- మోదీ బహిరంగ సభలు కేవలం ట్రైలర్ మాత్రమే…
- అసలు సినిమా ముందుంది.
- బీఆర్‌ఎస్ రాజకీయ ప్రయాణమంతా అధికారం దాహంతోనే..
- బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ విమర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: తెలంగాణలోజరిగిన ప్రధాని నరేంద్ర మోదీ రెండు సభలు ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ తన అవసరానికి వాడుకునే నేత మాత్రమేనని, అసలు ఛీటర్ బీఆర్‌ఎస్ పార్టీయేనని ఫైరయ్యారు. కేటీఆర్ ఎలాగూ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదనే అక్కసుతో తెలంగాణలో బావబామ్మర్దులు కేటీఆర్, హరీష్ రావు సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గురువారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ సంస్కారహీనంగా గౌరవ ప్రధానిపై విమర్శలు చేయడం చూస్తుంటే తెలంగాణ సమాజం తలదించుకుంటోంది.
2018లో టీఆర్‌ఎస్ తో బిజెపి పొత్తు పెట్టుకోవడానికి తహతహలాడిందని, నాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను వారికి సంకేతాలు ఇచ్చినట్లుగా కేటీఆర్ మాట్లాడటం సిగ్గుమాలిన చర్య. దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. పచ్చి మోసాలకు, అబద్ధాలకు పెట్టింది పేరు బీఆర్‌ఎస్. సిద్ధాంతాలకు లోబడి పనిచేసే పార్టీ బిజెపి. మేం బీఆర్‌ఎస్ తో కలిసి ఏ ఎన్నికల్లో కలిసి పోటీ చేయలేదు. మోదీ.. కేసీఆర్ బండారం బయటపెట్టారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయడానికి కేసీఆర్ ప్రధాని వద్ద వంగివంగి దండాలు పెట్టారు. బుకాయించడం, దబాయించడం.. అందితే జుట్టు.. లేకుంటే కాళ్లు. ఇది వారి నైజం. బీఆర్‌ఎస్ రాజకీయ ప్రయాణమంతా అధికారం దాహంతోనే. టీడీపీ, సీపీఐ, సీపీఎం, మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలతో అంటకాగిన టీఆర్‌ఎస్-బీఆర్‌ఎస్… బిజెపి ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ పొలిటికల్ చీటర్. రాజకీయ పరాన్నజీవి. పీఆర్సీ పేరుతో టీచర్లను చీట్ చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం. 2008లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తిన సమయంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి సీఎం పదవి నుండి వైఎస్ ను తొలగించి.. తనను సీఎం చేస్తే తెలంగాణ ఉద్యమాన్ని బంద్ చేస్తానని కేసీఆర్ చెప్పాడు.
ఇది వాస్తవం కాదా? 2013లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో నిర్ణయం జరిగేముందు తనను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే టీఆర్‌ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పి సోనియా గాంధీ ముందు కేసీఆర్ కుటుంబసమేతంగా వెళ్లి దాసోహమైంది వాస్తవం కాదా..? అని ఆయన ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతోందని 2018 ఎన్నికల తర్వాత వాస్తవాలతో నిరూపించాం. పార్లమెంట్ ఎన్నికల్లో సారు.. కారు.. పదహారు.. మాదే సర్కారు అంటూ విర్రవీగారు. చక్రం తిప్పుతామన్నారు. బొంగరం కూడా తిప్పలేకపోయారు. కర్రుగాల్చి వాతపెట్టారు ప్రజలు. ఒంటరిగా పోటీ చేసిన బిజెపి నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుని 20 శాతం ఓట్ షేర్ సాధించింది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే.. బీఆర్‌ఎస్ ను ఎన్డీయే లో విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పిన మాటల బండారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బట్టబయలు చేశారు. కేటీఆర్ ఎలాగూ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదనే అక్కసుతో తెలంగాణలో బావబామ్మర్దులు కేటీఆర్, హరీశ్ రావు సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణకు గత తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ. 9 లక్షల కోట్ల నిధులు కేటాయించింది. మంత్రి హరీష్ రావు రైల్వే ఉద్యోగుల పట్ల వ్యవహరించిన తీరు పట్ల తెలంగాణ సమాజం విస్తుపోయి చీదరించుకుంటోంది. 2004లో కాంగ్రెస్ తో, 2009లో మహాకూటమితో, మొన్నటి ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నది బీఆర్‌ఎస్ పార్టీ. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే బీఆర్‌ఎస్ నాయకుల మాటలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. అవకాశవాద రాజకీయాల కోసం బిజెపి పై, బిజెపి నాయకులపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. బాప్ ఏక్ నెంబర్ … కొడుకు దస్ నెంబర్ చోర్ అన్న మాదిరిగా ఉంది కేసీఆర్, కేటీఆర్ తీరు. ఇంట్లో కూర్చొని… ట్విట్టర్ లో ట్వీట్టర్ లో మాట్లాడే ట్విట్టర్ పిట్ట కేటీఆర్. తమ ఓటమి ఖాయమని, పతనం ఖాయమని తెలుసీ బీఆర్‌ఎస్ పార్టీ పీఠం కదిలిపోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సభకు స్వచ్ఛందంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో బీఆర్‌ఎస్ నాయకుల గుండెల్లో రైల్లు పరుగెడుతున్నాయి. మొన్న తెలంగాణలో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభలు కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. కరీంనగర్ ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినట్లుగానే తెలంగాణ ప్రజల్లో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు గుణపాఠం చెప్పబోతున్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు, అవినీతికి ప్రజలు చరమగీతం పాడుతారని అయన హెచ్చరించారు.





