- తెలంగాణ పురోభివృద్దికి ఇదే కారణం
- ఐటీ రంగంలో రూ. 57,707 కోట్ల ఎగుమతులు
- శాసనసభలో మంత్రి కెటిఆర్ వెల్లడి
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్
హైదరాబాద్‌లోని బేగంపేటలో 1987లో మొట్టమొదట ఐటీ టవర్ వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు.. 27 సంవత్సరాల్లో ఐటీ రంగాల్లో రూ. 56 వేల కోట్లు ఐటీ ఎగుమతులు మాత్రమే. కానీ గతేడాది తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగంలో రూ. 57,707 ఐటీ ఎగుమతులు సాధించింది. ఇది సమర్థత గల ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. 2022-23లో ఐటీ ఎగుమతులు 31.4 శాతం పెరిగాయి. ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయి. కొత్త రాష్ట్రం వచ్చాక 6 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు
వచ్చాయి. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలను విస్తరిస్తోంది. ఇప్పటికే చాలా నగరాల్లో ఐటీ కంపెనీలు ప్రారంభమయ్యాయని తెలిపారు. దేశంలో మొత్తం సృష్టించిన టెక్నాలజీ జాబ్స్‌లో 44 శాతం తెలంగాణవే అని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో భూముల రేట్లు బాగా పెరుగుతున్నాయి. ఇవాళ ఎకరం ధర రూ. 100 కోట్లు పలుకుతోంది అని కేటీఆర్ గుర్తు చేశారు.
వరద నష్టంపై ఆధారాలు లేకుండా మాట్లాడొద్దు
అసెంబ్లీలో శ్రీధర్ బాబు కామెంట్స్‌పై కెటిఆర్
వరద నష్టంపై సరైన ఆధారాలు లేకుండా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడారు. వరద నష్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడిన శ్రీధర్ బాబు వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వరద నష్టం అంచానను శ్రీధర్ బాబు ఎలా చెబుతారు. వరద నష్టంపై గాలి మాటలు మాట్లాడొద్దు.. వరి పంటలో రెండు రోజులు నీళ్లున్నా నష్టం జరగదు. సోయా, పత్తి పంటలో నీళ్లుంటే నష్టం జరుగుతుంది. ఇదేది ఆలోచించకుండా స్వీపింగ్ రిమార్కస్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కేసీఆర్ రుణమాఫీ ప్రకటన చేయగానే కాంగ్రెసోళ్ల ఫ్యూజులు ఎగిరిపోయాయి. దీంతో అనవసర ఆరోపణలు చేస్తున్నారు. హేతుబద్ధంగా, శాస్త్రీయంగా ఆధారాలు చూపించాలి. రైతులు అందర్నీ గమనిస్తున్నారు.
రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తామని చెప్పిన వారు మాకు నీతులు చెప్పడం సరికాదు. రెండు సార్లు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతుబంధు ప్రవేశపెట్టి 73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు. రైతుబీమా తెలంగాణలో తప్ప మరెక్కడా అమలు చేయడం లేదు. శాస్త్రీయంగా ఆధారాలుంటేనే మాట్లాడాలి. దుష్పచ్రారం చేయడం సరికాదు. పూర్తి ఆధారాలతో మాట్లాడే సత్తా ప్రభుత్వానికి ఉంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.తెలంగాణలోని రైతాంగానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షుడు బాహాటంగా వ్యాఖ్యానించారని కేటీఆర్ గుర్తు చేశారు. గతంలో 6 గంటల కరెంట్ ఇచ్చి రైతులను చావగొట్టాం.. అవకాశం ఇస్తే మూడు గంటల కరెంట్ ఇస్తాం. 24 గంటల కరెంట్ ఇచ్చే ప్రసక్తే లేదని వారి అధ్యక్షుడు నిర్ద్వందంగా చెప్పారు. కెమెరాల ముందు చెప్పిండు. శ్రీధర్ బాబు మాకు నీతులు చెప్పే ముందు.. వారి పార్టీ విధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. రైతులను అన్ని రకాలుగా పీడించుకొని రాబందుల్లాగా పీక్కతింటామని చెప్తాడా? ధరణి రద్దు చేస్తాం.. దళారీళ ప్రభుత్వం తెస్తామని చెప్తాడా? మా అధ్యక్షుడి చెప్పింది తప్పు అని శ్రీధర్ బాబు రైతాంగానికి క్షమాపణ చెప్తారా..? అని కేటీఆర్ నిలదీశారు.



