అధికారానికి సోపానమవుతున్న పాదయాత్రలు

రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు చేపడుతున్న పాదయాత్రలు ఆయా పార్టీల ఎన్నికల ప్రచార యాత్రలుగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తున్న హడావిడి రేపోమాపో ఎన్నికలు జరుగనున్నాయా అన్నంత సందడిగా తయారైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌నుండి రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ఈ పాదయాత్రల పరంపరను  కొనసాగిస్తున్నాయి. 2024లో జరుగనున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రజల్లోకి చొచ్చుకు పోవడానికి ఆయా పార్టీలు ఈ పాదయాత్రల ప్రక్రియను ఎంచుకున్నాయి.  పాదయాత్రలు అధికారానికి సోపానమన్న నమ్మకం ఆయా పార్టీలు బలంగా నమ్ముతున్నాయి. వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారం విషయంలో అధికార పార్టీని నిలదీసేందుకు మార్గంగా ఎంచుకున్న పాదయాత్రలు ఇప్పుడు ఆయా పార్టీల ప్రచార యాత్రలుగా మారాయి.

అధికార పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన విషయాలపై విమర్షనాస్త్రాలను సంధించడంతోపాటు, భవిష్యత్‌లో తాము అధికారానికి వొచ్చే క్రమంలో చేపట్టే సంక్షేమకార్యక్రమాలను వివరిస్తూ  ప్రజలను ఆయా పార్టీలు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. నిన్న మొన్నటివరకు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ‌ప్రజా సంగ్రామ యాత్ర పేరున ఇప్పటికి అయిదు విడుతల పాదయాత్రతో దాదాపు తెలంగాణ రాష్ట్రాన్ని చుట్టబెట్టిన విషయం తెలిసిందే. వందల కిలోమీటర్ల మేర యాత్రలను కొనసాగించిన ఆ పార్టీ, ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి రాష్ట్ర పర్యటనకు సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా దాదాపు పదకొండు వేల కార్నర్‌ ‌మీటింగ్‌లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. అందుకుగాను ఇప్పటికే ఎనిమిది వందల మంది నాయకులను ప్రత్యేకంగా గుర్తించిందికూడా.  ప్రస్తుతం కాంగ్రెస్‌, ‌వైఎస్‌ఆర్‌టిపి నేతలు ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డా. వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి చేసిన పాదయాత్ర సంచలనాన్ని కలిగించింది.

దాదాపు రెండు నెలలపాటు పదిహేను వందల కిలోమీటర్లకు పైగా ఆనాడు ఆయన చేసిన పాదయాత్ర ఆయనకు అధికారాన్ని కట్టబెట్టింది. 2004లో ఆయన అనూహ్యంగా అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలియందికాదు. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాడుతున్న తరుణంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ‘మీకోసం’ అంటూ చేపట్టిన పాదయాత్ర ఆయనకు విజయాన్ని చేకూర్చింది. సుమారు పదిహేడు వందల కిలోమీటర్లమేర పాదయాత్ర చేసిన ఆయనకు ఏపి ప్రజలు అఖండ మెజార్టీనిచ్చి, 2014లో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారు. విచిత్రమేమంటే అదే ఏపి ప్రజలు 2019లో వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డికి ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు. అందుకు జగన్‌కూడా ‘ప్రజా సంకల్ప యాత్ర’ పేరున దాదాపు మూడు వందల నలభై రోజులు అంటే 2017 నవంబర్‌నుండి 2018 ఏప్రిల్‌ ‌వరకు సాగించిన పాదయాత్ర ఫలితాన్నిచ్చింది.

జగన్‌ ‌జైలు శిక్ష అనుభవిస్తున్న క్రమంలో ఆయన సోదరి వైఎస్‌ ‌షర్మిల తాను జగనన్న విడిచిన బాణంగా చెప్పుకుంటూ దాదాపు మూడు వేల కిలోమీటర్లమేర యాత్రను సాగించిన విషయం తెలియందికాదు. అదే షర్మిల ఇప్పుడు తాను తెలంగాణ ఇంటి కోడలినంటూ  దాదాపు సంవత్సరం కాలంగా వాయిదాల పద్దతిమీద  ప్రజా ప్రస్తానం పేరున  2021 అక్టోబర్‌ 21‌న ఆమె తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఎంచుకునే  చేవళ్ళ నుండి యాత్రను  ప్రారంభించింది. నేటికీ  కొనసాగిస్తూన్న పాదయాత్ర ఆమె అధికారానికి రావడానికి సోపానమవడం విషయం ఎలా ఉన్నా అధికార బిఆర్‌ఎస్‌ ‌పార్టీని గద్దె దింపాలన్న లక్ష్యంగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఏ నియోజకవర్గంలో కాలుపెడితే అక్కడి స్థానిక నాయకత్వం లోపాలను ఎత్తి చూపుతోంది. ఈ పాదయాత్రల సందర్భంగా ప్రధానంగా ఆమె తన తండ్రి పేరును పలుమార్లు ఉచ్చరించడంద్వారా ప్రజల సానుబూతిని పొందేప్రయత్నం చేస్తోంది.

ఇటీవలనే మూడు వేల అయిదు వందల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న షర్మిల ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో పర్యటిస్తోంది. అనేక తర్జనబర్జన తర్వాత కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరవై నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టేందుకు ఆ పార్టీ అధిష్ఠానం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా మేడారం సమ్మక్క, సారలమ్మల ఆశీర్వాదంతో ప్రారంభించిన ‘చెయ్యి చెయ్యి కలుపుదాం’ పాదయాత్ర ఇంకా పాత వరంగల్‌  ‌జిల్లాలోని వివిధ  నియోజకవర్గాల్లో కొనసాగుతున్నది. ఈ సందర్భంగా ఆయన అధికార పార్టీపైన, ఆ పార్టీ అధినేత చంద్రశేఖర్‌రావుపైన  చేస్తున్న ఘాటైన విమర్శలపై  రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రధానంగా ప్రజలసొమ్ముతో కట్టిన ప్రగతిభవన్‌లో సామాన్యులకే కాదు, ప్రతిపక్ష నాయకులకు, అధికార పక్ష నాయకులకు ప్రవేశంలేకపోవడమన్నది వివాదగ్రస్తమైంది. ప్రజలకు పనికిరాని ప్రగతి భవన్‌ను బాంబులతో పేల్చివేయాలనడం, అదికూడా నక్సలైట్లను కోరడమన్నది వివాదానికి దారితీసింది.

ఇదిలాఉంటే అత్యధిక సంఖ్యలోఉన్న బహుజనులకే రాజ్యాధికారం కావాలంటూ ‘బహుజన రాజ్యాధికార యాత్ర’ పేరున, బహుజనసమాజ్‌వాదిపార్టీ అధినేత, మాజీ ఐపిఎస్‌ అధికారి ఆర్‌ ఎస్‌ ‌ప్రవీణ్‌కుమార్‌ ‌గత ఏడాది మార్చ్ ఆరున ప్రారంభించిన యాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తంమీద పాదయాత్రలు అధికారానికి సోపానమన్న నమ్మకం ఏర్పడడంతో అటు ఏపి, ఇటు తెలంగాణలో యాత్రల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వైఎస్‌ఆర్‌, ‌వైఎస్‌ ‌జగన్‌, ‌చంద్రబాబులా ఈ యాత్రలు మరెందరిని అందలం ఎక్కిస్తాయో వేచి చూడాల్సిందే మరి.

image.png
మండువ రవీందర్‌ ‌రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *