సవాళ్ళు ఎదుర్కొంటేనే ఫలితాలు సాధ్యం
దాహమేసినప్పుడే నీరు కోసం బావి తవ్వటం వివేకత అనిపించుకోదు. ఏదైనా లక్ష్యం ముందున్నప్పుడు దాని సాధనకు అనుసరించాల్సిన కార్యాచరణ కూడా ముందు నుండే వుండటం ఆ లక్ష్యసాఫల్యతకు దోహదపడుతుంది. ఒక విలువైన రంగంలో అభివృద్ధి కి అనుభవజ్ఞుల సహకారాన్ని పెడచెవిన పెట్టిన ఫలితంగా ఆ రంగం అనేక విధాల చిధ్రమైన తరువాత చివరి దశలో లక్ష్యాలు మహోన్నతంగా వుండాలని, కార్యాచరణ బలంగా వుండాలని ఫలితాలు మెరుగ్గా రావాలని ఆశించటం సహేతుకం అనిపించుకోదు. తెలంగాణ లో గత ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితంగా పాఠశాల విద్యారంగం దశాబ్ద కాలంగా అనేక అవలక్షణాలను రంగరించబడి విలువల పతనంతో పక్కదారి పట్టిందనేది కాదనలేము. ఇందుకు కారణాలనేవి అన్వేషించాల్సిన అవసరం వుందనుకోవటం లేదు.కోవిడ్ సంక్షోభం తరువాత పూర్తి స్థాయిలో విద్యార్థులలో కనీస తరగతి సామర్ధ్యాలు లేకుండా పోయాయనేది కన్పిస్తుంది.ఈ నేపధ్యంలో ఈ విద్యాసంవత్సరం ఆశావహంగా వుంటుందనుకున్న విద్యారంగ మేధావుల,బుద్దిజీవుల అంఛనాలు నీరుకారే అవకాశాలున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభం నుండి జనవరి చివరి వరకు కూడా తరగతి బోధనాభ్యస నలు వాటి వాస్తవ లక్ష్యాలకు దూరంగా కొనసాగాయి. గత ప్రభుత్వం రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యత సంక్షేమ రంగాల నిర్వహణ,పర్యవేక్షణలపై చూపలేదు. పైపెచ్చు పాఠశాలను,ఉపాధ్యాయులనూ. విద్యార్థులనూ తరగతి బోధనాభ్యసనలకు దూరం చేసే ప్రత్యక్ష, పరోక్ష కార్యక్రమాలు నిర్వహింపచేసిందనే విమర్శలున్నాయి. సమాజం నుండి పాఠశాలను వేరు చేస్తూ, ప్రభుత్వ విద్యారంగం పై సమాజం లో తప్పుడు ఆపోహలను కలిగించిందనే విమర్శలున్నాయి.
సంవత్సరమంతా పనిదినాల విధ్వంసం
ఈ విద్యా సంవత్సరం ఆగస్ట్ లో ఉన్నత పాఠశాలల్లో లిలెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం’లి (ఎల్ఐపీ) పేరిట ప్రాథమిక తరగతులకు ఎఫ్.ఎల్.ఎన్.(తొలిమెట్టు),6 నుండి 9 తరగతుల విద్యార్థులకు తరగతి వారి సామర్ధ్యాల పెంపుకు ఉన్నతి పేరిట,పదవ తరగతికి లక్ష్య పేరిట కార్యక్రమాలు అమలు గమనార్హం!.లక్ష్యాలు సరే కానీ,అమలు తీరులో ఉపాధ్యాయుల బోధనానుభవాన్ని, విషయపరిజ్ఞానాన్ని, పని సంస్కృతిని పరిగణనలోకి తీసుకోకపోవటం జరిగింది.గత రెండు దశాబ్దాలుగా ఎస్.సి.ఇ.ఆర్.టి.వేర్వేరు పేర్లతో ఇచ్చిన శిక్షణలు తెలంగాణ ఉపాధ్యాయులలో నాణ్యమైన బోధనాభ్యసనలు అభివృద్ధి చేయటంలో వైఫల్యం చేందాయా!అందుకే యేటేటా పేర్లు మార్చుకొని శిక్షణలు ఇచ్చారా! లేక శిక్షణలు,సంసిద్దతల పేరిట యేండ్ల తరబడి ఎస్.సి.యి.ఆర్.టి. లో తిష్టా వేసుకున్న విషయనిపుణులనే కొందరు ఉపాధ్యాయుల బృందం వైఫల్యమా! ఎస్.సి.ఇ.ఆర్.టి.ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్
సిద్దం చేసేప్పుడు తరగతి బోధనాభ్యసనలు,పాఠ్యాంశ,సహ పాఠ్యాంశ,మూల్యాంకనాలకు తగు సమయాలను, తేదీలను కేటాయిస్తుంది. వివిధ కార్యక్రమాల నిర్వహణ, వివిధ శిక్షణల కోసం సమయాన్ని కేటాయించదు. జూన్ లో విద్యా దినోత్సవం,జులైలో పఠనోత్సవం,ఆగస్ట్ నెలలో ‘లిప్’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.ఈ కార్యక్రమాలపై సి.ఆర్.పి. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు క్లస్టర్ పరిధి లోని పాఠశాలల సందర్శన షెడ్యూల్ పోనుపోనూ ఎక్కువ పనిదినాలను తీసుకుంటున్నది.
రివిజన్ చాలకున్నా వరుస మూల్యంకనాలా!
సి.సి.ఇ. పద్దతి మేరకు బోధనలో మూల్యాంకనం అంతర్భాగంగా వుంటుంది.పాఠ్యాంశాల వారీగా జరిగే మూల్యాంకనం, సంగ్రహణా త్మక మూల్యాంకనం.నిర్మాణాత్మక మూల్యాంకనం తదితరాలన్నీ సాధించిన ఫలితాలు, ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలు రాసే వారి విషయవారీ సామర్ధ్యాలు, వీటిపై పాఠశాల స్థాయి సమీక్షలు జరిపేందుకు పాఠశాల హెడ్ మాస్టర్ సబ్జెక్ట్ టీచర్లకు సమయం చాలటం లేదు.మార్చి మూడవవారంలో ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది.రివిజన్ జరిపే సమయంలో ఉన్నతి మానిటరింగ్ టీంలు పాఠశాలలు సందర్శించిన నేపధ్యంలో రివిజన్ లో ప్రణాళిక, నాణ్యత లోపించింది. మొక్కుబడి రికార్డులు సంసిద్దతకే సమయం గడిచింది.రివిజన్ సంతృప్తికరంగా పూర్తికాకముందే ఫిబ్రవరి 5 నుండే స్పెషల్ టెస్ట్, మార్చిలో మరొక ప్రీ ఫైనల్ టెస్ట్ నిర్వహించనున్నారు. రివిజన్ సంతృప్తికరంగా పూర్తికాకముందే నిర్వహించే ప్రీ ఫైనల్ మూల్యంకనాలతో లభించే ఫలితాలు ఏ మేరకు లాభిస్తయనేది ప్రశ్నార్ధకమే!. విద్యా సంవత్సరంలో జూన్ నుండి జనవరి వరకు తొమ్మిది నెలల విలువైన విద్యా సమయ నిర్లక్ష్యానికి కారణాలు తెలియనివి కావు. చివరి సమయమైన ఫిబ్రవరి నెల ప్రారంభమవుతుండగా, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నెలన్నరలో వుండగా విద్యాశాఖ యంత్రాంగం ఎట్టకేలకు ఆప్రమత్తమయింది.ఆ పరీక్షల ఫలితాలు ఉన్నతంగా వుండాలనే లక్ష్యాల నిర్ధేశనతో ఉరుకులు పరుగులతో కార్యక్రమాలు ప్రణాళికలు సిద్దంచేయటం, ప్రిన్సిపల్ కార్యదర్శి,జిల్లా కలెక్టర్ల స్థాయిలో యుద్ధప్రాతిపదికన సమీక్షా సమావేశాలు, సన్నద్ధ ప్రణాళికలు అమలుకు పూనుకున్నారు.
విద్యాసంవత్సరమంతా ఉన్నతి అమలు పేరిట క్షేత్ర స్థాయిలో బోధనాభ్యసనలకు విఘాతం కలిగించి ,ఉపాధ్యాయులను రికార్డులు,రిపోర్టులు సిద్దంచేసే గుమాస్తాలు మార్చిన నేపధ్యంలో రేపటి పరీక్ష ఫలితాలు ఉన్నతంగా వుండాలనే లక్ష్యం సాధ్యమవటం అనుమానమే! యు డైస్ ప్లస్ లో నమోదైన పదవ విద్యార్థులందరితో పరీక్ష ఫీజు కట్టించాలని అధికారులు నిర్ధేశించారు. యు డైస్ ప్లస్ లో నమోదైన లేదా ఎఫ్.ఆర్.ఎస్.లో నమోదైన పదవ విద్యార్థులలో కొందరు భిన్న కారణాల చేత పాఠశాలకు అందుబాటులో లేరు. రివిజన్ కార్యక్రమానికి అందుబాటులో లేరు.వారికి ఇంటర్నల్ మార్కులు వేయటం,ఎఫ్.ఆర్.ఎస్.చేయటం సమస్యగా మారటం అనేది గమనించాలి. ఇప్పటికే రాష్ట్రంలో 20 వేలకు ఫైనే ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీ వున్నాయి. పర్యవేక్షకాధికారులు, మండల విద్యాధికారులు, పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీలున్నాయి.
ఉపాధ్యాయులు కొరతతో నడుస్తున్న పాఠశాలల్లో ఈ శిక్షణల కోసం విషయ నిపుణులుగా వెళ్ళటం తిరిగి మండల స్థాయి శిక్షణలు,ఇవ్వటం వీటన్నింటికి హాజరయ్యే ఉపాధ్యాయులకు పనివత్తిళ్ళు పెరగటం,తరగతుల నిర్వహణ నష్టాలు లెక్కలోకి రావటం లేదు. పైగాఈ సమస్త కార్య నిర్వహణ నివేదికల సిద్దం చేయటం,ఎం.ఆర్.సి.లలో అందచేయటం,ఆన్ లైన్ చేయటం ఇవన్నీ రెగ్యులర్ బోధనాభ్యసనలకు ఉపాధ్యాయులను దూరం చేసేడివే అనేది వాస్తవమని అంగీకరించాలి.ఈ నేపధ్యంలో పదవ తరగతి పరీక్షార్ధులైన విద్యార్థుల రివిజన్ సంతృప్తికరంగా సాగలేదు.రివిజన్ కోసం మరింత సమయం అవసరం కాగా వరుస ప్రీ ఫైనల్ పరీక్షలు ముందుకొచ్చాయి. స్పెషల్ టెస్ట్ పేరిట ఒక ప్రీ ఫైనల్ నిర్వహణ పూర్తవుతూంది.రెండవ ప్రీ.ఫైనల్ నిర్వహణకు మరో షెడ్యూల్ విడుదల చేశారు.రివిజన్ కు సమయం కేటాయించకుండా వరుస ప్రీ ఫైనల్ ల నిర్వహణ ఫలితంగా విద్యార్థులే కాదు వారి తల్లి దండ్రులు,ఉపాధ్యాయులను సైతం వత్తిళ్ళకు గురి చేస్తున్నారు.
ఫలితాలపై పోస్టుమార్టం!
పది పబ్లిక్ పరీక్షలో పది జి.పి.ఏ.వచ్చిన వారి సమాధాన పత్రాలు తిరిగి పరిశీలించాలనే ప్రతిపాదన అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందు వలన లభించే ప్రయోజనం ఎంతో కొంత వుండవచ్చు.కానీ ఇంతకన్నా ప్రాధాన్యత గల అంశాలను ప్రభుత్వం విస్మరించటం వలన నష్టమే!ప్రధానంగా కోవిడ్ తరువాత బ్యాచ్ ల విద్యార్థులలో రాత కరువైంది.అరవై శాతం మంది విద్యార్థుల చేతిరాతలో వైఫల్యం, అక్షర దోషాలు,వాక్యనిర్మాణ లోపాలు అనేది సమస్యగా పరిగణించకపోవటం శోచనీయం..ఇందుకోసం విద్యార్థులకు రివిజన్ పై క్షేత్రస్థాయిలో అనుభవజ్ఞులైన హెడ్ మాస్టర్లు,సబ్జెక్ట్ నిపుణులతో చర్చించి సబ్జెక్ట్ లలో వెనుకబడిన విద్యార్థుల కోసం నెల రోజుల ప్రత్యేక కార్యక్రమం అమలు చేయటం పై దృష్టి పెట్టాలి. పది పరీక్షల షెడ్యూల్ ఒక వైపు జారీ చేస్తూనే కొన్న ఉన్నత పాఠశాలల్లో సరైన సబ్జెక్ట్ ఉపాధ్యాయులు లేక పోవటం సమస్యగా భావించాలి.
ఫిబ్రవరి మూడవ వారంలో కేంద్ర ఎన్నికల కమీషన్ పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు లేకపోలేదు. ఈ సవాళ్ళన్నింటినీ ఎదుర్కుంటే తప్ప పది పరీక్షల ఫలితాలు లక్ష్యాలను చేరుకోలేవు. ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతుల నిర్వహిస్తుండగా సాయంత్రం విద్యార్థులకు స్నాక్స్ ఫిబ్రవరి 5వ తేదీ నుండి ఇవ్వమని ఆదేశాలిచ్చారు. గత సంవత్సరం విద్యార్థికి కోడిగుడ్లు ఇవ్వమంటూ,విద్యార్థికి పదిహేను రూపాయలు ఇవ్వగా ఈ యేడు గుడ్డు పంపిణీ తొలగించి పది రూపా యలే కేటాయించారు. ఈ కార్యక్రమ నిర్వహణ ఎవరికి అప్పగించాలనేది పేర్కొనకుండా హెడ్ మాస్టర్ల నిర్ణయానికే వదిలేశారు. ఈ కార్యక్రమం మొదలై పది రోజులు గడిచినా హెడ్ మాస్టర్లకు వాటి నిధులు ఇంకా క్రెడిట్ కాలేదు.
-అజయ్‌బాబు,
సంపాదకవర్గ సభ్యుడు, ఉపాధ్యాయదర్శిని, టి.పి.టి.ఎఫ్





