భారతదేశం జనాభా 70శాతం వ్యవసాయ రంగం జీవనాధారంగా జీవిస్తున్నారు. అన్నదాత సుఖీభవ అని, రైతే రాజు అని, జై జవాన్ జై కిసాన్ అని ఓట్లు దండుకొని మొఖం చాటేస్తున్నారు.ఈ దేశంలో రైతు పరిస్థితి మాత్రం ఆధ్వాన్నంగానే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బిడ్డగా, గ్రామీణ జీవితాన్ని ఒంటపట్టించుకోని, నిర్వీర్యమైన వ్యవసాయానికి జవసత్వాలు కల్పించి దండుగ అన్న వ్యవసాయం పండుగగా మార్చడం వల్లనే రాష్ట్రంలో యాసంగి సాగు రికార్డు స్థాయిలో నమోదైంది. గతంలో ఎప్పుడు లేనంతగా 72.63 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగినట్టు వ్యవసాయ శాఖ గణాంకాలు చెపుతున్నాయి. దీనిలో 56.44 లక్షల ఎకరాలు వరి సాగు చేసారు. ఈ ఏడాది వరి సాగు వానాకాలంతో పోటీపడి యాసంగి సాగు రాష్ట్ర వ్యవసాయ చరిత్రలో సువర్ణ అధ్యాయం లికించింది. 2020-21 సీజన్ లో మొత్తం 68.17 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అయితే ఇందులో 52.30 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. మార్చి నెలలో ప్రకృతి సృష్టించిన బీభత్సానికి వేలాది ఎకరాల్లో నీటిమట్టం అయ్యింది. ఎన్నో అష్ట కష్టాలకు ఓర్చుకొని నాలుగు వారాల్లో చేతికొస్తుందనుకున్న రైతన్న కష్టార్జితం బుగ్గిపాలైంది. మానవునికి ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, అచంచలమైన అభివృద్ధి సాధించినా ప్రకృతి ముందు తలవంచక తప్పడం లేదు. రైతులు కన్నీళ్లు పెట్టొద్దని అన్ని జిల్లాలు కలేదిరిగిన సీఎం కేసీఆర్, కౌలు రైతులకు సైతం భరోసా కల్పించి,ఎవరు ఆందోళన చెందకుండా తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు 10వేల రూపాయిలు ఆర్థిక సహాయం అందించి మనోధైర్యాన్ని కల్పించింది.
భారత లో 1985లో తొలిసారిగా పంటల బీమా పథకాన్ని అమలు చేసారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపించి పథకం అమలుకు నోచుకోలేదు.2014 తర్వాత ఉద్యాన పంటలపై ప్రయోగాత్మకంగా అమలు చేసారు. వాటి అమలు తీరులో లోపల కారణంగా రైతులకు ఏమాత్రం ప్రయోజనాలు దక్కలేదు.2016 ఖరీఫ్ సీజన్ నుంచి ప్రధాన మంత్రి ఫసల్ భీమా పథకం ప్రవేశ పెట్టింది.విత్తనము నాటిన నుండి పంట చేతికొచ్చిన రెండు వారాల వరకు వర్తించేలా ఎంఓయూ చేసుకుంది.కానీ,అకాల వర్షాలతో, వడగండ్ల కారణంగా పంట నష్టపోతే తక్షణమే 25శాతం పరిహారంగా చెల్లించాలన్న నిబంధనను కేంద్రం నిర్లక్ష్యం కారణంగా ప్రయివేట్ బీమా కంపెనీలు అమలు చేయడంలేదు.నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించేందుకు నిర్దేశిత గడువులోగా బీమా కంపెనీలు అందించని పక్షంలో చెల్లించాల్సిన మొత్తంపై 12శాతం వడ్డీ కట్టాలన్న నిబంధనను తుంగలో తొక్కింది. నష్టాన్ని లెక్కించేటప్పుడు పంట పొలాన్ని యూనిట్గా తీసుకోకపోవడం వల్ల అధిక శాతం రైతులకు పరిహారం దక్కడం లేదనే విమర్శ ఉంది. ఫసల్ బీమా పథకం వచ్చి ఐదు ఏండ్లు దాటినా నేటికీ 15శాతం రైతుల్నీ దాని పరిధిలోకి తీసుకరాలేక పోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కారణమైతే ,పంట పరిహారం నష్ట పోయిన రైతులకంటే భీమా కంపెనీలకు ఎక్కువ లాభం చేకూర్చుతుందనే భావంతో డబుల్ ఇంజన్ రాష్ట్రాలు సైతం అమలు చేయడం లేదు. మాములు ధాన్యం కొనడానికే ముప్పుతిప్పలు పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి, తడిసిన ధాన్యం ఎవరుకొంటారని దిగులు పడుతున్న అన్నదాతను అక్కున చేర్చుకున్నకేసీఆర్ కు పోలిక ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడినప్పటికీ, భరోసా కల్పించి రైతు ప్రభుత్వం అని నిరూపించారు.
దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, వడగండ్లు వ్యవసాయరంగాన్ని అతులాకుతలం చేసింది.ఎన్నడూ లేని విధంగా వర్షాకాలం మాదిరిగా చెడ గొట్టు వానలు పడి రైతులకు తీవ్ర నష్టం చేస్తూనే ఉన్నాయి. తెలంగాణలో వడ గండ్లు పడి 29 జిల్లాల్లో వరి పంట కు తీవ్రంగా నష్టం జరిగింది. మిగిలింది చేనులో పశువులకు మేతకు తప్ప వరి పంట దేనికి పనికి రాకుండా పోవడంతో రైతులు లబోదిబో అంటున్నారు. ఇప్పటికే వరిధాన్యం కొనేందుకు ఐకెపి సెంటర్లు ప్రారంభించింది.అకాల పిడుగుతో రైతులకు అరిగోస తప్పడం లేదు.అన్నదాతలు ఆగమాగం కాకుండా, అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సాధారణ ధర మాదిరిగానే కొంటామని స్పష్టం చేసి గుండె చెదరకుండా భరోసా కల్పించింది.ఇప్పటికే ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అంటూ పురుడు పోసుకున్న భారత రాష్ట్ర సమితి అడుగడుగునా ఆపన్న హస్తం అందించింది. రాజకీయాల్లోకి రావడం గొప్పకాదు… కలకాలం నిలబెట్టుకోవ డంలోనే ఉంది గొప్పతనం అంతా. అది ప్రజల గుండెలోతుల్లో చిరస్థాయిగా నిలవగలిగే పనులు చేసినప్పుడే సాధ్యపడుతుంది. చేతికి వచ్చిన పంట చెల్లా చెదురవ్వడంతో రైతన్న కుంగి పోకుండా ఆర్థికంగా తెలంగాణ ప్రభుత్వానికి భారమైనా నష్టాన్నితీర్చే పనిలో పడ్డది. తెలంగాణ రాష్ట్ర అవతరణ నుంచి అన్నదాతల కష్టాన్ని, దుఃఖాన్ని దగ్గరుండి పంచుకున్న నాయకుడు, కడుపులో పెట్టి చూసుకునే దార్శనికుడు కేసీఆర్ రైతన్నల కంటి తడిని తూడ్చేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం రైతుబంధు, రైతుభీమా, సాగునీళ్లు, ఉచితంగా 24 గంటల నాణ్యమైన కరెంటు అందించి,దేశానికే దిశానిర్ధేశం చేస్తున్నాయి.
వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కేంద్రానికి ఎప్పుడు లేదు. జపాన్, జర్మనీ వంటి దేశాల్ని చూస్తే మన పాలకులకు సోయి ఉండాలికదా? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే భారత్‌ను చెప్పుకోవాల్సిన దుస్థితి. దేశానికి ఒక వ్యవసాయ విధానమే లేదు.రైతులు ఆత్మహత్యలకు మూలాలు కనుకోకుండా నల్ల చట్టాలు తెచ్చినప్పుడే రైతులపై ప్రేమ కనబడ్డది. రైతు ఆదాయం రెట్టింపు చేస్తానని అబద్దాలను అద్భుతంగా ప్రచారం చేసుకోవడానికి మోడీ ప్రభుత్వం ‘మన్ కి బాత్ ‘100 ఎపిసోడ్స్ చేసింది. ‘‘జన్ కీ బాత్’’ బీజేపీకి అవసరం లేదు. తెలంగాణ రైతుబంధు ను కాపీకొట్టి కిసాన్ సమ్మాన్ నిధిని తీసుకొచ్చింది. కేంద్రం కోయిల పేరుతో కాకి రాగాలు తీస్తూ సప్తరుషి పేరుతో దుశ్శాసన విధానాలు తీసుకొస్తున్నది. అమృత కాలం అంటూ రైతుల నడ్డి విరుస్తున్నది. అదానీ కి దోచిపెట్టే పనిలో నిమగ్నమైంది. సబ్సిడీలను ఎత్తివేసి రైతులకు భారం పెంచడం ఏ అమృత కాలం అవుతుందో చెప్పాలి. అందుకే దాన్ని భారతీయ జనతా పార్టీ అని కాకుండా బిజినెస్ జనతా పార్టీ అంటారు. ఇంతటి సిగ్గుమాలిన జాతీయ వాదంతో దేశాన్ని పాలిస్తున్న నేటి పార్టీలకు విరుగుడుగా ప్రత్యామ్నాయ జాతీయ నాయకత్వంతో ముందుకు వస్తున్న ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ దేశ్ కి నేత కేసీఆర్ ను నిలువరించడానికి కుట్రలు చేస్తున్నది. వ్యవసా య రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నం అడుగడుగునా జరుగుతుంది. ఎద్దు ఏడ్చిన ఎవుసం… రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డ చరిత్ర లేదు.
డా।। సంగాని మల్లేశ్వర్
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్, 9866255355




