- నేతలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలి
- అవసరమైతే పాదయాత్రలు చేయాలి
- పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం
- నివేదికలన్నీ బిఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయని వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10 : షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ మరోమారు స్పష్టం చేశారు. నేతలంతా నియోజకవర్గాల్లో తమ కార్యాక్రమాలతో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ భవన్ లో జరుగుతున్న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పలు అంశాలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు డిసెంబర్లో ఉంటాయని, ఆలోపు ఎన్నికలకు ప్లాన్ చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. నాయకులంతా నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. నియోజకవర్గాల్లో వీలైతే పాదయాత్రలు చేయాలని చెప్పారు. వీలైనన్ని ఎక్కువగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ముందస్తు ఎన్నికలు వొస్తాయని.. అతి త్వరలోనే జరగబోతున్నాయంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు..
సీఎం కేసీఆర్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారని త్వరలోనే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్తారని కూడా ప్రచారం జరిగింది. దీనిపై బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై స్వయంగా కేసీఆరే స్పందించి సమాధానం ఇచ్చారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత సమావేశంలో నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ముచ్చటే లేదు. డిసెంబర్లోనే ఎన్నికలు జరుగుతాయి.. దాని ప్రకారమే ప్లాన్ చేసుకోండి. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించుకోవాలి. సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించండి. కచ్చితంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది. ఏప్రిల్-27న వరంగల్లో భారీ బహిరంగ సభ ఉంటుంది’ అని సమావేశంలో నేతలకు కేసీఆర్ చెప్పేశారు. అంతేకాదు.. ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ సూచించారు. నేతలంతా నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజా సమస్యలను పరిష్కారించాలని కేసీఆర్ కీలక సూచనలు చేశారు.
ఇక నుంచి నేతలంతా ప్రజల్లోనే ఉండాలని.. అవసర మైతే పాదయాత్రలు కూడా చేసుకోవాలని నేతలకు గులాబీ బాస్ సలహా ఇచ్చారు. దిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు వొచ్చాక ఈ రాజకీయ వాతావరణం మరింత వేడిగా మారింది. కవిత ఈడీ విచారణ, అరెస్ట్ ఊహాగానాలతో త్వరలోనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లొచ్చనే ప్రచారం ఓ రేంజ్లో జరిగింది. ముఖ్యంగా.. కేసీఆర్ గురువారం నాడు హఠాత్తుగా క్యాబినెట్ భేటీ నిర్వహించడం, మరుసటి రోజు శుక్రవారమే బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి పిలుపునివ్వడం ఈ ఊహాగానాలకు ప్రధాన కారణమైంది. కవితను అరెస్ట్ చేస్తే సానుభూతి వొస్తుందని బీఆర్ఎస్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయని, అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే సానుకూల ప్రభావం ఉంటుందని, అందుకు తగిన సమయం ఇదేననేది విశ్లేషణలు, ఊహాగానాలు వొచ్చాయి.



