శాంతించిన వరుణుడు..కొనసాగుతున్న వరదలు

  • ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలు
  • వరంగల్‌ ‌నగరంలో బాధితులను అధికారులు ఆదుకోలేదు…ప్రజల ఆగ్రహం

మూడు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన వరుణుడు గురువారం నుండి శాంతస్వరూపుడిగా మారాడు. అయినప్పటికీ ఇంకా వాగులూ, వంకలు ఉరకలు వేస్తూనే ఉన్నాయి. మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా గత వారం రోజులుగా పడుతున్న వానల వల్ల జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొత్తగా వరి విత్తనాలు వేసుకున్న పొలాలు నీటితో నిండి, ఇసుక మేటలు వేసి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఆస్తినష్టం, ప్రాణనష్టానికి దారితీసింది. పదుల సంఖ్యలో ప్రాణనష్టం కాగా, పలు ప్రాంతాల్లో పశువులు మృతి చెందాయి. వరదల్లో కొట్టుకుపోయినవారి కోసం ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. కాగా ఇంకా జలదిగ్బంధంలో ఉన్న పలువురి కోసం హెలికాఫ్టర్‌లు, పడవలను వినియోగిస్తున్నారు. కొన్ని గ్రామాలకు చెందిన ప్రజలు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు అయిదుగురు మృతి చెందగా, సుమారు 18 మంది గల్లంతు అయినట్లు తెలుస్తున్నది.

వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బూరుగుపేట శివారులోని మారేడుగొండ చెరువుకు గండి పడడంతో ఊరు ఊరంతా నీటిలో మునిగింది. గ్రామంలో నిద్రస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నీటి పాలైనారు. వారిలో బండ్ల సారయ్య శవం లభ్యం కాగా, కుటుంబ సభ్యులైన సారమ్మ, రాజయ్యల ఆచూకీ తెలియరాలేదు. ఏటూరునాగారం మండలం కొండాయి, మల్లాల మధ్య సుమారు ఎనిమిది మంది గల్లంతు కాగా, వందమంది వరకు వరదలో చిక్కుకు పోయారు. గల్లంతైన వారందరి మృతదేహాలు లభించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా వరదలో చిక్కుకున్న  వారు నిన్నటి నుండి ఆహారం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం ఉండడంతో వారికోసం జిల్లా ఎస్పీ రెండు హెలికాఫ్టర్లను తెప్పించారు. వారిలో వృద్ధులు, స్ట్రీలు ఉండటంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాడ్వాయి మండలం మేడారంలో వద్ద అయిదు మృత దేహాలు లభ్యమైనాయి.

మేడారం గుడితో పాటు రెడ్డిగూడెం, ఊరట్టం గ్రామాలు నీట మునిగాయి. వీరాపురం, అల్లంవారి ఘణపురం, చెల్పాక, బన్నాజీ బంధం, ఎలిశెట్టిపల్లి, కొత్తూరు గ్రామాలను నీరు చుట్టుముట్టింది. హనుమకొండ జిల్లా వేలేరు మండలం జన్నారం మత్తడిలో సైకిల్‌ ‌మోటర్‌తో సహా  మహేందర్‌(32) అనే వ్యక్తి కొట్టుకుపోయి ముళ్ళకంచలో మృతుడిగా లభ్యమైనాడు. ఉగ్రరూపం దాల్చిన భూపాలపల్లి  జిల్లా మోరంచపల్లిలో రెండు రోజులుగా వరద ఉధృతి తగ్గింది. గ్రామం అంతా నీట మునగటంతో వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలో చిక్కుకున్న కొందరిన హెలికాఫ్టర్ల సహాయంతో రక్షించారు. అయితే ఇక్కడ భారీగా పశువులు మృతి చెందాయి.

వరంగల్‌ ‌నగరంలో బాధితులను అధికారులు ఆదుకోలేదు…ప్రజల ఆగ్రహం
ట్రైసిటీగా పేరున్న వరంగల్‌, ‌హనుమకొండ, కాజీపేట ప్రాంతంలో వరద బీభత్సానికి గురైన ప్రాంతాల్లో ప్రజలు అనేక ఇబ్బందులకు గురైనారు. వరదలో తాము చిక్కుకుపోతే కనీసం తమను పట్టించుకున్నవారే లేరని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాజీపేట రైల్వే జంక్షన్‌లో ప్లాట్‌ఫాంపై వరకు నీరు చేరుకోవడంతో పలురైళ్ళను ఇక్కడ నిలిపి వేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురైనారు. తమకు కనీసం మంచినీళ్లు అయినా సరఫరా చేయకపోవడం పట్ల వారు రైల్వే అధికారులను, జిల్లా అధికారులను నిందించారు. భద్రకాళీ దేవాలయం ప్రాంతంలో ఉన్న అర్చకుల కాలనీ మొత్తం నీట మునిగింది. ఇక్కడున్న దాదాపు 50 కుటుంబాలు ఒక్కసారే వరద తాకిడికి గురైనారు. నీరు ఇండ్లలోకి, ముఖ్యంగా గ్రౌండ్‌ ‌ఫ్లోర్‌లో నీరు చేరుకోవడంతో బియ్యం, పప్పులు. బట్టలు అన్నీ నీళ్ళలో మునిగి పోవడంతో దిక్కుదోచని పరిస్థితి ఏర్పడింది. పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎవరూ రాలేదన్నారు. కాగా, శుక్రవారం కొద్దిగా నీరు తగ్గుముఖం పట్టడంతో ట్రాక్టర్లు మాట్లాడుకుని సురక్షిత ప్రాంతాలకు తరలారు. ములుగు రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం వరకు ఇంకా రోడ్లపైన నీరు ప్రవహిస్తూనే ఉంది.

వరదలో లక్షలాది రూపాయల కలప కొట్టుకుపోయినట్లు అక్కడ సామిల్లు అధికారులు సిబ్బంది చెబుతున్నారు. కర్రకోత మిషన్‌లు పూర్తిగా నీట మునగడంతో ఇప్పుడవి పనిచేయలేని స్థితి ఏర్పడిందంటున్నారు. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రాకపోకలను నియంత్రించి, ఒకవైపు ఒకసారి, మరో వైపు ఇంకోసారి ట్రాఫిక్‌ను తరలిస్తుండడంతో భారీ స్థాయిలో ట్రాఫిక్‌ ‌జామ్‌ అవుతున్నది. ఇంకా కాకతీయ ఫేస్‌ ఒన్‌, ‌ఫేస్‌ 2 ‌కాలనీలు ఇంకా నీట మునిగే ఉన్నాయి.  మొత్తానికి వరంగల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలో దాదాపు 180కి పైగా లోతట్టు ప్రాంతాలున్నాయి. వీటిలో ఎక్కువ శాతం మోకాలి లోతులో నీరు నిండి ఉంది. వడ్డేపల్లి, గోపాల్‌పూర్‌ ‌చెరువులు నిండి పోర్లుతండడంతో సుమారు 40 కాలనీల వరకు ఇంకా నీటితో నిండి ఉన్నాయి. వరంగల్‌ ‌తూర్పు పరిధిలో ప్రధాన రోడ్లు చెరువుల్లా మారాయి. దీంతో చాలామంది ఇండ్లనుండి బయటికి రాలేక పోతున్నారు. రెండు రోజులుగా తిండిలేక, కనీసం మంచినీళ్ళు కూడా లభించక అవస్త పడుతున్నవారున్నారు.

అధికారులెవరు తమను పట్టించుకోవడంలేదని పలువురు వాపోతున్నారు.  బిఆర్‌ ‌నగర వాసుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఇక్కడ వొచ్చిన వరదకు మూడు రోజుల కింద తమ ఇళ్ళను వదిలి వేశారు. ఈ మూడు రోజుల్లో ఒక్క అధికారి కూడా ఈ ప్రాంతానికి రాలేదన్న బాధను వారు వ్యక్తం చేస్తున్నారు. అక్కడే ఇల్లు వదలకుండా మూడు రోజుపాటు ఉన్న వారు తిండి, నీరు లేక మూడు రోజులుగా నానా అవస్థలు పడ్డామని, ఎవరూ ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల నేటికీ విద్యుత్‌ ‌సరఫరాలేక ఇబ్బంది పడుతున్నారు. ఇదిలాఉంటే నగరంలో రామన్నపేట వద్ద ఒకరు, అమృత టాకీస్‌ ‌వద్ద ఒకరు మృతిచెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *