పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 24: దసరా పండుగను పురస్కరించుకొని అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో బీరంగూడ గుట్ట పైన దసరా సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు అమీన్ పూర్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జెండా ఎగరవేసి జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు.అనంతరం బీరంగూడ గుట్ట పైన గల శివాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన భారీ వేదికపై తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు.. ప్రముఖ గాయని మధుప్రియచే నిర్వహించిన పలు కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుగా నిర్వహించే విజయదశమి వేడుకలను మున్సిపల్ పరిధిలో ప్రజలందరి సమక్షంలో నిర్వహించడం అభినందనీయం అన్నారు.మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహాయ సహకారాలతో నాలుగు సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రజల సహాయ సహకారాలతో మరింత ముందుకు వెళ్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ ఏనుగు తులసి రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.




