సెయిలింగ్ చాంపియన్‌షిప్‌ లో కొమరవెల్లి సిస్టర్స్‌ జోరు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లోని హుస్సేన్‌ సాగర్‌‌లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌ లో భారత నంబర్.1 దీక్షిత కొమరవెల్లి సబ్ జూనియర్ బాలికల విభాగంలో శుక్రవారం అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. గురువారం మూడు రేసుల్లో నెగ్గి హ్యాట్రిక్ ఫ్లీట్‌తో టాప్ ప్లేస్ లో నిలిచిన తన చెల్లెలు లాహిరిని వెనక్కునెట్టి అగ్రస్థానంలోకి చేరుకుంది. హైదరాబాద్ జిల్లాకు చెందిన కొమరవెల్లి సిస్టర్స్ స్వర్ణం, రజతం కోసం ముందంజలో ఉన్నారు. రసూల్‌పురా ఉద్భవ్ స్కూల్ కు చెందిన ఈ ఇద్దరు అమ్మాయిలు చెరో 17 పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే 7 రేసుల అనంతరం ఒకదాన్ని మినహాయించేందుకు(డిస్కార్డ్)ను అనుమతించడంతో దీక్షిత కేవలం ఒక పాయింట్ తేడాతో తన సోదరి లాహిరిని వెనక్కునెట్టింది. రాష్ట్రంలో టాప్ సీడెడ్‌ సెయిలర్స్ అయిన ఈ ఇద్దరి మధ్య విజేత ఎవరో శనివారం తేలనుంది. మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న షేక్‌పేట్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన బిందు రత్లావత్ తన అత్యుత్తమ ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లో మొదటి కాంస్య పతకాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. బాలుర విభాగంలో వికారాబాద్‌కు చెందిన బన్నీ బొంగూర్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, మహబూబ్‌నగర్‌కు చెందిన వినోద్‌ దండు అతని తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక, జూనియర్ ఓపెన్ విభాగంలో 3 రేసులు పూర్తయ్యాయి. ఇందులో జూనియర్ నేషనల్ ఛాంపియన్ వైష్ణవి అంచనాలను అందుకున్నది. మూడింటిలో రెండు స్పష్టమైన విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. పోటీలో ఉన్న అబ్బాయిలందరినీ స్పష్టమైన తేడాతో ఓడించింది. మొత్తం 59 ఎంట్రీలతో ఇది తెలంగాణలో జరుగుతున్న అతిపెద్ద రెగట్టా పోటీల్లో ఒకటి అని రాష్ట్ర సెయిలింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు దాది భోటే అన్నారు. ఈ టోర్నీ శనివారంతో ముగుస్తుందని, సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్‌లోని యాచ్ క్లబ్‌లో విజేతలకు ట్రోఫీలు అందజేస్తారన్నారు. లీడర్ బోర్డ్ సబ్ జూనియర్ బాలికలు దీక్షిత కొమరవెల్లి-11, లాహిరి కొమరవెల్లి-12, బిందు రత్లావత్-52 పాయింట్లు సబ్ జూనియర్ బాలురు

బన్నీ బొంగుర్-23, వినోద్ దండు-33, మహ్మద్ రిజ్వాన్-35, జూనియర్ ఓపెన్
వైష్ణవి వీరవంశం-6, ఝాన్సీ ప్రియా లావేటి-9, శ్రవణ్ కత్రావత్-11 పాయింట్లు సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *