సెస్‌ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ‌హవా

  • 15కు గాను 13 స్థానాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు
  • వేములవాడలో ఇరు పార్టీల ఘర్షణ..లాఠీఛార్జ్
  • ఎట్టకేలకు వేములవాడలో బిజెపి అభ్యర్థి తిరుపతి గెలిచినట్లు అధికారుల ప్రకటన

రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : ‌రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సహకార విద్యుత్‌ ‌సరఫరా సంఘం సెస్‌ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ‌హవా కొనసాగింది. 15 స్థానాలకుగాను 13 స్థానాల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. కాగా వేములవాడ రూరల్‌ ‌కౌంటింగ్‌లో గందరగోళం నెటకొంది. వేములవాడ రూరల్‌లో బీజేపీ విజయం సాధించినా చాలా సేపటి వరకు అధికారులు ప్రకటించలేదు. దీంతో బీజేపీ ఆందోళనకు దిగింది. పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ ‌చేశారు. ఈ క్రమంలో సెస్‌ ‌ఫలితాల్లో గందరగోళం కొనసాగుతూ వొచ్చింది. వేములవాడ రూరల్‌ ‌బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు మొదట ప్రకటించారు అధికారులు. అయితే మెజార్టీ 5 వోట్లు మాత్రమే ఉండటంతో..మళ్లీ రీ కౌంటింగ్‌ ‌చేయాలని బిఆర్‌ఎస్‌ ‌నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీ నేతలు కూడా ఆందోళన చేశారు.

అధికారులు, పోలీసులు బిఆర్‌ఎస్‌కు వత్తాసు పలుకుతున్నారని బీజేపీ లీడర్లు ఆరోపించారు. అధికారుల తీరుకు నిరసనగా బీజేపీ నేతలు కౌంటింగ్‌ ‌కేంద్రం ముందు బైఠాయించారు. దీంతో అధికారులు దిగవచ్చి బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. గందరగోళం మధ్యే వేములవాడ రూరల్‌ అభ్యర్ధిని ప్రకటించారు ఎన్నికల అధికారులు. బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు. తిరుపతి గెలుపుతో బీజేపీ కార్యకర్తల సంబురాలు చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థికి 1379, బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 1372 వోట్లు వొచ్చాయి. ఏడు వోట్ల తేడాతో విజయం సాధించారు బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి.

అయితే దీనిపై బిఆర్‌ఎస్‌ ‌నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు. రీ కౌంటింగ్‌ ‌కోసం పట్టుబట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రుద్రంగిలో బీఆర్‌ఎస్‌ ‌బలపరిచిన ఆకుల గంగారం అనే అభ్యర్థి 36 వోట్లతో గెలిచారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 523, స్వతంత్ర అభ్యర్థికి 487 వోట్లు లభించాయి. ఈనెల 24వ తేదీన శనివారం సిరిసిల్ల సహకార విద్యుత్‌ ‌సరఫరా సంఘం సెస్‌ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. 15 డైరెక్టర్‌ ‌పోస్టుల కోసం జరిగిన ఎన్నికల్లో గెలవడానికి ప్రధాన పార్టీలు అన్ని ప్రయత్నాలు చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *