అనితరసాధ్యం గాంధీ ని(యి)జం..!

ఈ శతాబ్దపు వివిధ రంగాల్లో ప్రపంచ ప్రముఖులుగా వున్న ఆల్బర్ట్‌ ఐన్‌ స్టీన్‌,ఆంగ్‌ సాన్‌ సూకీ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌,సివిరామన్‌, బెర్నార్డ్‌ షా, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, దలైలామా, నెల్సన్‌ మండేలా, స్టీవ్‌ జాబ్స్‌, కైలాష్‌ సత్యార్థి, బరాక్‌ ఒబామా, చార్లీ చాప్లిన్‌ తదితరులు వంటి వారు సైతం  గాంధీజీ నుంచి స్ఫూర్తి పొందిన వారే. ఈ శతాబ్దపు అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ప్రముఖంగా వినిపిస్తూ కనిపించే వ్యక్తిత్వపు హిమగిరి శక్తి పేరు గాంధీజీ.కొన్ని సందర్భాల్లో జీసస్‌,గౌతమ బుద్ధుడు, శ్రీకృష్ణుడు వంటి వారి బోధనలను ఆచరించి చూపిన కారణజన్ముడు, యుగపురుషుడు గాంధీజీ అని ప్రముఖులు పోల్చుతుంటారు.

సత్యం, అహింస పునాదులపై విశ్వమానవతా ప్రేమ శిఖరాన్ని తన సందేశంగా,మన దేశపు ముఖచిత్రంగా నిలిపిన వారు గాంధీజీ.ఆయన మార్గంలో నడిచి ఎంతోమంది నోబెల్‌ బహుమతులు గెలిచారు.కొన్ని కారణాల వల్ల గాంధీజీకి నోబెల్‌ బహుమతి ప్రకటించలేకపోయినందుకు  నోబెల్‌ కమిటీ విచారం వ్యక్తంచేసింది.ఎన్నో ప్రపంచ స్థాయి ఉద్యమాలకు సత్యాగ్రహం, నిరాహారదీక్ష వంటి శాంతియుత మార్గాలే హైవేలుగా పనిచేశాయి. పనిచేస్తున్నాయి.ఫలితాలు వచ్చాయి. వ్యవసాయం, వ్యాపారం,విద్య,వైద్యం, సైన్స్‌, పర్యావరణం వంటి ఏరంగాల్లోనైనా ఆయన జీవిత పరిశోధనలే నేడు మనం అనుసరిస్తున్న పాఠ్యాంశాలు అయ్యాయి.ప్రేమతో,సామరస్యంతో ద్వేషంపై గెలవొచ్చని,సహానం మించిన సింహాసనం లేదని,యుద్దం పేరుతో అధిపత్యం మాయలో మనుషుల్ని చంపడం దారుణమని మతోన్మాదం మంచిది కాదని ఏనాడో హెచ్చరించారు గాంధీజీ. ప్రపంచ ఆకలిని తీర్చే అన్నం పెట్టే రైతన్న మన దేశపు ఆత్మగా అభివర్ణించారు.కార్మికులు, సైనికుల త్యాగం గొప్పదన్నారు.

అస్పృశ్యత, అంటరానితనం ,అజ్ఞానం, పేదరికం, నిరుద్యోగం, అసమానతల వంటి మహామ్మారులను ఈదేశం నుంచి తరిమేయాలని చరిత్ర వెంట పాదయాత్రచేసి ప్రజల్లో చైతన్యం నింపారు. మూడవ ప్రపంచ యుద్ద పోకడలు కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో యావత్‌ ప్రపంచానికి ఒకే ఒక దిక్సూచి గాంధీజీ.కన్నుకు కన్నే సమాధానం అయితే ఈ ప్రపంచం గుడ్డిదయిపోతుందంటూ మరో న్యూటన్‌ భౌతిక శాస్త్ర గురుత్వాకర్షణ నియమం లాగా ఓ బతుకు శాస్త్ర మా’’నవ’’ ఉనికి నియమం ఏనాడో చెప్పారు. గ్లోబల్‌ వార్మింగ్‌ తో పర్యావరణాన్ని నాశనం చేస్తున్న నేటి ఆధునిక మానవుని గురించి ‘‘ప్రకృతి మన అవసరాలను మాత్రమే తీరుస్తుంది మన కోరికలను కాదని ‘‘  చించాడు.పట్టణీకరణ ముసుగులో మన గ్రామాలే ఈ దేశానికి పట్టుకొమ్మలు అన్న విషయాన్ని మరువకూడదన్నారు.ఆయుర్వేదం, ధ్యానం వంటి ఆరోగ్య విధానాలను తను ఆచరించి నేటి తరానికి ఆదర్శమయ్యారు. గాంధీజీ ఆత్మ కథ ‘‘మై లైఫ్‌ ఎక్సఫర్‌ మెంట్స్‌ విత్‌ ట్రూత్‌’’(సత్యంతో నా జీవిత ప్రయోగాలు) పుస్తకం ప్రఖ్యాత గ్రంథం బైబిల్‌ స్థాయి గుర్తింపు పొందింది.ఇలాంటి ఎన్నో సజీవ సాక్ష్యాలతో మనం రాసుకుంటూ పోయిన గాంధీజీ జీవన సంద్రంలో ఓ నీటిబొట్టుగా చెప్పగలం.

ప్రపంచస్థాయిలో విశ్వమానవుడిగా అ’సాధారణ’ వ్యక్తిగా విశేష ప్రాచుర్యం పొందిన గాంధీజీని నేడు మన భారతీయులలో కొంతమంది కులం,మతం కోణంలో చూస్తూ, చూపిస్తూ సంకుచితంగా ఆలోచించడం మనం ఆందోళన చెందాల్సిన విషయం.మన దేశ స్వాతంత్య్ర సంగ్రామానికి మాత్రమే ఆయనను పరిమితం చేస్తూ కొన్ని రాజకీయ పార్టీలు చేసే రాజకీయ నాటకీయపు పరిణామాలు ఇకనైనా ఆపాలి.అందరివాడుగా వున్న ఆయనను కొందరివాడుగా చేయడం మానుకోవాలి. గాంధీజీ పుట్టిన దేశం అంటూ ప్రపంచం మనల్ని గౌరవిస్తున్న తీరుతో ప్రతి భారతీయుడి గుండె గర్వపడాలి.ఆయన కలలుకన్న విశ్వశాంతి వికాసానికి మనమంతా సమిధలు కావాలి.విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌ స్టీన్‌ ‘‘రక్తమాంసాలతో కూడిన గాంధీజీ లాంటి యుగపురుషుడు ఈ భూమిపై నడిచాడంటే భవిష్యత్తు తరాలు నమ్మవు.’’ మరియు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’’జీసస్‌ చెప్పెను.గాంధీజి చేసెను’’ అంటూ గాంధీజీకి అందించిన అక్షర నివాళి ఇంకా కొన్ని శతాబ్దాలు గాంధీని(యి)జం ను వేలకోట్ల తారల వెలుగై సత్యంతో ప్రకాశించేలా చేస్తాయి.

ఫిజిక్స్‌ అరుణ్‌కుమార్‌
మోటివేషనల్‌ స్పీకర్‌, కవి, రచయిత, సామాజిక కార్యకర్త
9394749536
నాగర్‌ కర్నూల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *