బమ్మిడి జగదీశ్వరరావు
ఈరోజుల్లో బరువు పెరగడం సర్వసాధారణం. నా బరువు కథ తేలికగా అర్థమయ్యేలా చెపుతాను. నన్ను చిన్నప్పుడంతా యెత్తుకు మోశారు. ఇప్పుడు కూడా నన్ను యెవరన్నా యెత్తుకు మోస్తే బాగుణ్ణనిపిస్తుంది. ‘ఎత్తుకుంటే యెత్తుమరిగిపోతారు’ అని చిన్నప్పుడు అమ్మ హెచ్చరించేది. మనల్ని యెవరన్నా మోయడం మనకి బాగుంటుంది. కాని అమ్మమాట గుర్తొచ్చినప్పుడల్లా అదొకజబ్బని గుర్తుచేస్తున్నట్టే వున్నా జబ్బు జీవసహజం అని సరిపెట్టుకోవడం యింకా బాగుంటుంది.
మనకోసం యెవరన్నా పాట పాడడం బాగుంటుంది. మనకోసం యెవరన్నా డప్పుకొట్టడం కూడా బాగుంటుంది.కాని పాడేవారు డప్పు కొట్టేవారు లేనప్పుడు ఆ నిశ్శబ్దం భరించడం బహుకష్టంగా వుంటుంది. అప్పుడు మనపాట మనమే పాడి అందర్నీ ఆకట్టుకోవడం అద్భుతకళగా అనిపిస్తుంది. అలాగే యెవరూ డప్పు కొట్టేవారు లేనప్పుడు మన డప్పు మనమే కొట్టుకోవడం అద్భుతాతిఅద్భుతకళగా అనిపిస్తుంది. అయితే మనకి పాడినవాళ్ళకి మనం తిరిగి పాడాల్సివస్తుంది. డప్పుకొట్టినవాళ్ళకి తిరిగి డప్పు కొట్టాల్సివస్తుంది.లేదంటే మానేస్తారనే కాదు, యిచ్చిపుచ్చుకోవడం మానవ ధర్మమనిపిస్తుంది. ‘ఇందమ్మా అంటే అందమ్మా’ అని సామెతే వుంది. ‘ఇస్తినమ్మా వాయనం… పుచ్చుకుంటినమ్మా వాయనం’ అనేది సోబత్తు. నా వీపు నువ్వు గోకితే నీవీపు నేను గోకుతా.
పాడనప్పుడు ఆడలేం. డప్పు లేనిదే పదం పడదు.పథం తెలీదు! ప్రశంస, పురస్కారం, నిరంతర అభినందన వుత్సాహమిస్తుంది, ఊతమిస్తుంది, విన్నకథే వినడం బాగుంటుంది. అది మన కథవడమేమరింత బాగుంటుంది. ఆ సాంప్రదాయ సాగరంలో అందరూ మునిగితేలడం మహా బాగుంటుంది.
నాకిప్పుడు అడుగుతీసి అడుగువేస్తే బాజా కావాలి, బజంత్రీ కావాలి,మేళముండాలి, తాళముండాలి,ఎత్తుకోవాలి, నెత్తిన పెట్టుకోవాలి. అలా యెత్తుకు మొయ్యడంవల్ల నేను నడక మరచిపోయానని గిట్టనివాళ్ళంటారు.బాగా బరువు పెరిగానని, లాక్షణికులు కీర్తికాయమని, విమర్శకులు వూబకాయమని గుసగుసలాడతారు. సరే- నాకే కాదు, నాలాగ చాలామందికి నడక రాదు, పర్లేదు పల్లకి మోసే మీరున్నారుగా?! నాకేమిటి ముడ్డినొప్పి? అయితేగియితే ఆ నొప్పి మీ అందరిదీ.





