మంత్రి ఉత్తమ్ చెప్పినవన్నీ అబద్ధాలే
కేఆర్ఎంబీ గెజిట్‌ను వ్యతిరేకించాం
సాగు నీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రంపై చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రమంతా తప్పుల తడకగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కాళేశ్వరం, రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులపై శ్వేత పత్రం అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా.. దానిపై హరీష్ రావు మాట్లాడుతూ.. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. శ్వేత పత్రంలో అన్నీ తప్పులే ఉన్నాయన్నారు. రూ.775 కోట్ల వ్యయంతో మిడ్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులను తామే పూర్తి చేశామన్నారు. అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై కూడా తాము కేంద్రానికి ఫిర్యాదు చేశామని హరీష్ రావు సభలో సభ్యులకు తెలిపారు. కేఆర్ఎంబీ గెజిట్ నోటిఫికేషన్ ను గతంలోనే తాము వ్యతిరేకించామన్నారు. అన్నీ అసత్యాలే చెప్పి.. గత ప్రభుత్వంపై బురదచల్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇది వైట్ పేపర్ కాదు.. ఫాల్స్ పేపర్ అని హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా పెద్ద మేటర్ అని.. ఇరిగేషన్ పై పూర్తిగా చర్చించేందుకు కనీసం 2 గంటల సమయమైనా కావాలన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ అనుభవించిన కరువు బాధలను, నీళ్ల గోసలను, అంతులేని వివక్షను, అడ్డులేని దోపిడీని చూసి ఆగ్రహించి పాటరాయని కవి. గళమెత్తని గాయకుడు లేడు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా శాసనసభలో హరీశ్‌రావు మాట్లాడుతూ పలు పాటలను గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీటి గోస గురించి కవులు రాసిన పాటలను హరీశ్‌రావు సభ ముందుంచారు. ప్రజా యుద్ధనౌక గద్దర్, అందెశ్రీ, కవి జయరాజు రాసిన పాటలను గుర్తు చేశారు హరీష్ రావు.




