- 15న జరిగే సిఎం కేసీఆర్ సభకు విస్తృతంగా ఏర్పాట్లు
- హ్యాట్రిక్ దిశగా ఏర్పాట్లపై ఎమ్మెల్యే సతీష్ కుమార్ నిరంతర పర్యవేక్షణ
హుస్నాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : హుస్నాబాద్‌లో ఎక్కడ చూసినా గులాబీ సైన్యాలు కదం తొక్కుతున్నాయి. గులాబీ సైనికుల పదఘట్టనలతో.. హుస్నాబాద్ మారుమోగుతుంది. నియోజకవర్గం గులాబీ వర్ణాన్ని సంతరించుకుంటుంది. గులాబీ పార్టీ అధినేత, సిఎం కేసీఆర్ ఈ నెల 15న హుస్నాబాద్ నుండే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న విషయం తెలిసిందే. అత్యంత చారిత్రాత్మకంగా జరగనున్న ఈ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే మంత్రి హరీష్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ హుస్నాబాద్ సందర్శించి బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించారు. దిశానిర్దేశం చేసారు. నియోజకవర్గ స్థాయి ముఖ్య ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రామస్థాయిలో నుండి ఎంత జనసమీకరణ చేయాలనే విషయమై సూక్ష్మ స్థాయి ప్రణాళిక చేస్తున్నారు. సభ మైదానం వద్ద వాహనాలతో చదును చేస్తున్న పనులను, హెలిప్యాడ్ నిర్మాణ పనులు గురువారం ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ పర్యవేక్షించారు. బహిరంగ సభకు వొచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాలు నిర్ణయించారు.
అందరి దృష్టి హుస్నాబాద్ పైనే..
సిఎం కేసీఆర్ ఈ నెల 15న తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన తర్వాత నేరుగా హుస్నాబాద్‌కు వొచ్చి బహిరంగ సభలో పాల్గొననున్నారు. దీంతో అందరి దృష్టి హుస్నాబాద్ పైనే ఉంది. సిఎం కేసీఆర్‌కు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు స్థానిక బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. డప్పు చప్పుళ్ళు, కోలాటాలు, బతుకమ్మలు, బోనాలు, నృత్యాలతో సందడి చేస్తూ అన్ని గ్రామాల నుండి జనం కదిలేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అన్ని గ్రామాల నుండి యువత పెద్ద ఎత్తున కదిలేలా యువనేత, ఎమ్మెల్యే యువనేత ఇంద్రనీల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా మండలాల నుండి బైక్ ర్యాలీలు నిర్వహించి సభకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.





