అం‌పశయ్యపై తెలంగాణ తెలుగుదేశం

కొన ఊపిరితో  కొట్టుమిట్టాడుతున్న వైనం

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తెలుగు నేలపైనే కాదు, భారతదేశ రాజకీయ చరిత్ర లోనే ప్రత్యేకత సంతరించు కుంది. దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకి లేని ఎన్నో ప్రత్యేకతలు తెలుగుదేశంకు సొంతం. నట సార్వభౌముని రాజకీయ రంగ ప్రవేశంతో, ఒకనాడు తెలుగు సీమను ఏకఛత్రాధి పత్యంగా ఏలిన తెలుగు దేశం పార్టీ, 41 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో అనూహ్య ఆటుపోట్లు ఎదుర్కొని, విభక్త ఆంధ్రావనిలో తెలంగాణలో నేడు కరుడుగట్టి కునికి పోవడానికి సిద్ధమైంది. 1978లో ఆంధ్ర ప్రదేశ్లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీ అంతర్గత కుమ్ములాటల వల్ల తరచూ ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్య మంత్రులు మారారు. ముఖ్య మంత్రిని ఢిల్లీలో నిర్ణయించి, రాష్ట్రంలో శాసన సభ్యుల చేత నామకార్థం ఎన్నిక చేయించేవారు. ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం కాంగ్రెస్‌ అం‌టే వెగటు పుట్టే పరిస్థితి ఏర్పడింది. 1981లో ఊటీలో సర్దార్‌ ‌పాపారాయుడు చిత్రం షూటింగు విరామ సమయంలో ఎన్టీఆర్‌ ‌ను ఒక విలేఖరి, మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండు తున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా? అన్న ప్రశ్నలు జవాబుగా తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తరువాతి పుట్టిన రోజు నుంచి నా వంతుగా ప్రతీనెలలో 15రోజులు తెలుగు ప్రజల సేవకోసం కేటాయిస్తాను అని చెప్పారు. ఎన్టీఆర్‌ ‌తన మనసులో మాట బహిర్గతం చేయకుండా తాను నటించ వలసిన సినిమాలు త్వర త్వరగా పూర్తి చేసారు. 1982 మార్చి 21 న హైదరాబాదు రావడం జరిగింది. 1982 మార్చి 29 నాటి మధ్యాహ్నం 2:30లకు కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.

ఆ సమయం లోనే తన పార్టీ పేరు ‘‘తెలుగు దేశం’’గా నిర్ణయించి, పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలెటు వ్యానును బాగు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా (చైతన్య రథం) తయారు చేయించారు. దానిపై నుండే ప్రచారం నిర్వహించారు. ఆ రథంపై రాజకీయాల్లో ఎన్నో రథాలకు ఈ చైతన్య రథమే స్ఫూర్తిగా నిలిచింది. ఎన్టీఆర్‌ ‌ప్రజలను చైతన్య పరుస్తూ చైతన్య రథంపై ఆంధ్ర ప్రదేశ్‌ ‌నలుమూలలకూ ప్రచార యాత్రను సాగించారు. చైతన్య రథమే ప్రచార వేదికగా, నివాసంగా మారి పోయింది. నిరంతరం ప్రయాణిస్తూ, ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచు కున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగ భరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసారు. ఎన్టీఆర్‌ ‌ప్రసంగాలు ఉద్వేగ భరితంగా, ఉద్రేక పూరితంగా ఉండి, ముఖ్య మంత్రులను తరచూ మార్చడం… అదీ ఢిల్లీ పెద్దల నిర్ణయం ప్రకారమే తప్ప, శాసన సభ్యుల మాటకు విలువ లేక పోవడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని తన ప్రసంగాలను మలచు కున్నారు. కాంగ్రెసు నాయకులు అధిష్టానం చేతిలో కీలుబొమ్మలనీ తీవ్ర పదజాలం తో విమర్శించారు. కాంగ్రెసు పార్టీ కారణంగా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బ తిన్నదని, దాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శిస్తూ, సదరు ఆత్మగౌర పరిరక్షణకే తాను రాజకీయాల లోకి వచ్చానని చెప్పారు. కాంగ్రెసు నిర్వాకానికి అప్పటికే విసుగు చెందిన, ప్రజలు ఆయన నినాదం పట్ల ఆకర్షితు లయ్యారు. 1983 జనవరి 7 న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాల ను ప్రకటించారు.

తెలుగుదేశం 199, కాంగ్రెసు 60, సిపిఐ 4, సిపిఎం 5, బిజెపి 3 సీట్లు గెలుచు కున్నాయి. 97 ఎళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీ 9 నెలలు తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడి పోయింది. జాతీయ స్థాయిలో లోక్‌ ‌సభలో ప్రతిపక్షంగా ఉన్న మొదటి ప్రాంతీయ పార్టీగా టీడీపీ చరిత్రలో నిలిచింది. రామారావు మూడు మార్లు ముఖ్యమంత్రిగా 8 సంవత్సరాల పాటు పనిచేశారు. నాదెండ్ల భాస్కరరావు 1983 ఆగస్టులో దొడ్డి దారిన ఎన్టీఆర్‌ ‌పదవిని ఇందిరాగాంధీ సాయంతో లాక్కున్నారు. ఆరోగ్య కారణలతో అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన ఎన్టీఆర్‌ ‌తీవ్ర ఆగ్రహంతో తన ఎమ్మెల్యేలతో ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇందిరా గాంధీ చేసేది లేక తిరిగి ఎన్టీఆర్‌ ‌ను ముఖ్యమంత్రి గా చూడక తప్పలేదు. ఎన్టీఆర్‌ 1984 ‌లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి 200 పైగా అసెంబ్లీ సీట్లు సాధించి రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1989లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారం నుండి తప్పుకుంది.

ఆ 1989 లోక్సభ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే టీడీపీ పరిమితం అయిపోయింది. ఎన్టీఆర్‌ ‌సారథ్యంలో టీడీపీ మొదటి నుంచీ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసింది. 1989లో నేషనల్‌ ‌ఫ్రంట్‌ ‌తరపున వీపీ సింగ్‌ ‌ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో, 1996లో యునైటెడ్‌ ‌ఫ్రంట్‌ ‌తరపున దేవెగౌడ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో, తరువాత ఎన్డీఎలో కీలక పాత్ర పోషించింది. కాంగ్రెస్‌ ‌కు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను చిన్న చిన్న జాతీయ పార్టీలను ఒక తాటి పైకి తెచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ‌కు ప్రత్యామ్నాయంగా ‘‘నేషనల్‌ ‌ఫ్రంట్‌’’ ‌కూటమిని స్థాపించి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని వి.పి.సింగ్‌ ‌ని ప్రధానిని చేశారు. ఎన్టీఆర్‌ ‘‘‌నేషనల్‌ ‌ఫ్రంట్‌’’‌కు చైర్మన్‌ ‌గా వ్యవహరించారు. 1994లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారం లోకి వచ్చింది. రామారావు మూడవ సారి ఆంధ్రపదేశ్‌ ‌ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. లక్ష్మీ పార్వతి పాలనా వ్యవహారాలలో రాజ్యాంగేతర శక్తిగా కలుగ జేసుకుంటున్న ఆరోపణలతో 1995లో, అప్పటి రెవిన్యూ మంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు, రామారావు నుండి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అత్యధిక మంది ఎమ్మెల్యేలు చంద్రబాబుకు మద్దతు ప్రకటించడంతో, ఎన్టీఆర్‌ అధికారం కోల్పో వలసి వచ్చింది. 1995వ సంవత్స రంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేజిక్కించు కున్నారు. అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా  చరిత్ర సృష్టించారు చంద్రబాబు నాయుడు. 1996 జనవరి 18న ఎన్టీఆర్‌ అనారోగ్యంతో తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారు. రాష్ట్ర విభజన కూడా తెలుగు దేశాన్ని కోలుకొని దెబ్బ తీసింది.

ఆంధ్రప్రదేశ్‌ ‌లో ఒకసారి అధికారం చేపట్టినా, జగన్‌ ‌ధాటికి తాళలేక అధికారానికి దూరంగా ఉంటున్నారు. ఉమ్మడి ఏపీలోని పార్టీని, కేవలం ఆంధ్రా పార్టీగా చూపించడంలో కేసీఆర్‌ ‌సఫలం అయ్యారు. తెలుగుదేశం తమను తాము జాతీయ పార్టీగా చెప్పు కుంటుంది. కానీ 2018 ఎన్నికల తరువాత తెలంగాణలో టీడీపీ గుర్తింపు పొందిన పార్టీ హెరీదా కూడా కోల్పోయింది. తెలంగాణ రాష్ట్రంలో తెరాస అధినేత కేసీఆర్‌ ‌నేతృత్వంను సమర్ధిస్తూ, సత్తుపల్లి నుండి గెలుపొందిన సండ్ర వెంకట వీరయ్య, అశ్వరావు పేట నుండి తెదేపా నుండి విజయం సాధించిన ఎ. నాగేశ్వరరావు టిడిపిని వీడి, తెరాసలోకి వలస వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వారినందరినీ తెరాస అధినేత తమ వైపుకు లాక్కున్నారు. నాయకులే కాదు, టీడీపీ కార్యకర్తలు కూడా అదే స్థాయిలో టీఆర్‌ఎస్‌ ‌వైపు వెళ్ళారు. చివరకు తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్‌. ‌రమణ రాజకీయ జన్మనిచ్చిన పార్టీ బంధాలు అనుబంధాలు తెంచుకుని తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్సీ అయ్యారు. అలా ప్రస్తుతం చుక్కాని లేని నావలా తెలంగాణ టిడిపి కనీ వినీ ఎరుగని రీతిలో నామ మాత్రంగా మిగిలి ఉంది.  కాసాని జ్ఞానేశ్వర్‌ ‌టిడిపిని వీడి భారాస తీర్థం పుచ్చుకున్నారు. ప్రసుతం నాయకత్వంలో అత్యంత దయనీయ స్థితిలో కొట్టమిట్టాడుతున్నది. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా లేమని ఆత్మ హత్యా సదృశ నిర్ణయ ప్రకటన చేసిన  తెలంగాణ తెలుగు దేశం ఉనికి నామమాత్రంగా మిగిలి ఉంది.

దేశంలో కమ్యూనిస్టులు, బహుజన పార్టీల  పరిస్థితి దారుణంగా తయారైంది. పైకి లౌకికవాదం, బహుజన వాదం  భుజానకెత్తుకున్నాం అని నీతులు చెబుతున్న చేసేది అవకాశవాద స్వార్థ రాజకీయాలు అనే అపవాదును మూటగట్టుకున్నారు.  గత దశాబ్ద కాలంలో  వామపక్ష పార్టీలలో చేరికలు లేవు.. అనుబంధ సంఘాలలో  సభ్యత్వం మరచిపోయారు.. క్యాడర్‌ ‌లేక కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నారు.  తమ పార్టీ బలోపేతానికి  కృషి చేయకుండా  కొత్త తరం  నాయకులను పెంపొందిం చకుండా  విద్యార్థులకు  యువతకు మార్గదర్శకం కాకుండా వ్యవహరిస్తున్న తీరు ప్రమాదకరంగా మారింది.
 -రామకిష్టయ్య సంగనభట్ల
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *