ప్రజాతంత్ర బ్యూరో,పెద్దపల్లి,మార్చి 25 : ధర్మపురి క్షేత్రం బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, ఆదివారం నిర్వహించిన శ్రీ యోగానంద నృసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాల సందర్భం గా, అపర వైకుంఠపురిjైు అలరారింది. రాష్ట్రంలోని మారుమూలల నుండే గాక, రాష్ట్రేతర ప్రాంతాల నుండి జానపదుల బృందగానాలు, భగవన్నామ స్మరణలు, జయజయ ధ్వానాలు, మంగళవాద్యాలు, భక్తి సంగీతాలు మమేకమై క్షేత్రంలో భక్తి పారవశ్యం అంబరాన్ని చుంబించింది. మొక్కులు చెల్లించడానికి శనివారం రాత్రి నుండే తరలి వచ్చిన భక్తుల, యాత్రికులతో ఆది వారం ప్రాచీన క్షేత్రం అశేష జనసంద్రమైంది. నరసింహ శతక పద్యాలు, అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజ కృతులు, భక్తి సంగీతాలు, హరికథా కాలక్షేపాలు, అలౌకిక ఆనందాన్ని ఆస్వాదిం పజేస్తూ, ఆధ్యాత్మిక లోకాల్లో విహరింప జేశాయి. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన కోరిన కోర్కెలు తీర్చే యోగానంద నారసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాల సందర్భంగా గోదావరిలో స్నానాలను సుదూర ప్రాంతాలకు చెందిన అశేష భక్తులు సంప్రదాయాచరణలో భాగంగా ఆచరించారు. దేవాలయాలలో గండాదీపం, వల్లుబండ, కోడె మొక్కులు, తలనీలాలు, పట్టెనామాలు, కోరమీసాలు తదితర మొక్కులను తీర్చుకున్నారు.
బ్రహ్మోత్సవ ప్రత్యేక పూజలు
బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా ఆదివారం దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం యాజ్ఞికులు పురుషోత్తమాచార్య, వేదపండితుల ఆధ్వర్యంలో అర్చకులు వివిధ ఆలయాలలో ఉదయాత్పూర్వం నుండి నిత్యహవన, యువాగ్ని ధ్యానం, సప్తజిహ్వా హోమం, అగ్ని జటారaూట ఆధారాది పద్మాంతం యోగపీఠ హవనం సమర్పించారు. అష్టాక్షరీ మంత్రన్యాస, ద్వాదశాక్షరీ మంత్రన్యాస హోమం, షోడశోపచార పూజలు, మూర్తిమూల మంత్ర హవనములు, నృసూక్త, పురుషసూక్త, విష్ణు సూక్త, భూసూక్త, నీలాసూక్త హవనములు, పరావార హోమములు, ఉత్సవ ప్రధాన హోమం, వ్యాహృతి హోమం నిర్వహించారు. దేవాలయ గర్భగుడి నుండి చండ, ప్రచండాది ద్వారపాలకులకు, నృత్య మంటప స్థిత దేవతలకు నివేదనాది కార్యక్రమాలు నిర్వహించారు. అనూహ్యంగా పెరిగిన రద్దీకి అనుగుణంగా దేవస్థానం పక్షాన టిటిడి ధర్మశాలలో నిర్వహించిన అన్నదానానికి పలువురు దాతలు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు తదితరాలను సమర్పించారు.
అలరించిన నృత్య ప్రదర్శనలు
హైదరాబాద్ నృత్య కిన్నెర సంస్థ ఆధ్వర్యంలో మద్దాలి ఉషా గాయత్రి దేశ విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. 200కు పైగా నృత్యాంశాలకు సోలోగా కోరియోగ్రఫీ చేశారు. కేంద్ర ప్రభుత్వ అవార్డులు, హంస అవార్డుతో పాటు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. వందల మంది ఔత్సాహికులకు కూచిపూడి నృత్య శిక్షణ ఇస్తున్నారు. డాక్టర్ మదాలి ఉషా గాయత్రి ఆధ్వర్యంలో శిష్య బృందం వాసవి, లౌక్య, ఆశ్రిత, సహస్ర, లక్ష్మీ వాత్సల్య ద్వారా ప్రదర్శింపబడిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి. ముఖ్యంగా విన్నపాలు వినవలె, బాల కనకమయి, నారాయనతే, శ్రీమన్నారాయణ, నగుమోము, ప్రహ్లాద పట్టాభిషేకం తదితర సాంప్రదాయ ప్రదర్శనలు చెరగని ముద్రలు వేశాయి.
ఆకట్టుకున్న సంగీత విభావరి
బ్రహ్మోత్సవాలలో భాగంగా శేషప్ప కళా వేదికపై సంగీత రత్న కొరిడే నరహరి శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ గుండి జగదీశ్ శర్మ, లలితా ప్రసాద్ ద్వారా నిర్వహించిన సంగీత విభావరి ఆకట్టుకుంది. అలాగే కళా తపస్వి నృత్య రత్న రతన్ కుమార్ బృందం సభ్యుల నృత్య ప్రదర్శనలు హృదయ రంజకంగా సాగాయి.





