- గిరిజనులకు ఫారెస్ట్ రైట్స్ కింద భూములను అందజేస్తాం
- ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులను ఆదుకుంటాం
- భారత్ జోడో యాత్ర సందర్భంగా చేనేత, పోడు రైతుల ప్రతినిధులకు రాహుల్ గాంధీ భరోసా
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర: 2023 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేనేత ఉత్పత్తులపై జిఎస్టీని ఎత్తివేస్తామని, గిరిజన పోడు భూములను రెవెన్యూ రికార్డులోకి ఎక్కించి న్యాయం చేస్తామని, ఫారెస్ట్ రైట్స్ కింద గిరిజనులకు భూములను అందచేస్తామని చేనేత, పోడు రైతుల ప్రతినిధులకు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. శుక్రవారం తెలంగాణలో మూడోరోజు భారత్ జోడయాత్రలో రాహుల్ తన పాదయాత్రను మరికల్ మండలం యలిగండ్ల నుంచి ప్రారంభించారు. మరికల్, దేవరకద్ర మీదుగా యాత్ర సాగి, గోప్లపూర్ కలాన్‌లో విరామం తీసుకున్న అనంతరం పాదయాత్ర కొనసాగింది. భోజన విరామ సమయంలో చేనేత పోడు భూముల ప్రతినిధులతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. చేనేత పోడు రైతుల ప్రతినిధులు సమస్యలను రాహుల్ గాంధీకి వివరించారు.
ఇందిరమ్మ హయాంలో ఇచ్చిన భూములను ప్రస్తుత ప్రభుత్వాలు తమ వద్ద నుండి బలవంతంగా లాక్కుంటున్నారని అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 సంవత్సరం నుండి గిరిజనులకు ఇప్పటివరకు ఒక్క ఎకరం కూడా భూమి ఇవ్వలేదని రాహుల్ గాంధీకి తెలిపారు. అటవీ హక్కుల చట్టం కింద 2006 సంవత్సరంలో ప్రవేశపెట్టినప్పటి నుండి 2013 నాటికి 96,000 మందికి మాత్రమే భూమి ఉందని తెలిపారు. 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకు మూడు లక్షల పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయని వివరించారు. చేనేత ప్రతినిధులు అనేక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పైగా చేనేత ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీని భారం ముఖ్యమంత్రి కేసీఆర్ వేసారని, అలాగే ఉత్పత్తుల అమ్మకాల్లోనూ అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని తెలపడంతో చేనేత ఉత్పత్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీఎస్టీని ఎత్తివైస్తామని అలాగే చేనేత అన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పోడు భూముల రైతుల విషయంలోనూ రాహుల్ గాంధీ స్పష్టమైన హామీ ఇచ్చారు.
2014 సంవత్సరం నుండి ఉన్న మూడు లక్షల పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను అధికారంలోకి రాగానే వెంటనే వాటిని క్లియర్ చేస్తామని అలాగే రెవెన్యూ రికార్డులోకి ఎక్కించి గిరిజనులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. యాత్రలో కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్, ఏఐసీసీ నేత కేసీ వేణు గోపాల్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అలాగే నవంబర్ 1న రాహుల్ పాదయాత్రలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పాల్గొంటున్నట్టుగా పార్టీ నాయకులు తెలిపారు.




