- 1న మహబూబ్‌నగర్..3న ఇందూరులో…
- 1న రూ.13,545 కోట్ల పనులకు, 3న 8,021 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభం
- పలు రైల్వే ప్రాజెక్టుల, జాతీయ రహదారుల పనులకు శ్రీకారం
- 9 ఏళ్లలో తెలంగాణకు 2500 కిలోమీటర్ల హైవేస్
- 800 మెగావాట్ల ఎన్‌టిపిసి విద్యుత్ పవర్ ప్లాంట్ రాష్ట్ర ప్రజలకు అంకితం
- 9 ఏళ్లలో కేంద్రం రాష్ట్రానికి చేసిన అభివృద్ధి పనులపై కెసిఆర్‌తో చర్చకు సిద్ధం
- విలేఖరుల సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 1, 3 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారని కేంద్ర మంత్రి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధాని 1వ తేదీన పాలమూరులో..3వ తేదీన ఇందూరులో పర్యటిస్తారని, ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతోపాటు, పూర్తయిన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కిషన్ రెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ..పర్యటనలో 1న మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా రూ.13,545 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరగనున్నాయని తెలిపారు. రూ.505 కోట్లతో నిర్మించిన మునీరాబాద్-మహబూబ్‌నగర్ ప్రాజెక్టులో భాగమైన..‘జక్లేర్-కృష్ణ’ కొత్త లైన్‌ను జాతికి అంకితం చేస్తారని, ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్-గోవా మధ్య 102 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని తెలిపారు. ఇక కృష్ణ స్టేషన్ నుంచి ‘కాచిగూడ-రాయచూర్-కాచిగూడ’ డెమో సర్వీస్‌ను ప్రారంభిస్తారన్నారు.
జాతీయ రహదారులకు సంబంధించిన రూ. 6,404 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రూ.2,457 కోట్లతో నిర్మించిన ఎన్‌హెచ్ 365 బిబిలో భాగమైన సూర్యాపేట-ఖమ్మం ఫోర్‌లేన్‌ను మోదీ ప్రారంభిస్తారని, దీంతోపాటుగా రూ.2,661 కోట్ల విలువైన హసన్(కర్ణాటక)-చర్లపల్లి హెచ్‌పిసిఎల్ ఎల్‌పిజి పైప్‌లైన్‌ను జాతికి అంకితం చేస్తారని, ఈ ప్రాజెక్టు ద్వారా 37 లక్షల మంది వినియోగదారులకు ఎల్‌పిజి గ్యాస్ అందించే వెసులుబాటు ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 230 కిలోమీటర్ల మేర ఈ పైప్‌లైన్ ఉండగా..ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే 130 కిలోమీటర్ల మేర పైప్ లైన్ ఉంటుందని, తిమ్మాపూర్‌లోని ఐఓసిఎల్ ప్లాంటుకు ఈ పైప్‌లైన్‌ను కనెక్ట్ చేస్తే..అదనంగా మరో 35 లక్షల మంది వినియోగదారులకు గ్యాస్ అందించే అవకాశం ఉందని తెలిపారు. దీంతోపాటుగా.. రూ.1,932 కోట్లతో..కృష్ణపట్నం(ఆంధప్రదేశ్
దేశంలో మౌలికవసతుల కల్పనను వేగవంతం చేసేందుకు ప్రధానమంత్రి మోదీ ‘హీరా’ మోడల్…(హెచ్ – హైవేస్, ఐ- ఇన్ఫోవేస్, ఆర్ – రైల్వేస్, ఏ – ఎయిర్‌వేస్ అభివృద్ధి)తో ముందుకెళ్తున్నారు. తెలంగాణకు రికార్డు స్థాయిలో రూ.లక్షా పదివేల కోట్ల విలువైన జాతీయ రహదారులను కేటాయించారని కిషన్ రెడ్డి తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వొచ్చిన తర్వాత తెలంగాణలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే.. మోదీ అధికారంలోకి వొచ్చిన తర్వాత.. ఈ 9 ఏండ్లలోనే 2500 కిలోమీటర్ల హైవేస్ తెలంగాణ ప్రజలకు వినియోగంలోకి వొచ్చాయని, మరో 2200 కిలోమీటర్ల హైవేలు నిర్మాణంలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ వంటి పలు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు 50 శాతం నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినా.. కేసీఆర్ ప్రభుత్వం సహకరించని కారణంగా ఈ ప్రాజెక్టులు ఆగిపోతున్నాయన్నారు.
