- చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు
- 9 ఏండ్లలో 9 లక్షలకోట్లతో మోదీ తెలంగాణలో అభివృద్ధికి బాటలు
- కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి
- బీజేపీలో చేరిన మాజీ మంత్రులు..చిత్తరంజన్ దాస్, కృష్ణ యాదవ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వొస్తుంటే..ఈ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు తీరికలేని ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా? అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు.. బీఆర్‌ఎస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబ సభ్యులు చేస్తున్న నాటకాలను గమనిస్తున్నారని..దీనికి వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సరైన సమాధానం చెబుతారని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని పాలించడం చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలని, అంతే తప్ప అర్థంలేని విమర్శలు చేయొద్దని కిషన్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా..తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని..90 రోజుల తర్వాత కల్వకుంట్ల కుటుంబం ఫామ్ హౌజ్‌కు పరిమితం కావడం ఖాయమన్నారు.
శనివారం కిషన్ రెడ్డి సమక్షంలో..మాజీ మంత్రులు కృష్ణ యాదవ్ , చిత్తరాంజన్ దాస్, సిర్పూర్ జడ్పీటీసీ రేఖ సత్యనారాయణ, బండల రామచంద్ర రెడ్డితో పాటు పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. వారికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబంపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సానుకూల వాతావరణం ఉందని అన్నారు. అనేక సర్వేలు బీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటమి పాలవ్వడం ఖాయమని చెప్తున్నాయనీ.. ఓటమి భయంతో కేసీఆర్ బిజెపిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేసీఆర్ కుటుంబం ప్రధానిపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నరని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భూమిపూజ చేసేందుకు ప్రధాని మోదీ తెలంగాణకు వొస్తుంటే.. ఆ కార్యక్రమాల్లో పాల్గొనకుండా కుట్రలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు అవసరం లేదని పేర్కొంటూ..కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో వేలకోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు మహబూబ్ నగర్, 3న ఇందూరుకు విచ్చేస్తున్నారని తెలుపుతూ సుమారు రూ. 20 వేల కోట్ల పైచిలుకు అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రజలకు అంకితం చేయనున్నారన్నారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన సమస్యలను పరిష్కరించేలా పాలమూరు, ఇందూరు ప్రజలకు వరాలు ప్రకటించనున్నారన్నారు.
అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. నేడు ఉదయం 9 గం.ల నుంచి 10 గం.ల వరకు దేశంలోని ప్రతి జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాలు, ప్రతి కాలనీ, బస్తీలోని ప్రజలంతా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నామన్నారు. దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉద్యమంగా మారిందని, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా పాలమూరు ప్రజాగర్జన సభ, ఇందూరు ప్రజాగర్జన సభలను విజయవంతం చేయాలని కిషన్ రెడ్డి ప్రజలను కోరారు.




