– ఆత్మనిర్భరత సాధించేందుకు పరిశ్రమల ఏర్పాటు
– ఎనర్జీ లీడర్షిప్ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
న్యూదిల్లీ, సెప్టెంబర్ 24: శక్తికి ప్రతిరూపమైన దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎనర్జీ లీడర్షిప్ సదస్సు ఏర్పాటు చేయడం, అందులో తాను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఢల్లీిలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ ఎనర్జీ లీడర్షిప్ సదస్సులో ప్రసంగించారు. బొగ్గు, గనులు, పునరుత్పాదక శక్తి, క్రిటికల్ మినరల్స్ రంగాల్లో కేంద్రం తీసుకుంటున్న అనేక చర్యల ఫలితంగా ఇవాళ భారత్ అంతర్జాతీయ ఇంధన రంగంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోనున్న నేపథ్యంలో మన ఎనర్జీ అవసరాలు భారీగా పెరగనున్నాయన్నారు. 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల దిశగా మన దేశాన్ని నడిపించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మౌలిక వసతుల కల్పన వేగతవంతం చేయడు, ఆత్మనిర్భరత సాధించడం, అంతర్జాతీయంగా ఎదిగేందుకు వీలుగా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అంతర్జాతీయంగా ప్రతికూల రాజకీయ, భౌగోళిక పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఇంధన భద్రతా రంగంలో అవకాశాలుగా మలుచుకుంటున్నామన్నారు. స్థాపిత పునరుత్పాదక శక్తి సామర్థ్యం విషయంలో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో, వాయు పవన విద్యుత్‌లో నాలుగో స్థానంలో, సౌర విద్యుత్ ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉందని, 2014 నుంచి పునరుత్పాదక శక్తి ఉత్పత్తి మూడు రెట్లు పెరిగిందని వివరించారు. దేశంలోని విద్యుత్ అవసరాల్లో సగం మేర శిలాజేతర ఇంధనాల నుంచే ఉత్పత్తి అవుతోందన్నారు. భవిష్యత్తులో కూడా మన విద్యుత్ భద్రత విషయంలో బొగ్గు ప్రధాన పాత్ర పోషిస్తుందని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇంధన రంగంలో సుస్థిరతను సాధించేందుకు పునరుత్పాదక శక్తి, క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తిపై దృష్టి సారించాయని తెలిపారు. ఇప్పటికే 1,900 మెగావాట్ల సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను స్థాపించామని, 2030 నాటికి 15 గిగావాట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని, కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ ద్వారా 2030 నాటికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ముఖ్యంగా లిథియం, నికెల్, కోబాల్ట్ అవసరాలు 2040 నాటికి భారీగా పెరగనున్నాయని,ఈ నేపథ్యంలో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ద్వారా ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చి క్రిటికల్ మినరల్స్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. కాబిల్, నాల్కో, హెచ్‌సీఎల్, ఎంఈసీఎల్ సంస్థల ఆధ్వర్యంలో అర్జెంటీనా వంటి విదేశాల్లో లిథియం గనులను మన అధీనంలోకి తీసుకుని, తవ్వకాలు ప్రారంభించామని తెలిపారు. క్రిటికల్ మినరల్స్‌ను రీసైక్లింగ్ చేసేందుకు రూ.1500 కోట్లతో ఇన్సెంటివ్ పథకాన్ని తీసుకొచ్చామని, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, సాంకేతిక నిపుణులను ఏకతాటిపైకి తెచ్చేందుకు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేశామని, 2047 నాటికి వికసిత భారత్ సాధించేందుకు ఇంధన భద్రత, పర్యావరణ సుస్థిరత రెండు స్తంభాల్లాంటివివని వివరించారు. జీఎస్టీ 2.0 ద్వారా బొగ్గుపై గతంలో ఉన్న సెస్ పూర్తిగా ఎత్తేయడంతో బొగ్గు ఆధారిత ఉత్పత్తులు, రంగాలలో ధరలు తగ్గుతాయన్నారు. ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించి ప్రధాని మోదీ పండుగ కానుక అందించారని కిషన్‌రెడ్డి అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





