హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 31 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తెలంగాణలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అమరులస్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల? 1952 లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి ఆరుగురిని బలిగొన్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? 1969-71 తొలిదశ ఉద్యమంలో 370 మంది తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం‘ అని పేర్కొన్నారు.
1971 పార్లమెంట్ ఎన్నికల్లో 11 సీట్లలో తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజాస్వామికంగా, తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే, తెలంగాణను తుంగలో తొక్కింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. 2004లో మాట ఇచ్చి, పదేళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు, వేలాది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు.





