రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయి..
ఉంటే జేబులో ఉండాలి..లేదంటే జైలులో ఉండాలనేదే మోదీ సిద్ధాంతం
మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్ధి డమ్మీ..ఈటల కూడా ఓటమిపాలే..
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది గులాభీ జెండానే..బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి పక్కా లోకల్
మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్
ఉంటే జేబులో ఉండాలి..లేదంటే జైలులో ఉండాలనేదే మోదీ సిద్ధాంతం
మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్ధి డమ్మీ..ఈటల కూడా ఓటమిపాలే..
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది గులాభీ జెండానే..బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి పక్కా లోకల్
మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్
మేడిపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : కాంగ్రెస్ పార్టీ అర చేతిలో వైకుంఠం చూపించి నోటికొచ్చిన అడ్డగోలు హామీలనిచ్చి గద్దెనెక్కిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. రాష్ట్రంలో అధికారం కోసం కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు నెరవేర్చకుంటే వెంటాడుతం, వేటాడుతం, ప్రజలందరినీ కూడగట్టి రాజకీయంగా బొందపెడతామని ఆయన హెచ్చరించారు. మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం మేడిపల్లిలో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గుంపు మేస్త్రీగా, ప్రధానమంత్రి తాపీ మేస్త్రీలాగా వ్యవహరిస్తూ తెలంగాణకు సమాధి కట్టాలని చూస్తున్నారని, తెలంగాణ గొంతులుండొద్దు, కేసీఆర్ ఉండొద్దు, బీఆర్‌ఎస్ ఉందొద్దు, కేసీఆర్‌ను బొంద పెట్టాలె.. మనమిద్దరమే ఉండాలనే తాపత్రయంతో వీన్ని గుంజుడు.. వాన్ని గుంజుడు, కేసులు పెట్టుడు వంటి అడ్డమైన పనులు, కుత్రతాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజమని, రాజకీయాల్లో గెలుపు, ఓటములు కూడా ఉంటాయని, ఓడామని కుంగిపోవడం, గెలిచామని పొంగిపోయేది లేదన్నారు. ప్రజలు తమ వైపే ఉన్నారన్నారు. పదేళ్ళు అధికారమిచ్చిన ప్రజలు ప్రధాన ప్రతిపక్షంగా కొట్లాడమని తీర్పు ఇచ్చారన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ తాగు, సాగు నీరు, నిరంతర కరెంటు సరఫరా, జిల్లాకో మెడికల్ కాలేజీలతో అభివృద్ది పథంలో పయనింపజేశారన్నారు. రైతుల రుణ మాఫీ, మహాలక్ష్మి పథకం అమలు ఇంకెన్నడని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. హామీల గురించి అడిగితే రేవంత్ రెడ్డి మెడల పేగులేసుకుంటా , జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతున్న, మానవ బాంబునైత అంటూ పొంతనలేని సీఎం స్థాయిని దిగజార్చే మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మానవ బాంబువయ్యే కర్మ నీకు అవసరం లేదని, నీ పక్కనే నల్గొండ బాంబు, ఖమ్మం బాంబు ఉన్నాయని చురకలంటించారు. రాష్ట్ర సంపద పెంచే తెలివి లేదు గానీ, ఈ ట్యాపింగ్.. ఈ స్కామ్.. ఆ స్కామ్ అంటున్నారని.. ఫోన్ల ట్యాపింగ్‌పై పెట్టిన శ్రద్ద వాటర్ ట్యాంకర్లపై పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి అభ్యర్ధి పట్నం సునీత డమ్మీ అని తేల్చివేశారు. బీజేపీకి లాభం చేకూర్చేందుకే డమ్మీ క్యాండెట్లను నిలబెడుతున్నారని , రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయని లోపాయికారి ఒప్పందం చేసుకుని కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను ఉండనియ్యొద్దనే కుంత్రాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు రాదని రేవంత్ రెడ్డి చెప్పడం పట్ల కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ దమ్ముంటే మల్కాజిగిరి ఇద్దరం పోటీ చేద్దామని మరోసారి సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత 30 మంది ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీలోకి జంపయ్యే నాయకుడు రేవంత్ రెడ్డి కాబోతున్నారని జోస్యం చెప్పారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని సైతం రేవంత్ మోసం చేస్తున్నారని విమర్శించారు. చౌకీధార్ (మోదీ) చోర్ హై అని రాహుల్ అంటుంట్నే.. చౌకీధార్ బడే బాయ్ అంటున్నాడని.. ఆధానీ ఫ్రాడ్ అని రాహుల్ అంటే ఆధానీ ఫ్రెండ్ అని రేవంత్ సంభోదిస్తున్నారని ఎద్దేవా చేశారు. మల్కాజిగిరి బీజేపీ అభ్యర్ధి ఈటల ఇక్కడ కూడా ఓటమి పాలవడం ఖాయమని.. హుజురాబాద్ పారిపోవుడు ఖాయమన్నారు.
తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని వోటు వేయాలని ప్రశ్నించారు. బీజేపీ పదేళ్ళ పాలనలో రాష్ట్రానికి ఇచ్చింది, తెచ్చింది ఏమీ లేదని కేటీఆర్ విమర్శించారు. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ రేట్లు దినదినం పిరమయ్యి పేదలు, మద్య తరగతి ప్రజలు బతకలేని దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. పెద్ద నోట్లు రద్దు చేఏసి దేశాన్ని ఆగం చేసింది మోదీయని విరుచుకుపడ్డారు. సంపన్నులు, సేట్లకు మేలు చేసేందుకు బీజేపీ రూ.14.50 లక్షల కోట్లు అప్పులు మాఫీ చేసి, కొరోనా కష్ట కాలంలోనూ రైతులు, పేదలను ఆదుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో నిరుద్యోగం, మతోన్మాదం పెరిగిపోయాయయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏం చేసినవంటే బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అంటారని, రాముడి పేరు చెప్పుకుని రాజకీయం చేసే బీజేపీని వంగబెట్టి తన్నాలని ప్నిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ క్యాండెట్ రాగిడి లక్ష్మా రెడ్డి పక్కా లోకల్ అని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది గులాబీ జెండాయేనన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ వాణి వినపడాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్ధి రాగిడి లక్ష్మా రెడ్డి, పీర్జాదిగూడ, బోడుప్పల్ మేయర్లు జక్కా వెంకట్ రెడ్డి, సామల బుచ్చి రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.





