లోక్‌సభలో బుధవారం రూపాయి పతనంపైన చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపట్ల తెలంగాణ సమాజం తీవ్ర అభ్యంతరాలను వ్యక్త చేస్తున్నది. తోటి సభ్యుడిని కించపర్చే విధంగా మాట్లాడటం మంత్రి హోదాలో ఉన్న సీతారామన్‌కు తగిందికాదన్న అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు మొదటినుండీ భాష విషయంలో అనేక అవమానాలను ఎదుర్కుంటున్నారు. వారికి సరిగా మాట్లాడరాదని, అసలు వారిది భాషేనా అన్నట్లుగా దశాబ్ధాలుగా వెక్కిరింపులకు గురైన సందర్భాలు కోకొల్లలు. తెలంగాణ తొలి, మలివిడిత ఉద్యమాలు చెలరేగినవి కూడా ఇలాంటి సూటిపోటీ మాటలకారణంగానే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతకూడా ఇక్కడి ప్రజలమీద ఉన్న ద్వేషం లేదా నిర్లక్ష్య వైఖరి అప్పుడప్పుడు ఇంకా బయట పడుతూనే ఉంది. దక్షిణాది ప్రాంతంలోని ఒక్కో రాష్ట్రానిది ఒక్కో భాష. పాలనాపరమైన కార్యక్రమాలన్నీ ఆయా భాషల్లోనే కొనసాగుతున్నాయి. అయితే ఇంగ్లీషు మాత్రం యూనివర్సల్ లాంగ్వేజీ కావడంతో పాలనలో ఆ భాష ప్రధమ స్థానాన్ని ఆక్రమించుకుంది. దాని తర్వాత దేశంలో హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలు ఎక్కువ కావడంతో హిందీ చెలమాణిలో ఉంది. వాస్తవంగా హిందీనే దేశ భాషగా చేయాలని చాలాకాలంగా ప్రయత్నాలు జరిగాయి.
బలవంతంగా హిందీని హిందీయేతర రాష్ట్రాలపైన రుద్దడానికి అనేక ప్రయత్నాలు జరిగాయికూడా. దీనికి దక్షిణాది రాష్ట్రాలనుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో అది సాధ్యం కాకుండా పోయింది. ముఖ్యంగా తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలు దీన్ని బాగా వ్యతిరేకిస్తున్నాయి.. గతంలో తమిళనాడులో ఇందుకు వ్యతిరేక ఉద్యమాలు జరిగిన విషయంకూడా తెలిసిందే. కేంద్రంలో భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం వొచ్చిన తర్వాతకూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. ఒకే దేశం.. ఒకే భాష అన్న నినాదంతో దేశవ్యాప్తంగా ఒకే భాష ఉండా లంటూ నేటికీ ఇంకా కేంద్ర ప్రభుత్వం అదే ఆలోచనలోనే ఉంది. ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు భాష క్రమేణ మరుగు పడుతుందన్నదన్నదే అందుకు ప్రధాన కారణం. ఇప్పటికే ప్రపంచంతో పోటీ పడేందుకు కెజి నుంచి పీజీ వరకు పిల్లలను ఇంగ్లీషు మీడియంలో చదివిస్తుండడంతో వారికి తెలుగన్నది రాకుండా పోతున్నది. కాన్వెన్ట్ స్కూళ్ళలో, హాస్టళ్ళలో ఏళ్ళ తరబడి ఉంటున్న పిల్లలకు కనీసం తెలుగులో చదవడం, రాయడం రావడంలేదు. అన్య భాషలందు తెలుగు లెస్స అన్న నానుడిని తెలుగు లెస్ అనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. భాషలన్నిటికీ మూలంగా చెబుతున్న సంస్కృతాన్ని ఇప్పటికే అటుకెక్కించడమైంది. ఇవ్వాళ ప్రపంచంలో జరుగుతున్న అనేక పరిశోధనలకు మూలాలు మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో మునులు ఎప్పుడో చెప్పారంటున్నారు. కాని వాటిని అభ్యసించేవారి సంఖ్య క్రమేణ తగ్గిపోతున్నది. అంతేకాదు దేశంలోని అనేక భాషలు ఇప్పటికే కనుమరుగ•యినాయి.
ఇక తెలంగాణ విషయానికొస్తే ఈ ప్రాంతం శతాబ్ధాలుగా ఉర్దూ పాలకుల కింద నలిగి పోవడంతో దక్షిణ ప్రాంతంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ హిందీని సులభంగా అర్థం చేసుకుని, మాట్లాడగలిగే వారి సంఖ్య ఎక్కువేఅని చెప్పాలె. అయితే మొదటినుండీ ఉర్దూ ప్రభావం ఉండడంతో ఇక్కడ హిందీ, ఉర్దూ మిక్స్‌డ్‌గా ఉంటుంది. అయినా హిందీలో అనర్గళంగా మాట్లాడే వారికేమీ కొదువలేదు. లోకసభలో హిందీలో ధారాళంగా ప్రసంగించి ప్రజల మెప్పు పొందినవారనేకులున్నారు. బుధవారం లోకసభలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపి మాట్లాడిన తీరును ఎత్తిచూపి దెప్పిపొడిచినట్లుగా అధికార పార్టీ మంత్రి మాట్లాడిన తీరును చూస్తుంటే తెలంగాణ ప్రజలపైన ఇదివరకటి చిన్నచూపే ఇంకా కొనసాగుతున్నదా అన్నట్లుగా ఉంది. తెలంగాణ ప్రాంతంనుండి వొచ్చిన వారి హిందీ కమ్‌జోర్‌గా ఉంటుందంటే మొత్తం తెలంగాణనుద్దేశించి అనట్లేకదా అంటున్నారు తెలంగాణ ప్రజలు. సభలో రూపాయి పతనంపైన చర్చ జరుగుతున్న సందర్భమది. దానిపైన కాంగ్రెస్ ఎంపి రేవంత్‌రెడ్డి హిందీలో మాట్లాడటానికి ప్రయత్నించారు. ముందుగానే మనం చెప్పుకున్నట్లు తెలంగాణలో హిందీ, ఉర్దూ కలగలిపి మాట్లాడటం అలవాటు. అలా ప్రసంగించిన రేవంత్‌రెడ్డి ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాస్తా వెటకారంగా మాట్లాడిన తీరుపట్ల తెలంగాణ ప్రజలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. ఏదో హాస్యంగా మాట్లాడిందనుకుని కొట్టిపారేసేట్లుకూడాలేదు.
ఎందుకంటే ఆమె చాలా సీరియస్‌గానే మాట్లాడినట్లు కనిపించింది. ఆమె మాటకు సభలో నవ్వులు వినిపించాయంటే ఆ సభ్యుడు ఎంత అపహాస్యానికి• గురైనడో అర్థమవుతుంది. ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందు తెలంగాణ ప్రాంతంనుండి వొచ్చిన నాయకుల హిందీ బలహీనంగా ఉంటుందని చెబుతూ, తనను కూడా కలుపుకుంటూ మేరే హిందీ బీ కమ్ కమ్‌జోరే అంది. అంతటితో ఆగకుండా కమ్‌జోర్ హిందీలో అడిగిన ప్రశ్నకు కమ్ జోర్ హిందీలోనే సమాధానమిస్తానంటూ ఆ తర్వాత ప్రశ్నకు సమాధానమిచ్చింది. తెలంగాణ ప్రజలకు హిందీ భాషరాదని దెప్పిపొడిచిన తీరుకు రేవంత్‌రెడ్డి కూడా అదే రీతిలో సమాధానమిచ్చారు. తాను తక్కువ జాతి (శూద్రుడు) వాడినని, మంత్రి నిర్మలా సీతారామన్ వలె బ్రాహ్మణ వాదుల్లాగా స్వచ్ఛమయిన హిందీ తనకు రాదన్నారు. దానిపై లోకసభ స్పీకర్ అభ్యంతరం చెప్పడం వేరే విషయమైనా, అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా వ్యంగ్య మాటలతో నిండు సభలో తోటి సభ్యుడిని అవమానించడం భారతీయ జనతా పార్టీ కి చెందిన సభ్యురాలి అహంకారానికి నిదర్శనం…




