- జనాభా ప్రాతిపదికన టెకెట్ల కేటాయింపుకు డిమాండ్
- కాంగ్రెస్, బీజేపీలకు పీటముడిగా మారిన అభ్యర్థుల ఎంపిక
- ముందే లభ్యర్థుల ప్రకటనతో బీఆర్‌ఎస్‌కు ఉపశమనం
హైదరాబాద్, అక్టోబర్ 12 : నవంబర్ 30న జరిగే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిసీ అభ్యర్ధిత్వాల కోసం ఆ వర్గాల నుండి బలమైన డిమాండ్ వొస్తున్నది. జనాభాలో 52 శాతం ఉన్న తమకు రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని వారు చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పార్టీలకు అతీతంగా ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించి, తమ జనాబా ప్రాతిపధికన ఆయా పార్టీల్లో టికెట్ల కేటాయింపు జరుగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు ప్రత్యేక రాష్ట్రంగా అంటే ఏపి ఆవిర్భావం నుండి రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత, నేటి వరకు బిసీకి చెందిన వ్యక్తులెవరూ ముఖ్యమంత్రులు కాలేదన్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఇప్పటి వరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందని వారు 12 మంది, కమ్మ సామాజిక వర్గాల వారు 6 గురు, వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు ముగ్గురు ముఖ్యమంత్రులుగా కొనసాగారు. అలాగే అలాగే ఎస్సీ, బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు ఒక్కొక్కరుగా ఆ పదవిలో కొనసాగారు. కాని జనాభాలో అత్యంత సంఖ్యలో ఉన్న బిసీ వర్గానికి దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూ ఉండడాన్ని ఇక ఎంత మాత్రం సహించేది లేదంటున్నారు బిసీ నేతలు. ఇప్పుడిది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ముఖ్యంగా త్వరలో జరుగనున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలముందు ఇదొక చిక్కుముడిగా మారింది. రాష్ట్రంలో ప్రధానంగా పోటీ పడుతున్న మూడు పార్టీల్లో ఇది ప్రధాన సమస్యగా మారింది. అధికార బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఇప్పటికే జరిగిపోవడంతో ఇప్పుడా పార్టీపైన ఒత్తిడి పెద్దగా లేకుండా పోయింది. ముఖ్యంగా సిట్టింగ్ ఎంఎల్యేలకే తిరిగి టికెట్టును ఆ పార్టీ ప్రకటించడం కూడా ఒక కారణమైంది. బిసీలు డిమాండ్ చేస్తున్నంతగా కాకపోయినా సుమారు ఇరవై మంది వరకు బిసీలకు ఈసారి బిఆర్‌ఎస్‌లో టికెట్లు లభ్యమైనాయి. ఇంకా అభ్యర్థుల విషయంలో మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్, బిజెపిలకు ఇప్పుడా సమస్య ఎదురైంది. గతంలో ఈ పార్టీలు చేసిన హామీలు, ప్రకటనల మేరకు తమ వర్గాల వారికి సీట్లు కేటాయించాల్సిందేనని బీసీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌లో ఈ ఒత్తిడి మరింత ఎక్కువైంది. ఈసారి కనీసం 40 మంది బిసీ అభ్యర్థులకు టికెట్ కేటాయించాల్సిందేనంటున్నాయి ఆ వర్గాలు.
బిసీ జనాభా ప్రాతిపధికన రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజక వర్గాల పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ముగ్గురు లేదా కనీసం ఇద్దరు బిసీ అభ్యర్ధులకు టికెట్లు ఇవ్వాల్సిందేనని వారు పట్టుపడుతున్నారు. ఈసారి అధికారాన్ని హస్తగతం చేసుకుని తీరుతామని చెబుతున్న రాష్ట్ర, జాతీయ నేతలకు వీరి డిమాండ్‌ను కాదనలేని పరిస్థితి ఏర్పడింది. అధికంగా ఉన్న బిసీ వోటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ఇప్పటికే కర్ణాటకలో బిసీ వోటర్ల మద్దతు వల్లే కాంగ్రెస్ గెలిచిందన్న భావన ఉంది. దానికి తగినట్లుగా వారిని సంతృప్తిపర్చేందుకు తాము అధికారంలోకి వొస్తే కులగణన తప్పక చేపడుతామని రాహుల్ గాంధీ కర్ణాటకలో హామీ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే.
అదే వ్యూహాన్ని తెలంగాణలో తమ పార్టీ విజయానికి దోహదపడుతుందన్నది కాంగ్రెస్ ఆలోచన కూడా. దానికి తగినట్లుగా తెలంగాణలో బిసీ పాలసీని తీసుకువస్తామని ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం ఏబిసిడి బిసీ గ్రూపులకు సంబంధించి అమలవుతున్న 29 శాతం రిజర్వేషన్‌లను తాము అధికారంలోకి రాగానే 40 శాతంకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల కమ్మ సామాజిక వర్గంవారు తెలంగాణలో తమకు 40 స్థానాలను కల్పించాలని దిల్లీ నేతలముందు తమ డిమాండ్ ఉంచారు. దీనికి తోడు లెఫ్ట్‌పార్టీలు, ఇతరులతో ఎన్నికల ఒప్పందం చేసుకుంటున్న కాంగ్రెస్ బిసీలకు ఏమేరకు న్యాయం చేస్తుందో చూడాలి.
బిజెపి కూడా బిసీ వోటు బ్యాంకుపైన దృష్టి సారించింది. గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్న బిసీ వోటర్లను ఆకట్టుకునేందుకు వ్వూహరచన చేస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకునే గత జూన్‌లో తెలంగాణలో ప్రత్యేకంగా తెలంగాణ డిక్లరేషన్‌ను ప్రకటించింది. తాము అధికారంలోకి రాగానే జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చింది. అంతే కాదు తెలంగాణ రాష్ట్ర బిసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తామని కూడా ప్రకటించింది. ఆర్థిక వెసులుబాటు లేక, సమాజంలో పెద్దగా గుర్తింపు లేకుండా పోయిన బిసీల్లోని వెనుకబడిన తరగతుల వారికి కూడా ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అలాంటి వారికి నామినేటెడ్ పదవులను కల్పించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ ప్రకటించింది. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి పరిమితులు లేకుండా ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటించింది.
ఈ విషయంలో బిఆర్‌ఎస్ హామీలే కాకుండా వివిధ పథకాలను ఆచరణలోకే తీసుకురావడం గమనార్హం. ఒక విధంగా బిసీల నుండి ఎలాంటి డిమాండ్‌లు రాకముందే బిఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీల్లోని వివిధ తరగతుల వారి ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పథకాలను రచించింది. అయినప్పటికీ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మే నెలలో బిసీ పాలసీని ప్రకటించింది. బిసీ కులాలకు సంబంధించి పదకొండు ఫెడరేషన్లు, అత్యంత వెనుకబడిన 30 కులాలవారి కులవృత్తుల కోసం ఒక్కొక్కరికి తిరిగి చెల్లించనవసరం లేని విధంగా లక్ష రూపాయల సబ్సీడి రుణాలను అందజేసే కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు వేల కోట్లను కేటాయించింది కూడా. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి పొందని బిసీ వర్గాలకు ఇది అవకాశంగా మారింది. ఇక సెలూన్‌లకు ఉచిత విద్యుత్, రజకులకు వాషింగ్ మిషన్లు, చేప పిల్లల పంపిణి, గొర్రెల పెంపకం లాంటి పలు రకాల పథకాలను ఇప్పటికే అమలు చేస్తుంది. బిసీ విద్యార్ధులకు పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ క్లాసులు, ఆత్మగౌరవ భవనాలు ఇప్పటికే అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో బిసీ వోటర్లు ఎటు వైపు మొగ్గుతారో వేచి చూడాలి.