ప్రధాని మోదీ చేతుల మీదుగా..తెలంగాణలోని 22 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు ఇటీవలే శంకుస్థాపన జరిగిందని, రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను..అదే విధంగా.. నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల ఆధునీకరణ జరగనుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 34 వందేభారత్ రైళ్లు ఇస్తే..అందులో తెలంగాణకే 3 రైళ్లను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత రైల్వే బడ్జెట్‌ను గణనీయంగా పెంచుతున్నదని, 2014లో తెలంగాణ రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ రూ.258 కోట్లు కాగా…2023లో అది రూ.4,418 కోట్లకు పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాజెక్టులను పేపర్ పైనే చూపించేదని, వారు శంకుస్థాపనలు చేసిన అనేక ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారన్నారు. ప్రత్యేకమైన కార్యాచరణతో రైల్వేవ్యవస్థను మోదీ మెరుగుపరిచారని, ఆధునిక వసతులు, వైఫై సదుపాయం కల్పిస్తున్నారన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రూ.31,221 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని,
ఎయిర్‌పోర్టుల నిర్మాణం విషయంలోనూ.. కేంద్రం చిత్తశుద్దితో పనిచేస్త్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా 2014కు ముందు వినియోగంలో ఉన్న 75 విమానాశ్రయాల సంఖ్యను.. ఈ 9 ఏండ్లలో 150 విమానాశ్రయాలకు పెంచినా..
తెలంగాణలో మాత్రం ఒక్క ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కాకపోవడం దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం కారణంగా.. ఈ పనులు ఆలస్యమవుతున్నాయని అన్నారు. ఎన్నికలు వొస్తున్నాయని..వరంగల్ విమానాశ్రయానికి భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తామని ఏదో ప్రకటన చేసిందని, ఇది కంటితుడుపు చర్య మాత్రమేనని ఆయన దుయ్యబట్టారు. ఆంధప్రదేశ్‌లో విశాఖపట్టణం, రాజమండ్రి, పుట్టపర్తి, కర్నూలు, కడప, విజయవాడ వంటి పలు ఎయిర్ పోర్టులు ఉన్నాయని, మన దగ్గర మాత్రం ఒక్క హైదరాబాద్ లోనే విమానాశ్రయం ఉందన్నారు. ఇక అక్టోబర్ 3న నిజామాబాద్ పర్యటన సందర్బంగా ప్రధానమంత్రి రూ. 8021 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించడం, జాతికి అంకితం చేస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. రామగుండంలోని ఎన్‌టిపిసిలో రూ.6వేల కోట్లతో నిర్మించిన 800 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తారని, ఈ ప్లాంటులో ఉత్పత్తయ్యే విద్యుత్తులో 85 శాతం(680 మెగావాట్లు) తెలంగాణలోనే వినియోగిస్తారని, వొచ్చే డిసెంబర్ నాటికి రెండో ప్రాజెక్టు కూడా పూర్తికానుందని రిషన్ రెడ్డి వెల్లడించారు.
‘అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ’ని ఈ ప్లాంటులో వినియోగించడం ద్వారా.. తక్కువ ధరకే విద్యుత్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వొస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు దేశంలోని ఎన్టీపీసీ పవర్ స్టేషన్లలో అత్యంత ఆధునికమైనది, సమర్థవంతమైనదని తెలిపారు. ఇది తక్కువ బొగ్గును వినియోగించుకోవడంతో పాటుగా, తక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తుందన్నారు. పర్యావరణ అనుకూల ప్రాజెక్టుగా దీన్ని చెప్పుకోవచ్చని, ఇప్పటికే రామగుండంలో 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను కేంద్రం ప్రారంభించిందని, ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రాంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పనకు బాటలు పడతాయని అన్నారు. గత 9 ఏండ్లుగా భారతదేశ విద్యుత్ రంగం గణనీయమైన ప్రగతిని సాధించిందని, గతంలో ఇండస్ట్రియల్ హాలిడేస్ ఇచ్చేవారని, కానీ ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలోనూ విద్యుత్ కొరత లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. సౌత్-నార్త్ గ్రిడ్ కనెక్టివిటీ కూడా మెరుగుపడిందని,రిలయబుల్, అఫర్డబుల్, సస్టేనబుల్ విద్యుత్ ను ప్రజలకు ఇవ్వాలనేది ప్రధాని మోదీ ఆలోచన అని కిషన్ రెడ్డి తెలిపారు. అందుకు తగ్గట్లుగా విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచామని, దీంతోపాటుగా పునరుత్పాద విద్యుత్(రిన్యువబుల్ ఎనర్జీ)కు ప్రత్యేక సహకారం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో రూ. 1,369 కోట్లతో.. 496 బస్తీ దవాఖానాలు, 33 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీస్ తో పాటుగా.. 31 జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ హాస్పిటళ్లలో 50/100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ లను నిర్మించాలనేది ప్రధానమంత్రి మోదీ సంకల్పమన్నారు.
ఇందులో భాగంగా.. 3వ తేదీన 20 జిల్లా కేంద్రాల్లోని హాస్పిటళ్లలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫాస్ట్రక్చర్ మిషన్(పిఎం-ఏబిహెచ్‌ఐఎం)లో భాగంగా రూ. 516.5 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారని రిషన్ రెడ్డి వెల్లడించారు. ఆ జిల్లాలలో వీటి ద్వారా జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ హాస్పిటళ్లలో ఐసోలేషన్ వార్డులు, ఐసీయూలు మొదలైన వాటిని ఆధునీకరిస్తారన్నారు. దీంతోపాటుగా ఇన్‌ఫెక్షన్స్ నివారణతోపాటు ఆక్సీజన్ సప్లయ్ మెరుగుపరిచే చర్యలు కూడా ఇందులో ఉంటాయన్నారు. ఇప్పటికే హైదరాబాద్ సహా వివిధ పట్టణాల్లో బస్తీదవాఖానాలు, ఈఎస్‌ఐ హాస్పిటల్ ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయని, ఏయిమ్స్ ఏర్పాటు చేసుకున్నామని, దీన్ని కూడా ఎప్పటికప్పుడు ఆధునీకరించుకుంటున్నామని ఆయన తెలిపారు. దీంతోపాటుగా రూ.305 కోట్లతో 348 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ (ఎలక్ట్రిఫికేషన్) పూర్తయిన..ధర్మాబాద్(మహారాష్
ప్రధాని జాతికి అంకితం చేస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. రూ. 1200 కోట్లతో 76 కిలోమీటర్ల మేర నిర్మించిన మనోహరాబాద్-సిద్దిపేట కొత్త రైల్వే లైనును ప్రధానమంత్రి ప్రారంభిస్తారన్నారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు అని, భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా..ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ ప్రాజెక్టును నిర్మాణం చేయడం జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. యాదవ సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యమైన కొమురవెల్లి మల్లన్న.. దర్శనార్థం వొచ్చే భక్తులకోసం కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా త్వరలోనే జరగనుందని వెల్లడించారు. అక్కడ రైల్వేస్టేషన్ నిర్మాణంతోపాటు వివిధ ముఖ్యమైన రైళ్లకు స్టాప్ కూడా ఉంటుందని తెలిపారు. ప్రధానమంత్రి ఈ రెండు ప్రాంతాల్లో అధికారిక కార్యక్రమాల ప్రారంభోత్సవం తర్వాత బీజేపీ బహిరంగ సభలకు హాజరవుతారని కిషన్ రెడ్డి తెలిపారు. 9 ఏండ్లలో కేంద్రం 9 లక్షల కోట్లకు పైగా నిధులను తెలంగాణ అభివృదికి ఖర్చుచేసిందని, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో తనకు ఎవరి సర్టిఫికేటూ అవసరం లేదని, తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ తనకుందని ఆయన స్పష్టం చేశారు.
తాము అనేక కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చామని, 26 వేల కోట్లతో రీజనల్ రింగు రోడ్డు తీసుకొస్తే..కేసీఆర్ సర్కారు ఇంతవరకు గజం భూమి కూడా సేకరించి ఇవ్వలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని వొస్తే హాజరు కాని కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా ఉండే నైతిక హక్కు లేదన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా అంటూ కిషన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. దీన్ని తెలంగాణ ప్రజలు అర్ధంచేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక మహిళా రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్ పార్టీ మాట్లాడటం హాస్యాస్పదమని, మొదటి ఐదేళ్లూ మహిళామంత్రి లేకుండా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు మహిళలపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నదని కాషన్ రోడ్డి ఎద్దేవా చేశారు. కొత్తగా ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఎందరు మహిళలున్నారో చెప్పాలని ఈ సందర్భంగా బిఆర్‌ఎస్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. మోటర్లకు మీటర్లు పెడతామని తామెన్నడూ చెప్పలేదని, పథకం ప్రకారం కేసీఆర్ కుటుంబం కుట్రలుపన్నుతున్నదని, తెలంగాణ ప్రజల మనసుల్లో విషబీజాలు నాటుతన్నదని ఆయన మండిపడ్డారు.
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి హైదరాబాద్ వేదికగా వ్యవసాయ మోటర్లకు మీటర్లుండవని స్పష్టంగా చెప్పినా.. మళ్లీ మళ్లీ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే అమరవీరుల దగ్గర చర్చకు వొస్తే.. తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈ 9 ఏండ్లలో తెలంగాణ కోసం కేంద్రం ఏం చేసిందో తాను చెబుతానని, రాష్ట్రం ఏ చేసిందో ఆయన్ను చెప్పుమనండని, మీడియా ప్రతినిధుల సమక్షంలోనే చర్చించుకుందామని, కేసీఆర్‌కు రాజకీయంపై తప్ప..ప్రజాసంక్షేమంపై ఏమాత్రం ఆసక్తి లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. బండి సంజయ్ ఇంటిమీద మజ్లిస్ కార్యకర్తలు చేసిన దుశ్చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, బీఆర్‌ఎస్ పార్టీ, వాళ్ల మిత్రులు కలిసి చేస్తున్న దుందుడుకు చర్యలకు, తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదన్నారు. వారు చేస్తున్న కుట్రలకు సమాజం మరింత ఏకమవుతుంది తప్ప భయపడదని, ఈ చర్యను పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి చర్యలకు భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదని, ఆయనకు తమందరి అండ ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు.




