సమర్థవంతంగా ఎన్నికల విధులు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 20:  ఎలాంటి ఒత్తిడికి  లోను కాకుండా ప్రశాంతంగా కౌంటింగ్ విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి అన్నారు.  సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో  కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు వారి విధులపై  నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, ఎన్నికలలో ముఖ్యమైన ఘట్టం కౌంటింగ్ అని ఎలాంటి పొరపాట్లు జరగకుండా కౌంటింగ్ వీధులు నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్ కొరకు కేటాయించబడిన సిబ్బంది అందరూ పూర్తి అవగాహనతో పాటు సమయస్ఫూర్తి కలిగి ఉండాలని, కౌంటింగ్ లో భాగంగా  ముందుగా పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించాలని అన్నారు.  ఎన్నికల పరిశీలకుల ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు నిర్వహించడం జరుగుతుందని, కౌంటింగ్ కేంద్రాన్ని పరిగి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలను అక్కడే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  ఓట్ల లెక్కింపులో భాగంగా  సిబ్బంది అందరికీ ఓటింగ్ యంత్రాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. రాండమైజేషన్ తర్వాత కౌంటింగ్ సెంటర్లను కేటాయించడం జరుగుతుందని, కేటాయించిన కౌంటింగ్ సెంటర్ కు సిబ్బంది అందరూ సకాలంలో హాజరుకావాలని, దూర ప్రాంతాల నుండి వచ్చేవారు ఒకరోజు ముందుగానే చేరుకోవాలని సూచించారు.  ప్రశాంతంగా ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పద్ధతి ప్రకారంగా విధులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చక్రపాణి, డిపిఓ  తరుణ్ కుమార్, భూగర్భ జల వనరుల శాఖ అధికారిని దీపారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *