అల్పాహారంతో శక్తి, మానసిక చైతన్యం -విద్యపై ఏకాగ్రత మెరుగు

సంగారెడ్డి, ప్రజాతంత్ర,అక్టోబర్06:  జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని  ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్  సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం  బడి పిల్లల భవితకు వరమని, ఉదయం తినే అల్పాహారంతో శారీరక శక్తి, మానసిక చైతన్యం వస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాలలో  రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్ తో కలిసి కలెక్టర్ శరత్ ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం కింద జిల్లాలో ఉన్న 1277 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు కావలసిన పోషకాలు ప్రోటీన్లు విటమిన్లతో కూడిన అల్పాహారం అందిస్తారని తెలిపారు. ప్రతిరోజు ఉదయం పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాల ముందు అల్పాహారం పెట్టనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించడం వల్ల వారి ఎదుగుదలకు దోహదపడడంతో పాటు తరగతి గదిలో విద్యార్థుల ఏకాగ్రత మెరుగవుతుందని, అప్పుడే విజ్ఞానవంతమైన సమాజం ఏర్పడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతిరోజు పిల్లలు ఉదయమే పాఠశాలకు వచ్చి  అల్పాహారం స్వీకరించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పిల్లలకు నచ్చిన టిఫిన్లను అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తే మీరు,  మీ కుటుంబం, సమాజం బాగుపడుతుందని విద్యార్థులకు ఉద్భవించారు. అదేవిధంగా తల్లిదండ్రులు, పాఠశాల, జిల్లా పేరు ప్రతిష్టలను పెంచాలని ఆకాంక్షించారు. రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఏది చేసినా ఓ చరిత్ర సృష్టిస్తుందని, ఎన్నో గుణాత్మకమైన మార్పులు తెచ్చారని, దేశంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారని అన్నారు.విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం ప్రవేశపెట్టిందన్నారు. సోమవారం నుండి శనివారం వరకు రుచికరమైన ఒక్కోరకం టిఫిన్ పెడతారనీ తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అన్ని సదుపాయాలను సద్వినియోగం చేసుకుని బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలన్నారు. అనంతరం విద్యార్థులకు స్వయంగా జిల్లా కలెక్టర్, టీఎస్ హెచ్ డి సి చైర్మన్ టిఫిన్ వడ్డించి వారితో కలిసి టిఫిన్ చేశారు.టిఫిన్ నాణ్యత, రుచిపై కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. టిఫిన్ బాగుందంటూ విద్యార్థులు ఆనందంతో కలెక్టర్ చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ సుజాత, సి డి సి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, కంది ఎంపీపీ సరళ పుల్లారెడ్డి, జడ్పిటిసి కొండల్ రెడ్డి, కౌన్సిలర్ రామప్ప, విజయేందర్ రెడ్డి, ఆర్డిఓ రవీందర్ రెడ్డి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి,  లింబాజి, ఎంఈఓ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *