సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 19: సిద్దిపేటలో కురుస్తున్న వర్షానికి పట్టణంలోని మెయిన్ రోడ్లు సిమ్మింగ్ పూల్ తలపించేలా మారాయని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్దిపేటలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలో చిన్నపాటి వర్షం పడిన మెయిన్ రోడ్లు చౌరస్తాలలో వర్షపు నీరు నిలిచిపోతుందని అన్నారు. సిద్దిపేట పట్టణంలో ఎక్కడెక్కడ వర్షం నీరు నిలుస్తుందో అక్కడ కనీసం మున్సిపల్ చైర్మన్ మంజుల, కమిషనర్ సంపత్ కుమార్ పర్యటించకపోవడం దారుణం అన్నారు. కోట్లాది రూపాయల ప్రజల ధనాన్ని పెట్టి నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు. వర్షపు నీరును అండర్ గ్రౌండ్ డ్రైనేజీలోకి తరలించడంలో మున్సిపల్ అధికారులు విఫలం అయ్యారని అన్నారు. రోడ్డుపై నీరు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు పడునున్న సందర్భంగా ఇప్పటికైనా అధికారులు మున్సిపల్ పాలకవర్గం మేల్కొని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. వర్షాలు కురుస్తుండడంతో సమస్యలు ఏమి పట్టనట్టుగా మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ యువజన అధ్యక్షులు గయాజుద్దీన్, గ్యాదరి మధు, రశద్, తదితరులు పాల్గొన్నారు.



