విదేశీ విశ్వవిద్యాలయాల రాక వరమా, శాపమా..!

ఇటీవల భారత యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ (యూజిసీ) తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన 500 విదేశీ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్‌లను భారత్‌లో నెలకొల్పవచ్చనే పలు షరతులతో కూడిన అనుమతులు ఇస్తూ, వాటి ద్వారా యూజీ, పిజీ, డిప్లమా, పిహెచ్‌డి, పోస్ట్‌డాక్టరల్‌ రిసెర్చ్‌ లాంటి కోర్సులు అందించవచ్చనే నిర్ణయం మన ఉన్నత విద్య రంగంలో మరో చర్చకు తెరలేపినట్లు అయ్యింది. స్వదేశంలోనే తక్కువ ఖర్చులతో అంతర్జాతీయ స్థాయి విదేశీ యూనివర్సిటీ విద్య చదువుకోవడానికి భారతీయ యువతకు మార్గం సుగమం అవుతున్నదని యూజీసీ పేర్కొంటున్నది. స్వదేశీ లేదా విదేశీ యూనివర్సిటీ చదువులంటే తరగతి గది విషయ పరిజ్ఞానం మాత్రమే కాదని, అవసరమైన అత్యున్నత ప్రమాణాలు కలిగిన హార్డ్‌ అండ్‌ సాఫ్ట్‌ స్కిల్స్‌(నైపుణ్యాలు)ను స్వంతం చేసుకోవడం అని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ఉన్నత విద్య కోసం భారత యువత విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లకు క్యూ కట్టడం, ప్రవాహం వలె మేధో వలస (బ్రేయిన్‌ డ్రేన్‌) ప్రవహించడం చూస్తున్నాం.

ఉన్నత విద్య పేరుతో విదేశాలకు వలసలు: జనవరి 2023 వివరాల ప్రకారం ఇప్పటికే 15 లక్షల యువత విదేశీ యూనివర్సిటీల్లో చదువుతున్నారని, 2022లో ఈ సంఖ్య 13 లక్షలు ఉందని తెలుస్తున్నది. 2024 వరకు ఫారిన్‌ యూనివర్సిటీలకు 18 లక్షలు భారత యువత వెళ్లవచ్చని, వీరి ద్వారా 85 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 2021-22లో భారత యువత విదేశీ చదువులకు చేసిన ఖర్చులు 5 బిలియన్‌ డాలర్లు మాత్రమే అని గమనించాలి. ఉన్నత చదువుల మిషతో విదేశీ గడ్డ మీద దిగిన యువ భారతం చదువులు పూర్తి అయిన తరువాత తిరిగి స్వదేశానికి రాకుండా అక్కడే స్థిరపడడానికి మొగ్గు చూపడం విచారకరంగా తోస్తున్నది. విదేశీ యూనివర్సిటీల రాకతో భారత ఉన్నత విద్యలో అకడమిక్‌ వాతావరణం, ఆవిష్కరణల అవకాశాలు, సృజనశీలత లాంటివి కూడా పెరుగుతాయని భావిస్తున్నారు.

విదేశీ విశ్వవిద్యాలయాల రాకతో నష్టాలు: పశ్చిమ, యూరోప్‌ దేశాలతో పోల్చితే భారత్‌లో నెలకొన్న విదేశీ క్యాంపస్‌ల్లో చదువు కోవడానికి పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, మిడిల్‌ ఈస్ట్‌ లాంటి ఇరుగుపొరుగు దేశాల యువత కూడా భారత్‌కు రావడానికి అంతగా ఇష్టపడడం లేదు. ఆత్మనిర్భర భారత నినాదానికి విఘాతం కలిగించే విధంగా విదేశీ యూనివర్సిటీ ప్రాంగణాలను నెలకొల్పడం అనే నిర్ణయం ఉందని, ఉన్నత విద్యను వస్తువుగా భావించడం అసంబద్ధంగా ఉందని కొందరు నిపుణులు వాపోతున్నారు. విదేశీ యూనివర్సిటీ ప్రాంగణాల్లో చదవడానికి పేద అణగారిన వర్గాల విద్యార్థులకు అవకాశం ఉండదని, విదేశీ సంస్థలు దేశీయ అవసరాలు, సంస్కృతులను ప్రతిబింబించే విధంగా ఉన్నత విద్యా పథకాల అమలును తిలోదకాలిచ్చి తమ లాభాపేక్షతో మాత్రమే పని చేస్తాయని గుర్తు చేస్తున్నారు.

విదేశీ చదువుల మోదు పెరగడానికి కారణాలు: విదేశీ చదువులకు భారతీయ యువత మొగ్గు చూపడానికి కారణం ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థల్లో చదవడంతో పాటు ఆకర్షణీయ వేతనాలు, ప్రశాంత ఆవాస వాతావరణం, క్రమశిక్షణాయుత సమాజం, నైపుణ్యాన్ని బట్టి వేతన సవరణలు, కార్యాలయాల్లో సరైన పని వాతావరణం, కుటుంబ భద్రత, చట్టాల అమలులో చిత్తశుద్ధి, స్వతంత్ర ఆధునిక జీవనశైలి, బహుళజాతి సంస్కృతుల పరిచయం, విభిన్న భాషల సంగమం, డిజిటన్‌ యుగపు నైపుణ్యాల లభ్యత లాంటి కారణాలతో అక్కడే స్థిరపడాలనే నిర్ణయం తీసుకుంటున్నారు. స్వదేశంలో ఉద్యోగ ఉపాధుల కొరతతో పాటు తక్కువ వేతనాల చెల్లింపు కారణాలతో ఉన్నత చదువుల కోసమే కాదు, విదేశాల్లో స్థిరపడడమే వారి లక్ష్యంగా ప్రయాణం అవుతున్నది. ఉన్నత చదువులతో పాటు అధిక నైపుణ్యాలు కలిగిన యువతను మంచి ఉద్యోగాలు ఆహ్వానిస్తుండగా, సాధారణ విద్యా ప్రమాణాలు కలిగిన యువత సాధారణ ప్రమాణాలు కలిగిన యూనివర్సిటీల్లో చదివి చిన్న చిన్న తక్కువ స్థాయి మీనియల్‌, లేబర్‌ స్థాయి ఉద్యోగాలను/పనులను సహితం చేస్తూ మంచి వేతనాలను పొందడం, అక్కడే శాశ్వతంగా స్థిరపడడం జరుగుతోంది. భారతీయ యువతలో 76 శాతానికి పైగా విదేశాల్లో స్థిరపడడానికే విదేశాల్లో చదువులకు ప్రణాళికలు వేసుకుంటున్నారు.

దేశీయ ఉన్నత విద్యాసంస్థలకు ఊతం ఇవ్వలేమా: మన దేశీయ రాష్ట్ర కేంద్ర ఉన్నత విద్యా సంస్థలు, యూనివర్సిటీల్లో అధ్యాపకులకు విద్యా నైపుణ్య ప్రమాణాలు తక్కువగా ఉండడమే కాకుండా అర్హతలున్న బోధనా సిబ్బందికి తక్కువ వేతనాలు ఇవ్వడం, ఆధునిక ప్రయోగశాలు అందుబాటులో లేకపోవడం, అధ్యాపకుల ఖాళీలు వెక్కిరించడం, నిధుల కొరత వెంటాడడం లాంటి సమస్యల వలయంలో సతమతం అవుతున్నాయి. విదేశీ విశ్వవిద్యాలయాలతో పోటీ పడడానికి 1000కి పైగా భారతీయ యూనివర్సిటీలు, 42,000లకు పైగా ఉన్నత విద్యా కళాశాలల్లో అర్హత కలిగిన అధ్యాపకుల కొరతను తగ్గించడం, పని సంస్కృతి పెంచడం, పరీక్షా విధానాల సంస్కరణలు చేపట్టడం, అవసర నిధులను సకాలంలో విడుదల చేయడం, రాజకీయాలకు అతీతంగా నియామకాలు చేపట్టడం, అడ్మిషన్‌ ప్రక్రియల్లో పారదర్శకత పాటించడం, సరైన మూల్యాంక వ్యవస్థలను నెలకొల్పడం, నైపుణ్య విద్యకు పట్టం కట్టడం, అవసర కోర్సులను ప్రారంభించడం, సిలబస్‌లో కాలానుగుణ మార్పులు చేయడం, బహుముఖీన వ్యక్తిత్వ వికాసం జరిగే విధంగా యూనివర్సిటీల్లో సానుకూల వాతావరణాలను నెలకొల్పడం లాంటి చర్యలు సత్వరమే తీసుకొనడం వల్ల విదేశీ విద్యా మోజు నుంచి మన యువత దృష్టిని కొంతవరకైనా స్వదేశీ విద్య వైపుకు ఆకర్షించవచ్చని ఇప్పటికైనా తెలుసుకోవాలి.

-డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి
కరీంనగర్‌, 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *