ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో కూకట్పల్లి నియోజకవర్గాన్ని వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని, పాదయాత్ర చేస్తుంటే అభివృద్ధిని చూసి జనం నీరాజనాలు పడుతున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కూకట్పల్లి నియోజకవర్గంలోని కే.పి.హెచ్.బి కాలనీ డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి 42వ రోజు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో బోయిన్పల్లి నుంచి మొదలుపెట్టిన పాదయాత్రలో కే.పి.హెచ్.బి డివిజన్ వరకు కొనసాగిందని, ఈ పాదయాత్రలో చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద సమస్యలు ఏమి లేవని అన్నారు. ప్రజల తన దృష్టికి తీసుకువచ్చిన ఆ చిన్న సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. డ్రైనేజీ సమస్యలు, రోడ్డు సమస్యలను సత్వరమే పరిష్కారం కొరకు మంత్రి కేటీఆర్ సహకారంతో 150 కోట్లు మంజూరు చేశారని త్వరలోనే ఆ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎదురులేదని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సర్దార్ పటేల్ నగర్, సాయి నగర్ లోని సిసి రోడ్ నిర్మాణ పనుల కొరకు శంకుస్థాపన చేశారు.




