మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 23: మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ఒకసారి చూడాలని, అభివృద్ధి, సంక్షేమం మరింత శరవేగంగా జరగాలి అంటే కారు గుర్తుకు ఓటు వేసి, భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి కోరారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గంలో ఎన్నడు లేని విధంగా వందల కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 28,33 డివిజన్లలో రూ.80 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి పట్లోళ్ళ సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మహేశ్వరం పబ్లిక్ మీటింగులో ప్రకటించిన రూ.150 కోట్లతో నియోజకవర్గంలోని రెండు కార్పొరేషన్లు, రెండు మున్సిపాలిటీలలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మీర్ పేట్ కార్పొరేషన్ కు మంజూరు చేసిన రూ.50 కోట్లను వివిధ అభివృద్ధి పనులకు కేటాయించనున్నట్లు చెప్పారు. గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా విపరీతంగా వరదలు వచ్చి, ఇక్కడి ప్రజలతో పాటు మేము కూడా చాలా ఇబ్బందులకు గురైనట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ సహకారంతో వరద నివారణ కోసం రూ.23 కోట్లతో ట్రంక్ పైపు లైన్ నిర్మాణ చేయడం జరిగిందన్నారు. దీంతో వరద ముప్పు సమస్య పరిష్కారం అయిందన్నారు. నాలాల అభివృద్ధికి 110 కోట్లతో నియోజకవర్గం పరిదిలో రూ.110 కోట్లతో గొలుసు కట్టు నాలాల నిర్మాణ చేపడుతున్నట్లు తెలిపారు. దీంతో పూర్తిగా వరద ముప్పు సమస్యలు తీరనున్నట్లు చెప్పారు. తాగునీటి సమస్య లేకుండా చేయటానికి రూ.210 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి శుద్ధి చేసిన మంచి నీరు అందించాలన్న సంకల్పంతో పలు రిజర్వాయర్లు, ట్యాంకుల నిర్మాణంతో పాటు పైప్ లైన్ వేస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలోని బడంగ్ పేట్, మీర్ పేట్, జల్ పల్లి, తుక్కుగూడ పరిధిలో గల 11 చెరువులను రూ.47 కోట్ల రూపాయలతో అభివృద్ధితో పాటు, సుందరీకరణ చేసి, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ పార్క్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అడిగినన్ని నిధులు ఇచ్చి నియోజకవర్గం అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మనందరం అండగా ఉండాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అని అన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరు చూడాలని, ఇదే అభివృద్ధి కోసం మీరంతా దీవించి మరోక్కసారి నాకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు జిల్లెల అరుణ ప్రభాకర్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



