సింగరేణి ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త..

ఇక ఒక్కొక్కరికి రూ.కోటి ప్రమాద బీమా ద పథకాన్ని ప్రారంభించిన  సిఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : సింగరేణి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. సంస్థ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఇప్పటివరకు సింగరేణి ఉద్యోగుల ప్రమాద బీమా రూ.40 లక్షలుగా ఉండగా.. ప్రభుత్వం ఇప్పుడు రూ. కోటికి పెంచింది  అయితే..ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా ప్రమాద బీమాను రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 43 వేల మంది కార్మికులకు కోటి ప్రమాద బీమా పథకం వర్తించనుంది. అయితే..ఇప్పటి వరకు కేవలం సైనికులకు మాత్రమే ప్రమాద బీమా కోటి రూపాయలు ఉండగా.. ఇక నుంచి సింగరేణి కార్మికులకు కూడా వర్తించనుంది.

బీమా ప్రయోజనాలు: సింగరేణి ఉద్యోగులు ప్రమాదంలో మరణించిపుడు గానీ, శాశ్వత పాక్షిక వైకల్యం/ పూర్తి శాశ్వత వైకల్యం సంభవించినపుడు గానీ ఉద్యోగుల జీతంతో సంబంధం లేకుండా కోటి రూపాయల ఉచిత ప్రమాద బీమా సదుపాయం అందుతుంది. యూనియన్‌ బ్యాంక్‌ డెబిట్‌ కార్డును నెలలో ఒక్కసారైనా వాడటం ద్వారా అదనంగా రూ.15 లక్షల బీమా ప్రయోజనం పొందవచ్చు. ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేకుండా రూ. 1.15 కోట్ల ప్రమాద బీమా సదుపాయం సింగరేణి ఉద్యోగులు పొందవచ్చు.  అలాగే అగ్ని ప్రమాదం జరిగి ప్లాస్టిక్‌ సర్జరీ వంటి ట్రీట్‌మెంట్‌ అవసరమైనపుడు రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. ప్రమాదంలో మరణించిన ఉద్యోగి మృతదేహాన్ని తరలించేందుకు రూ. 20 వేల ఆర్థిక సహాయం అందిస్తారు.

ప్రమాదంలో ఉద్యోగి చనిపోయే సమయానికి గ్రాడ్యుయేషన్‌ చదివే పిల్లలు ఉంటే వారికి  రూ.6 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. ఎయిర్‌ అంబులెన్స్‌ అవసరమైన పక్షంలో రూ.6 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఇద్దరు కుటుంబ సభ్యులు వెళ్లడానికి వీలుగా రవాణా ఖర్చుకింద రూ.20 వేలు చెల్లిస్తారు. అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకుంటే ఏడాదిలో రూ. 15 వేల వరకు ఇన్‌ పేషెంట్‌ కవరేజ్‌ సదుపాయం కల్పించనున్నారు. యూనియన్‌ బ్యాంక్‌ ఏటీఎంను అపరిమితంగా వినియోగించుకోవచ్చు. దీనిపై ఎలాంటి అదనపు ఛార్జ్‌  ఉండదు. ఎస్‌ఎంఎస్‌, ఆర్టీజీఎస్‌, ఐఎంపీఎస్‌ ఛార్జీలు కూడా ఉండవు. లాకర్‌ సదుపాయాన్ని ఉపయోగించుకుంటే మొదటి ఏడాది రెంట్‌ మీద 50 శాతం రాయితీ వెసులుబాటు కల్పించారు. రూ.25 లక్షల పైన గృహ రుణంపై ప్రాసెసింగ్‌ ఫీజు మినహాయింపు కూడా ఇవ్వనున్నారు. అలాగే.. గృహ రుణం వడ్డీ పై 0.05 శాతం ప్రత్యేక కన్సెషన్‌, వాహన రుణాల వడ్డీపై 0.10 శాతం ప్రత్యేక రాయితీ, విదేశీ విద్యాకోసం తీసుకునే రూ. 75 లక్షలకు పైగా రుణాలపై 0.10 శాతం రాయితీ అందించనున్నారు. కుటుంబ సభ్యులు ముగ్గురు (జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలు) జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు తెరిచేందుకు అవకాశం కల్పించారు. కాగా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాలరీ ప్యాకేజీ కలిగిన సింగరేణి ఉద్యోగులందరికీ ఈ బీమా వర్తిస్తుంది. ఉద్యోగి రిటైర్‌ అయిన తర్వాత పింఛన్‌ ఖాతాను యూనియన్‌ బ్యాంకులోనే కొనసాగించడం ద్వారా 70 ఏళ్ల వరకు ఈ బీమా సదుపాయం అందుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *