రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సొసైటీ సెస్ చైర్మన్గా బీఆర్ఎస్ అభ్యర్థి చిక్కాల రామారావు (తంగళ్లపల్లి), వైస్ చైర్మన్గా దేవరకొండ తిరుపతి(కోనరావుపేట) ఎన్నికయ్యారు. ఈ మేరకు సెస్ ఎన్నికల అధికారి బీ మమత ప్రకటించారు. సోమవారం వెల్లడైన సెస్ ఎన్నికల ఫలితాల్లో 15 స్థానాల్లోనూ బీఆర్ఎస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఒక్క స్థానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకోలేకపోయింది. చిక్కాల రామారావు 1963, మార్చి 5వ తేదీన తంగళ్లపల్లి మండలం కట్కూర్లో జన్మించారు. 1995లో కట్కూర్ సింగిల్ విండో చైర్మన్గా ఎన్నికయ్యారు. 2007లో సిరిసిల్ల రూరల్ సెస్ డైరెక్టర్గా ఎన్నిక.. ఆ తర్వాత చైర్మన్ గా ఎన్నికై నాలుగేండ్లు పనిచేశారు.
2022లో తంగళ్ళపల్లి సెస్ డైరెక్టర్గా ఎన్నిక.. రెండో సారి సెస్ చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2018 లో వెలమ సంక్షేమ మండలి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. 2021లో రెండో సారి వెలమ సంక్షేమ మండలి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2001 నుంచి కేసీఆర్ వెంటే ఉన్నారు.మంత్రి కేటీఆర్ సిరిసిల్లకు రావడంలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమంలో ముందుంటూ, పార్టీకి వెన్నంటి ఉన్నారు. మంత్రి కేటీఆర్కు విధేయుడిగా ఉన్నారు. వైస్ ఛైర్మన్ దేవరకొండ తిరుపతి కోనరావుపేట గ్రామంలో జన్మించారు. 2003లో పార్టీ మండల యూత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
2014లో వార్డు మెంబర్గా సేవలందించారు. 2015, జనవరి నుంచి 2016 జనవరి వరకు సెస్ డైరెక్టర్ నామినేటెడ్ పదవిలో కొనసాగారు. 2016లో సెస్ డైరెక్టర్గా మొదటిసారి ఎన్నికయ్యారు. 2022లో ఒక నెల రోజుల పాటు సెస్ డైరెక్టర్ నామినేటెడ్ పోస్టులో ఉన్నారు. సెస్ డైరెక్టర్గా మరోసారి ఎన్నికై, వైస్ చైర్మన్గా పదవి దక్కించుకున్నారు.




