అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: జిహెచ్ఎంసి పరిధిలోని వార్డులలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గురువారం పటాన్ చెరు పట్టణంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో జిహెచ్ఎంసి కార్పొరేటర్లు, బల్దియ అధికారులతో కలిసి అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి పరిధిలోని భారతి నగర్, పటాన్చెరు, రామచంద్రాపురం డివిజన్ల పరిధిలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు  కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఇటీవల 3 డివిజన్లో పరిధిలో సిసి రోడ్ల నిర్మాణానికి 22 కోట్ల రూపాయలు నిధులు కేటాయించామన్నారు.అభివృద్ధి పనుల అమల్లో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఆదేశించారు.అదేవిధంగా పెండింగ్ నిధుల మంజూరు, నూతన అభివృద్ధి పనుల నిధుల కోసం త్వరలోనే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో సమావేశం కానున్నట్లు తెలిపారు.జాతీయ రహదారిపై విద్యుత్ దీపాల నిర్వహణ సంతృప్తికరంగా లేదంటూ సంభందిత శాఖ అధికారులపై ఎమ్మెల్యే జిఎంఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.నూతన కాలనీలలో పారిశుధ్య నిర్వహణ కోసం నూతన సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్,  పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జోనల్ కమిషనర్  శ్రీనివాస్ రెడ్డి, ఇంజనీరింగ్ శాఖ ఈఈ శంకర్ నాయక్, డిప్యూటీ కమిషనర్ సురేష్, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *