- ఇప్పుడేమో సన్నవడ్లకే అంటున్నారు…
- మాట మార్చడం సరికాదని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21 : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తానని ప్రకటించిందని, ఇప్పుడు మాట మార్చి సన్న వడ్లకు మాత్రమే ఇస్తాననడం సరికాదని బిఆర్‌ఎస్ ముఖ్య నేత, ఎంఎల్‌ఏ హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో కోటి 20 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండుతుందని, అన్నింటికి బోనస్ ఇవ్వాలంటే రూ.6 వేల కోట్ల భారం పడుతుందని, అందుకోసం సన్నం వడ్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని హరీష్ రావు అన్నారు. ఇలా చేస్తే రూ.400 కోట్ల మాత్రమే ఖర్చవుతుందని వివరించారు. యాసంగిలో రైతులు సన్న వడ్లు పండిరచరని ఈ సందర్భంగా హరీష్ రావు గుర్తుచేశారు. పండిరచని వడ్లకు బోనస్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బోనస్ ఇవ్వకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త కుట్రకు తెరతీసిందని విమర్శింంచారు.
రైతు భరోసా కింద ఎకరాకు ప్రభుత్వం రూ.2500 ఇవ్వాల్సి ఉందన్నారు. వానాకాలానికి సంబంధించి ఎకరానికి 15 వేల రైతు భరోసాతోపాటు యాసంగి బకాయిలు కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. దొడ్డు వడ్లు కొంటారా..కొనరా..అని ప్రశ్నిస్తూ..కొంటే ఎప్పటి నుంచి కొంటారో చెప్పాలని సూటిగా అడిగారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వదిలి పెట్టమని ఆయన తేల్చి చెప్పారు. ఇతర పంటల కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. వడ్లు కొనడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వడ్లు కొనకపోవడం వల్ల రైతులు ధాన్యాన్ని దలారులకు అమ్ముకుంటున్నారని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.





