- మై హోమ్ సిమెంట్ కంపెనీలో కూలిన లిఫ్ట్
- ఐదుగురు కాంట్రాక్టు కార్మికులు దుర్మరణం…పలువురికి తీవ్ర గాయాలు
సూర్యాపేట, ప్రజాతంత్ర, జూలై 25 : రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మేళ్లచెరువు మైహోమ్ సిమెంట్ కంపెనీలో నూతనంగా బిల్డింగ్ నిర్మిస్తున్న క్రమంలో లిఫ్ట్ కూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కాంట్రాక్టు కార్మికులు దుర్మరణం చెందారు. అలాగే పలువురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో నూతనంగా నిర్మిస్తున్న యూనిట్-4 వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకోగా..కాంక్రీట్ వర్క్ జరుగుతుండగా ఒక్కసారిగా లిఫ్ట్ కూలినట్లు సమాచారం. లిఫ్ట్ ఎత్తులో ఉండడంతో కార్మికులు ఒక్కసారిగా కిందకు పడిపోయారు.
దీనితో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరికొంతమంది గాయపడ్డారు. వీరంతా ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందిన కార్మికులుగా తెలుస్తుంది. బతుకుదెరువు కోసం ఇక్కడికి పని కోసం రాగా ప్రమాదంతో ప్రాణాలు పోయాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. ప్రాణాలు కోల్పోయిన కార్మికులు లిఫ్ట్ లోనే ఇరుక్కోగా మిగతా కార్మికులు వారి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. లిఫ్ట్‌కు సంబంధించిన కనెక్షన్ వైర్ తెగి ప్రమాదం జరిగిందా? లేక ఓవర్ వెయిట్ వల్ల ప్రమాదం జరిగిందా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.




