాలుకతో ఏదో నోటికొచ్చింది మాట్లడకండి అని మంత్రి తుమ్మల దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం కావాలని కృత్రిమ కొరత సృష్టించడం కాదు.. కేంద్రం కొన్ని రాష్ట్రాల పట్ల సవతి ప్రేమను చూపిస్తూ కావాలని సృష్టిస్తున్న కొరత అని అన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖ స్వయంగా నిర్వహిస్తున్న ఎంఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో ఏ రాష్ట్రానికి ఎన్ని ఎరువులు ఎన్ని వచ్చాయో డీలర్‌, కంపెనీతో సహా వివరాలు ఉంటాయన్న విషయం కూడా తెలియకుండా సీబీఐతో విచారణ అని మాట్లాడటం వారికి ఉన్న అజ్ఞానం బయటపెట్టుకోవడమేనన్నారు. ఇప్పటికే లెక్కలతో సహా ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి, సహాయ మంత్రి బండి సంజయ్‌కి తెలిపినా, అలాగే రాష్ట్ర అధికారులు కేంద్ర అధికారులను కలిసినా, తాను, ముఖ్యమంత్రి పలుమార్లు కేంద్ర ఎరువుల, రసాయన మంత్రి జ.పి.నడ్డాను అభ్యర్థించినా కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల కర్కశ మనసష్ట్రంత్వంతో ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రగల్భాలు పలకడం మానుకొని రాష్ట్ర రైతుల ప్రయోజనార్థం రాష్ట్రానికి రావాల్సిన యూరియాను త్వరగా తెప్పించాలని రామచందర్‌రావును మంత్రి తుమ్మల కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *