- వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి రప్పించి దందా
- మాదకద్రావ్యాలూ సరఫరా
- 17 మందిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు
- ముఠా నాయకుడు అర్నావ్ అరెస్ట్..డ్రగ్స్ స్వాధీనం
- వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6 : అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. 17 మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠా ఆగడాల నుంచి 1419 మంది బాధితులకు విముక్తి కల్పించారు. 39 కేసుల్లో 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో కీలకంగా ఉన్న ముఠా నాయకుడు అర్నావ్ను అరెస్ట్ చేశారు. ఎపి, తెలంగాణ, కర్నాటక, దిల్లీ, ముంబయితో పాటు బంగ్లాదేశ్, నేపాల్, థాయ్‌లాండ్, రష్యా దేశాలకు చెందిన బాధితులకు విముక్తి కల్పించారు. ఈ ముఠా పలు వెబ్సైట్లలో ఎస్కార్ట్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తుంది.
ఈ ముఠా ఉపాధి పేరుతో తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తుంది. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ భారీ సెక్స్ రాకెట్‌ను ఛేదించిందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెట్లడించారు. 17 మందితో కూడిన సెక్స్ రాకెట్ ముఠాను అరెస్ట్ చేశామన్నారు. 15 సిటీల నుండి యువతులను రప్పించి సెక్స్ రాకెట్స్ నడుపుతున్నారని వెల్లడించారు. వెబ్ సైట్, వాట్సాప్ గ్రూప్స్, కాల్ సెంటర్లు, యాడ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షించి.. అమ్మాయిలను పంపిస్తున్నారని చెప్పారు. 39 కేసుల్లో నిందితుల ప్రమేయం ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. 1419 మంది అమ్మాయిలు వ్యభిచార ముఠాలో చిక్కుకున్నట్లు గుర్తించామన్నారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో పాటు విదేశీ మహిళలతో సెక్స్ రాకెట్స్ నడుపుతున్నారని సైబరాబాద్ సీపీ వెల్లడించారు. సెక్స్ రాకెట్స్‌తో పాటు డ్రగ్స్ కూడా సరఫరా చేస్తూ కస్టమర్లకు ఎర వేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే సైబరాబాద్‌లో ఐదు కేసులు నమోదు చేసి, విచారిస్తున్నామన్నారు. సరఫరాదారులు, బ్రోకర్లు ద్వారా బాధిత మహిళలను కస్టమర్లు దగ్గరకు పంపుతున్నారని చెప్పారు. విమానాల్లో కూడా అమ్మాయిలను ఇతర రాష్ట్రాల కస్టమర్ల దగ్గరకు పంపుతున్నట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. వ్యభిచారం ద్వారా వొచ్చిన డబ్బులో 30శాతం బాధిత యువతులకు, 35శాతం యాడ్స్, వెబ్ సైట్స్‌కు మిగతా 35 శాతం నిర్వాహకులు తీసుకుంటారని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
ఆర్నావ్ అనే వ్యక్తి కీలక నిందితుడని చెప్పారు. 915 మంది అమ్మాయిలను ముంబై, కోల్ కత్తా నుండి తీసుకొచ్చాడని చెప్పారు. 2019 నుండి సవి•ర్ అనే వ్యక్తి 850 మంది అమ్మాయిలను సరఫరా చేశాడని తెలిపారు. ఏపీలోని అనంతపురం, తెలంగాణలోని కరీంనగర్ నుండి సెక్స్ రాకెట్ నడుపుతున్నారని చెప్పారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్‌లో ఆర్నావ్ డ్రగ్స్, వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడని వెల్లడించారు. 950 మంది అమ్మాయిలతో హైదరాబాద్‌లో సెక్స్ రాకెట్ నడుపుతున్నాడని తెలిపారు. సోమాజిగూడలో కీలక నిందితుడు ఆర్నావ్ను అరెస్ట్ చేశామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
ఆర్నావ్ ఉంటున్న ఇంట్లోనే డ్రగ్స్‌ను సీజ్ చేశామన్నారు. సెక్స్ రాకెట్ ముఠా సభ్యులు వివిధ గ్రూపులుగా విడిపోయి దందా చేస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో కొన్ని హోటల్స్‌లో పని చేసే వాళ్ల ప్రమేయం కూడా ఉందని, వారిని కూడా అరెస్ట్ చేశామన్నారు. ఉద్యోగాలు లేని అమ్మాయిలను, పేదరికంలో ఉన్న యువతులను జాబ్స్ పేరుతో వ్యభిచారం చేయిస్తున్నారని తమ విచారణలో వెల్లడైందని చెప్పారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు.



