మనది వ్యవసాయక దేశం. జనాభాలో అత్యధిక శాతం వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. జరుపుకునే పండుగలు పబ్బాలు వ్యవసాయంతోనే ముడిపడి ఉంటాయి. గతంలో వ్యవసాయ భూమితో సంఘంలో గౌరవ మర్యాదలు దొరికేవి అంటే వ్యవసాయ భూమికి అంత ప్రాధాన్యత ఉండేది. ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న దేశాల్లో మన దేశం పదో స్థానంలో ఉంది. ఆహార ఉత్పత్తులు అధికంగా ఎగుమతి చేస్తున్న మొదటి దేశాల్లో ఒకటిగా ఉన్నదని చెప్పవచ్చు. ప్రపంచంలో పప్పుదినుసులు, మసాలాలు, జనపనార, మామడి, అరటిని ఎక్కువగా పండిస్తున్న దేశం మనది. అత్యధికంగా వరి, గోధుము, పండ్లు, కూరగాయు, పత్తి, చెరుకు, నూనె గింజలు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో రెండో స్థానంలో ఉంది. దేశ భూభాగంలో 52 శాతం వ్యవసాయయోగ్యమైన భూమి ఉంది. సుమారు 60 శాతానికి పైగా దేశ జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంది. వ్యవసాయానికి ఇంత ప్రాధాన్యత ఉన్న మన దేశంలో ఆ రంగానికి సంబంధించి అనేకానేక సమస్యలు ఉన్నాయి.
ఇందులో ప్రధానంగా వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా వేగంగా మారుతుండటం. గత రెండు దశాబ్దాలుగా దేశంలో వ్యవసాయ భూములు విచ్చలవిడిగా వ్యవసాయేతర భూములుగా మారిపోతున్నాయి. దీంతో ఆహారభద్రతకు కూడా ముప్పుగా మారే ప్రమాదం పొంచి ఉన్నది.ఇక తెలంగాణలో దాదాపు 20 ఏళ్ల కింది పరిస్థితికి, నేటికి చూసుకుంటే ఎంత త్వరగా వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా మారిపోతున్నాయో అర్థమవుతుంది. కొన్ని సంవత్సరాల క్రిందట ఒక ఊరు నుండి మరొక ఊరికి మరియు ఇతర పట్టణాలకు నగరాలకు పోతుంటే ఊర్లు దాటగానే రోడ్డుకు ఇరు ప్రక్కల ఆకు పచ్చటి వ్యవసాయ భూములే ఎక్కువగా కనిపించేవి. కానీ, ఇప్పుడు ఈ వ్యవసాయ భూమున్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారి బీడు భూములుగా మారుతున్నాయి. ఒకప్పుడు కేవలం నగరానికే పరిమితమైన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు జిల్లాలకు, మండలాలకు, గ్రామాలకు కూడా విస్తరించడంతో రాష్ట్రంలో వేల సంఖ్యలో రియల్ ఎస్టేట్ వెంచర్లు తయారవుతున్నాయి.
లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఇప్పుడు ప్లాట్లుగా మారిపోతున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి, ఇతర అభివృద్ధి పనుల కోసం కొంతమేర వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారిపోతుంది. దీని ద్వారా వ్యవసాయం నుంచి కాకపోయిన కొంత అభివృద్ధి, జీవనోపాధి లభిస్తుంది. కానీ, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారి బీడు భూములుగా మారిపోతున్న భూముల వల్ల దేశ వ్యవసాయరంగానికి, ఆహార భద్రతకు తీవ్ర నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 1.42 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, లందులో 22.23 లక్షల ఎకరాలు వ్యవసాయేతర భూమిగా మారిపోయింది. గత పదేండ్లలోనే 11.95 లక్ష ఎకరాల వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారిందంటే ఎంత వేగంగా వ్యవసాయం తగ్గుతూ వస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. గతంలో కేవలం హైదరాబాద్ శివార్లు లేదా జిల్లా కేంద్రాలకే రియల్ ఎస్టేట్ పరిమితంగా ఉండేది కానీ ఇప్పుడు హైదరాబాద్కు అన్ని వైపులా దాదాపు 70 కిలోమీటర్ల వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పడ్డాయి. కేవలం హైవేపై మాత్రమే కాకుండా హైవే నుంచి పది కిలోమీటర్ల లోపలి వరకు వ్యవసాయ భూములు వెంచర్లుగా మారుతున్నాయి.
రాష్ట్రంలో ఇప్పుడున్న 33 జిల్లాల కేంద్రాలకు చుట్టుపక్కల, సగానికి పైగా మండల కేంద్రాల చుట్టుపక్కల కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిసినాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధిక ధరలు పెట్టి వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తామని వస్తుండటంతో రైతులు భూములు అమ్మడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు, అవసరాలు, వ్యవసాయంలో నష్టాలు వంటి అనేక కారణాలతో భూములను అమ్మేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ భూములను కొనుగోలు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లుగా మార్చి, ప్లాట్లు చేసి రంగుల ప్రపంచంతో ఆకర్షణీయమైన ప్రకటనలతో పత్రికలలో టీవీలలో విస్తృతమైన ప్రచారం చేసి అమ్ముతున్నారు. మధ్యతరగతి ప్రజలు పెట్టుబడిగా భావించి ఈ ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్లాట్లలో ఎక్కువ శాతం నిరుపయోగంగా ఉంటున్నాయి. దీంతో వేలాది ఎకరాల భూములు బీడు భూములుగా మారిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. వ్యవసాయంపై ఆధారపడి జీవించిన రైతు, రైతుకూలీలు ఉపాధికి దూరమవుతారు. వ్యవసాయ భూమి తగ్గిపోవడం ఆహార భద్రతకు కూడా ముప్పుగా మారుతుంది.
మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. ఆహార భద్రతకు, పర్యావరణానికి, ప్రజల జీవనోపాధికి ముప్పుగా మారిన ఈ సమస్యకు శాశ్వత, ఖచ్చితమైన పరిష్కారం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒక పరిమితిని విధించుకొని ఆ పరిమితిని దాటి వ్యవసాయ భూమి తగ్గకుండా చూడాలి. వ్యవసాయ భూమిని ఇతర అవసరాల కోసం వ్యవసాయ భూమిగా మార్చే సమయంలో నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఏ అవసరం కోసం అయితే వ్యవసాయ భూమిని మార్చుకున్నారో ఆ పనిని పూర్తి చేసేందుకు కాల పరిమితి విధించాలి. ఒక పరిశ్రమ ఏర్పాటుకు వ్యవసాయ భూమిని మార్పు చేయించుకుంటే కాలపరిమితి దాటినా పరిశ్రమ స్థాపించకపోతే ఆ భూమిని మళ్లీ వ్యవసాయ భూమిగా మార్చేలా నిబంధనలు ఉండాలి. తద్వారా వ్యవసాయ భూములను రక్షించుకోగలుగుతాము.
– దండంరాజు రాంచందర్ రావు, రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్
సింగరేణి భవన్ హైదరాబాద్, 9849592958




