కృష్ణ దానగుణంపై చిత్రసీమలో చర్చ
సేవాతత్పరతే కాదు, కృతజ్ఞత కలిగిన వ్యక్తిత్వం కృష్ణకు ఉంది. తనకు తొలి సినిమా అవకాశం ఇచ్చిన ఆదుర్తి సుబ్బారావు మరణించినప్పుడు అవుట్‌డోర్ షూటింగులో వున్న కృష్ణ ఆదుర్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రముఖ వార్తాపత్రిక ’ద హిందూ’ వినియోగించే ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆదుర్తి సొంత బ్యానర్‌పై సినిమాలు తీసేందుకు సిద్ధమై లాభం వస్తే ఆదుర్తి కుటుంబానికి, నష్టం వస్తే తన ఖాతాలో జమ చేసుకునేవారు. ఆర్థికంగా చితికిపోయిన తన తోటి కథానాయకులు, స్నేహితులకు కూడా ఎప్పుడూ బాసటగా ఉండేవారు.1977 నవంబర్ 19న దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు 10 వేల రూపాయలు విరాళం ప్రకటించడమే కాకుండా, లక్ష రూపాయలు విలువచేసే నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు కృష్ణ. ఒక ఏడాది పాటు తనకు వచ్చే ఆదాయంలో 10 శాతం సొమ్మును తుపాను బాధితులకు అందచేశారు.
చిన్న ప్లలెటూరి నుంచి వచ్చి ఇంత పెద్ద సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసిన కృష్ణ తెలుగు సినీ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. ఆయన స్థానం ఎప్పటికీ చెరిగిపోనిది.. ఎన్నటికీ మాసిపోనిది.తెలుగులో భారీ బ్జడెట్ సినిమాలకు నాంది పలికింది కృష్ణనే. లక్షల రూపాయలతో సినిమా పూర్తిచేసే ట్రెండ్‌ను దాటి ’సింహాసనం’ సినిమాకు కోటికి పైగా పెట్టుబడి పెట్టారు. దర్శక నిర్మాతగా రాణిస్తూనే 500 పైచిలుకు చిత్రాల్లో నటించారు. 325కి పైగా హీరోగా చేశారు. దర్శకుడిగా 16 సినిమాలు తెరకెక్కించారు. 50 చిత్రాలను నిర్మించడం, 25 సినిమాల్లో ద్విపాత్రాభినయం, 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసిన రికార్డు ఆయనది.
వందకు పైగా దర్శకులతో పనిచేశారు. 80 మందికి పైగా హీరోయిన్లతో నటించారు.ఒప్పుకున్న పాత్ర కోసం ఎంత రిస్క్ తీసుకోడానికైనా సిద్ధమయ్యేవారు. మొదటి సినిమా ’తేనె మనసులు’లో స్కూటర్‌తో కారును చేజ్ చేసే సీన్ చేశారు. ఆయన స్కూటర్‌ని వదిలేసి కారు దికి జంప్ చేయడం చూసి ప్రేక్షకులు థ్రిల్ అయిపోయారు. ఇంత రిస్కీ షాట్‌ను డూప్ లేకుండా చేశారని తెలియడం వల్లే దర్శకులు డూండీ ’గూఢచారి 116’కి హీరోగా కృష్ణను తీసుకున్నారని చెబుతారు. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో అడ్వెంచర్స్ చేశారు కృష్ణ. ఎంత రిస్క్ అయినా పాత్రకి ప్రాణం పోయాలని తపనపడేవారు. అందుకే అప్పట్లో అందరూ ఆయన్ని డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో అనేవారు.




