మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 19: సీఎం కేసీఆర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ను కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ లో రూ.66 లక్షల వ్యయంతో నిర్మించనున్న భూగర్భ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్డు, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ యొక్క ప్రత్యేక చొరవతో మహేశ్వరం నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగానే మీర్ పేట్ కార్పొరేషన్ ను అన్ని విధాలుగా ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా సమీకృతా మార్కెట్లు, వైకుంఠ దామాల నిర్మాణంతో పాటు స్వచ్ఛతకు చిరునామాలుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ మహేశ్వరం పర్యటనలో మంజూరు చేసిన రూ.50 కోట్లతో మీర్ పేట్ కార్పొరేషన్ లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో తిరిగి గతలో జరిగిన అభివృద్ధిని, ఈ ఐదు ఏళ్లలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని సూచించారు. మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలో ట్రంక్ లైన్లు, నాళాల నిర్మాణాలతో వరద నీటి ముంపు సమస్యలు పరిష్కారం అయ్యాయని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో రూ.110 కోట్లతో నాళాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. తాగునీటి సమస్య లేకుండా చేయటానికి రూ.210 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా పనులు చేపట్టి ఇంటింటికీ మంచి నీరు అందిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో నూతన పైప్ లైన్లతోపాటు ట్యాంకులు, రిజర్వాయర్లు కడుతున్నామన్నారు. దీంతో మంచి నీటి సమస్య పూర్తిగా తీరుతుందన్నారు. బడంగ్ పేట్, మీర్ పేట్, జల్ పల్లి, తుక్కుగూడ పరిధిలో గల 11 చెరువులను రూ.47 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి, సుందరికరణతో పాటు వాకింగ్ ట్రాక్, పార్కుల నిర్మాణ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు అండగా ఉండి, వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ కు పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భూపాల్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు కామేష్ రెడ్డి, లావణ్య, స్థానిక కార్పొరేటర్లు విజయ రవీందర్ రెడ్డి, అధికారులు, నాయకులు, స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




