ఏసుక్రీస్తు జన్మదినాన డిసెంబరు 25న జన్మించిన మరో ఇరువురు మహానుభావులను స్మరించుకుందాం. వారే.. మదన్ మోహన్ మాలవ్య, అటల్ బిహరి వాజ్ పేయీ!! ఒకే తేదీన జన్మించిన ఆ ఇరువురికీ 2014 లో ఒకే సారి భారతరత్న పురస్కారాలు లభించడం దేశానికే గర్వకారణం.
మాననీయుల్లో మహనీయుడు మదన్ మోహన్ మాలవ్య
గొప్ప విద్యావేత్త, కర్మయోగి అయిన పండిత మదన్ మోహన్ మాలవ్య భగవద్గీతను జీవితంలో తు.చ. తప్పక పాటించిన నిష్టాగరిష్ఠుడు. భారతీయులకు ‘మహాత్మ’ అనగానే మొదటిగా గుర్తొచ్చే పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కాగా, అలాంటి గాంధీ చేతనే ‘మహామాన’ బిరుదు పొందిన నేత పండిట్ మదన్ మోహన్ మాలవ్య.1861, డిసెంబర్ 25 తేదిన అలహాబాదులో మూనాదేవి, బ్రిజ్‌నాథ్ దంపతులకు జన్మించిన మాలవ్య పూర్వీకులు మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతం నుండి వలస వచ్చారు. అందుకే ఆయన ఇంటి పేరు కూడా మాలవ్యగా సార్థకమైంది. ఆయన అసలు ఇంటి పేరు “చతుర్వేది”. పాఠశాల రోజులలోనే మకరంద్ కలంపేరుతో కవిత్వం రాయడం ప్రారంభించారు. 1879లో అలహాబాద్ సెంట్రల్ కళాశాల నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. పట్టభద్రులయ్యారు. అనతరం ఉపాధ్యాయునిగా జీవితాన్ని మొదలుపెట్టారు. న్యాయశాస్త్రంలో కూడా పట్టా పొందారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడైన ఆయన యుక్త వయస్సులో హిందుస్తాన్(హిందీ), ది ఇండియన్ యూనియన్(ఇంగ్లీషు) రెండు దినపత్రికలను స్థాపించారు. భారత జాతీయ కాంగ్రెస్ కు 1909లో, 1918లో అధ్యక్షునిగా పనిచేసారు..
మాలవ్య బాల్యం నుంచే వేదాధ్యయనం చేశారు. సైమన్ కమిషన్ ను లాలా లజపతిరాయ్, జవహర్ లాల్ నెహ్రూ, ఇతర స్వాతంత్ర్య సమరయోధులతో కలసి వ్యతిరేకించారు. 1931 సంవత్సరంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మాగాంధీతో కలసి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిథ్యం వహించారు. న్యాయ శాస్త్ర అధ్యయనం పిదప 1891 లో ఆయన అలహాబాద్ జిల్లా కోర్టులో న్యాయవాద వృత్తి మొదలెట్టారు. ఆ తరువాత రెండేళ్లకు హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. 1912 నుంచి ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా, ఆతరువాత 1926 వరకూ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యునిగా కొనసాగారు. 1930 లో ప్రధమ రౌండ్ టేబిల్ సమావేశంలో ప్రతినిధిగా పాల్గొన్నారు. సత్యమేవ జయతే నినాదానికి అద్భుత ప్రాచుర్యం మాలవ్య వలననే లభించింది.
గంగా నది పరిరక్షణ కోసం ‘గంగా మహాసభ’ పేరుతో ఆయన ఉద్యమానికి బీజం వేశారు. భారతీయ స్కౌట్స్, గైడ్సు వ్యవస్థాపకులలో మాలవ్య ఒకరు. బ్రిటీష్ నియంతల రాజ్యానికి ఊతమిచ్చేందుకు ప్రారంభించిన సైమన్ కమీషన్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన లాలా లజపతి రాయ్, జవహర్ లాల్ నెహ్రూ ఇత్రత్రా స్వాతంత్ర సమర యోధులతో గళం కలిపారు.. జీవితకాలం బ్రహ్మచారిగానే గడిపారు. “సత్యమేవ జయతే నినాదాన్ని వ్యాపింపచేసిన గొప్ప విద్యావేత్త, కర్మయోగి. పలువురి మార్గంలో నడిచి కులమత భేదాలను పోగొట్టడానికి ప్రయత్నించారు. 1946 నవంబర్ 12న దివంగతులయ్యారు. 2014 లో మాలవ్యాకు నాటి రాష్ట్రపతి భారతరత్న పురస్కారం ప్రకటించారు.
సిద్ధాంతానికి బద్ధుడైన రాజనీతిజ్ఞుడు వాజ్‌పేయీ..
అత్యున్నత విలువలున్న భారతీయుడు, కవి, గాయకుడు, ద్రష్ట, మేధావి, భాషా ప్రవీణుడు, సంఘ్ కార్యకర్త, సాత్వికుడు, సంస్కృతీ, సాంప్రదాయ విలువలకు పట్టం కట్టిన రాజకీయ వేత్త, పాలకపక్షం ప్రశంలందుకున్న ప్రతిపక్ష నేత కలగలిపిన ఒక అరుదైన రాజనీతిజ్ఞుడు అటల్ బిహారి వాజ్‌పేయీ. 1924, క్రీస్తు జన్మదినాన పుట్టిన గొప్ప మానవతా వాది. ఆయన చూపిన బాట నేటితరం రాజకీయాలకు ఆదర్శం. వాజపేయి గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేసి, గ్వాలియర్ విక్టోరియా కళాశాల (ప్రస్తుతం లక్ష్మీబాయి కళాశాల)లో హిందీ, ఆంగ్లం, సంస్కృతంలో అత్యంత ప్రతిభతో పట్టభద్రుడైనారు. కాన్పూరు లోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాలనుండి రాజనీతిశాస్త్రంలో ఎం.ఎ పట్టాను పొందారు. ఎం.ఎ డిగ్రీని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు. అజాత శత్రువే అయినా దేశానికి దిశాదశా చూపిన ధీశాలి. పోఖ్రాణ్ అణుపరీక్షలు, కార్గిల్ యుద్దం ఆయన ధీరోదాత్తతకు నిదర్శనాలు. ఆయన ఉదాత్త లక్షణాలే దేశానికి ఆలంబనగా నిలిచాయి. వివిధ రంగాల్లో ఆయన చూపిన ప్రతిభ అనన్య సామాన్యం. దేశ అభివృద్ది కోసం తీసుకున్న అనేకానేక నిర్ణయాలు భారత్ ఇవాళ తలెత్తుకుని ముందుకు సాగేలా చేశాయి. పోఖ్రాన్ అణుపరీక్షలు కావచ్చు, కార్గిల్ యుద్దం కావచ్చు ఆయన ధీరోదాత్త నాయకత్వానికి నిదర్శనాలు. ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించి భారత్ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేశారు.
పోతనలా సహజ పాండిత్య గరిమతో అలరారే నేతలలో వాజ్‌పేయీ అగ్రగణ్యులు. ప్రతి పక్ష నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయీని తన గురువుగా అంగీకరించి అయన ద్వారా తానూ ఎంతో ఉత్తేజం పొందానని పార్లమెంటులో పేర్కొన్న దివంగత ప్రధాని పి వి నరసింహా రావు వాజ్‌పేయీకి ఉత్తమ పార్లమెంటేరియన్ బహుమతి ప్రకటించారు. వాజ్‌పేయీ నిజంగా భారత అనర్ఘరత్నం.. ప్రతిపక్షంలో ఉన్నా ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ ఇందిరా గాంధీని సైతం శ్లాఘించిన ప్రజాస్వామ్య వాది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఎటువంటి పదవి ఆశించకుండా ప్రజల సమస్యలను లేవనెత్తేవారు. దేశంలో నాలుగు రాష్ట్రాల నుంచి పోటీ చేసి గెలిచిన ఏకైక వ్యక్తి ఆయనే. వాజ్‌పేయీ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్ ల నుంచి పోటీ చేశారు. అలాగే దేశం లోని ఏడు నియోజక వర్గాల నుంచి గెలిచిన ఒకే ఒక్క నాయకుడు. మూడు పర్యాయాలు ప్రధాన మంత్రి పది అధిష్ఠించారు.
ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తన సిద్దాంతాలను వదలని గొప్ప వ్యక్తిత్వం అటల్‌జీ ది. ఆయనకు దేశంలో కెలా అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2014లో ప్రకటించారు. రాజకీయాల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. ఆయనో గొప్ప రోల్ మాడల్. ఆయన ఆరోగ్యం ఎలాఉందో? ప్రపంచానికి తెలియకుండా అజ్ఞాతంలో ఉన్నారయన. చివరకు పార్టీలో కూడా ఆయన్ను తలుచుకున్నవారే కరవయ్యారు. ప్రపంచానికి తెలియకుండా అజ్ఞాతంలో కొన్నేళ్ళుగా ఉండి ఆగస్ట్ 16, 2018 స్వర్గస్తులయ్యారు. . ఒక అనర్ఘరత్నం మాయమైంది.
నందిరాజు రాధాకృష్ణ, వెటరన్ జర్నలిస్ట్




