మేడ్చల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19 : మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాకు సంబంధించిన ఐదుగురు ఎమ్మెల్యేలు అసమ్మతి గళం ఎత్తారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నామని ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంత్ రావు, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, వివే&ఆనంద, బేతి సుభాష్ రెడ్డి వాపోయారు. ఈ క్రమంలో మైనంపల్లి నివాసంలో సమావేశమైన ఐదుగురు నేతలు మల్లారెడ్డి అంశాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. మంత్రి పెత్తనంపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మల్లారెడ్డి కారణంగా మేడ్చల్ జిల్లాలోని పదవులన్నీ మేడ్చల్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతున్నాయని ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.
ఆదివారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ విషయం కేటీఆర్ వరకు వెళ్లిందని, రాత్రికి రాత్రే జీవో పాస్ చేసి భాస్కర్ యాదవ్ అనే వ్యక్తితో ప్రమాణ స్వీకారం చేయించాడని మైనంపల్లి ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి అవకాశం ఇచ్చిన వ్యక్తులకే మళ్లీ మళ్లీ పదవులు కట్టబెడుతూ పంతం నెగ్గించుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తాము సమావేశమయిన వార్త మీడియాకు పొక్కడంతో వారు సమావేషమయిన అంశానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. అపోహలకు తావివ్వకుండా తమ అభ్యంతరాలను మీడియా ద్వారా సిఎం కెసిఆర్‌కు, మంత్రి కెటిఆర్‌కు తెలియజేస్తున్నామని ఎంఎల్‌ఏలు మైనంపల్లి, వివేకానంద వివరించారు.




