సామాన్యుని సేవలో మేథో సంపత్తి…!

నేడు ‘ప్రపంచ మేథో సంపత్తి హక్కుల దినం’

చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు లాభాల బాటలో సాగడానికి, సామాన్యులకు అందుబాటులో శాస్త్ర సాంకేతిక విప్లవ ఫలాలను నిలవటానికి, దేశ ఆర్థిక రంగం పరిపుష్టం కావడానికి, సృజనశీల భావనలు, వినూత్న ప్రతిపాదనలతో కూడిన మేథో సంపత్తి ఆలోచనలు దోహదపడతాయనేది వాస్తవం. సాంప్రదాయ ప్రక్రియలకు ప్రత్యామ్నాయంగా క్రియాశీల, సరళ, బహుళ ప్రయోజన ఉపకరణాలు మార్కెట్‌లో ప్రవేశ పెట్టడానికి వినూత్న మేథో సంపత్తి అవసరం అవుతుందనే విషయాలను చర్చించడానికి ప్రతి ఏటా 26 ఏప్రిల్‌ ‌రోజున విశ్వవ్యాప్తంగా ‘ప్రపంచ మేథో సంపత్తి హక్కుల దినం’గా పాటిస్తారు. వినూత్న ఆవిష్కరణలు, సృజనశీల ప్రక్రియలను ప్రోత్సహించే క్రమంలో మేథో సంపత్తి హక్కుల పరిరక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుంది. ప్రపంచ మేథో హక్కుల దినం-2022 నినాదంగా ‘మేథో హక్కులు – బంగారు భవిత కోసం వినూత్న ఆలోచనల యువత’ అనే అంశాన్ని తీసుకోవడం జరిగింది. కొన్ని దేశాల్లో ఏప్రిల్‌ 26 ‌నుంచి 30 వరకు ‘ప్రపంచ మేథో హక్కుల వారోత్సవాలు’ జరుపుకునే ఆనవాయితీ ఉన్నది.

ప్రతి వ్యాపారానికి ఓ స్పష్టమైన ఆలోచన ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు విస్తరించబడి ఉన్నాయి. ఓ ఆవిష్కర్త మెదడులో అంకురించిన వినూత్న సృజనశీల ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడం ద్వారా వ్యాపార సంస్థ ఆవిర్భవిస్తుంది. ఈ ఆలోచన విలక్షణతను కలిగి ఉన్నట్లైతే సామాన్యుని దృష్టిని ఆకర్షించి వ్యాపారం సత్వరమే వృద్ధి చెందుతుంది. మేథలో జనించిన నవ్య ఆలోచనలు మార్కెట్‌ అవస రాలకు అనుకూలంగా ఉండాలి. మార్కెట్‌లో సఫ లమైన ఆలోచనలకు కారణమైన ఆవి ష్కర్తలను, సృష్టి కర్తలను కొనియాడడానికి ‘ప్రపంచ మేథో సంపత్తి హక్కుల దినం’ వేదిక ఉపయోగపడాలి. ఆకర్షనీయ, ఉపయోగకరమైన వస్తువులు/ఉపకరణాలు/ఉత్పత్తులు/కంపెనీలు/పరిశ్రమలను ప్రోత్సాహ పూర్వకంగా అభినందించడం మన కర్తవ్యంగా భావించాలి. సమాజ సేవతో పాటు దేశ ఆర్థిక గమనానికి ఊతం ఇవ్వగల చిన్న, మధ్య తరహా వ్యాపారాల ప్రగతి మేథో సంపత్తి మీదనే ఆధారపడి ఉండడంతో మేథో సంపత్తి హక్కులకు అధిక ప్రాధాన్యత సంతరించుకున్నది.

భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వశాఖ పరిధిలోకి మేథో సంపత్తి హక్కులు వస్తాయి. వాణిజ్య రంగంలో ప్రముఖంగా వాడబడే కళా ఖండాలు, చిహ్నాలు, పేర్లు, చిత్రాలు (ఇమేజెస్‌) ‌లాంటివి మేథో సంపత్తులుగా వర్గీకరించబడినవి. మేథో సంపత్తికి కారణమైన ఆవిష్కర్తకు సరైన హక్కులు, గుర్తింపు ఉండేలా చట్టాలు చేయబడ్డాయి. మేథో సంపత్తి హక్కులు రెండు రకాలుగా ఉంటాయి. సాహిత్య మరియు కళాత్మక క్రియలకు సంబంధించిన ‘కాపీ రైట్స్’ ‌కనీసం 50 ఏండ్లు వరకు ఉంటాయి. పారిశ్రామిక రంగంలో వాడే ట్రేడ్‌మార్కులు, జియొగ్రాఫికల్‌ ఇం‌డికేటర్స్, ‌పెటెంట్లు, చిహ్నాలు, డిజైన్లు, ట్రేడ్‌ ‌సీక్రెట్లు లాంటివి కూడా మేథో సంపత్తి హక్కులుగా గుర్తించబడినవి. ఆవిష్కర్తలు, సృజనశీలురకు చట్టం ద్వారా హక్కులు ఇవ్వబడ్డాయి. మేథో సంపత్తి రంగంతో ఆర్థిక పురోగతి, ఉద్యోగ కల్పన, పారిశ్రామిక ప్రగతి, వ్యాపార వెసులుబాటు లాంటి ప్రయోజనాలతో పాటుగా సామాన్యుని జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఆవిష్కర్తకు పరిమిత కాల వ్యవధితో కూడిన హక్కులు లభించటం వల్ల ఆవిష్కర్తలకు ప్రోత్సాహం/గుర్తింపు కలుగుతుంది.

జాతీయ మేథో హక్కుల విధానం-2016 ప్రకారం ‘క్రియేటివ్‌ ఇం‌డియా బీ ఇన్నోవేటివ్‌ ఇం‌డియా’ నినాదంతో ముందు సాగడం జరుగుతున్నది. మేథో సంపత్తి హక్కుల పరిరక్షణకు ‘డిపార్టుమెంటు ఆఫ్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌పాలసీ అండ్‌ ‌ప్రమోషన్‌’ ‌నాయకత్వంలో ‘సెల్‌ ‌ఫర్‌ ఐపిఆర్‌ ‌ప్రమోషన్‌ అం‌డ్‌ ‌మేనేజ్‌మెంట్‌’ ‌విభాగం విశేష కృషి చేస్తున్నది. గ్లోబల్‌ ఇన్నోవేటివ్‌ ఇం‌డెక్స్-2019 ‌నివేదిక ప్రకారం భారత్‌కు 52వ ర్యాంకు  ఇవ్వబడింది. ఇండియాలో ఐసిటి, సర్వీస్‌ ఎగుమతులు, వినూత్న వస్తు ఎగుమతులు, విశ్వవిద్యాలయ నాణ్యతలు లాంటివి ఇన్నొవేషన్‌ ‌వృద్ధికి దోహదపడుతున్నాయి. గ్లోబల్‌ ఇన్నొవేటివ్‌ ఇం‌డెక్స్ ‌జాబితాలో 1వ ర్యాంకులో స్విజర్లాండ్‌ ఉం‌డగా తరువాత స్థానాల్లో స్వీడెన్‌, అమెరికా, నెథర్లాండ్‌, ‌యూకె, ఫిన్‌లాండ్‌, ‌డెన్మార్క్, ‌సింగపూర్‌, ‌జర్మనీ, ఇజ్రాయిల్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో 52వ ర్యాంకు పొందిన భారత్‌లో నాణ్యమైన విద్యాసంస్థలు, ఉన్నత విద్యా ప్రమాణాలు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, ఆవిష్కర్తల ప్రోత్సాహం, పరిశోధనలకు నిధులు లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఇన్నొవేషన్‌ ‌రంగంలో మన దేశ ర్యాంకు మెరుగు పడుతుందనటంలో సందేహం లేదు. ఆధునికతకు, సరళ జీవన విధానానికి పునాది వినూత్న సృజనశీల ఆవిష్కరణ అని నమ్ముదాం. ఆవిష్కర్తలను అక్కున చేర్చుకుందాం.

– డా।। బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *