గత పదేళ్ల అనుభవం.. సభ్యుల సహకారంతో ప్రజలకు సేవ
రాజ్యాంగానికి అనుగుణంగా పాలన ˜140 కోట్ల ప్రజల ఆకాంక్షలు గుర్తెరిగి పనిచేస్తా
విపక్షాలు కూడా ప్రజల పక్షాన బలంగా నిలబడాలి
పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు
న్యూదిల్లీ, జూన్ 24 : వికసిత్ భారత్ సంకల్పం, కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగుతామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తమ పదేళ్ల పాలనానుభవం, కొత్త సభ్యుల ఆకాంక్షలు, దేశ ప్రజల ఆశల మేరకు ముందుకు సాగుతామని అన్నారు. మరింత కఠిన శ్రమతో దేశానికి సేవచేస్తానని మోదీ ప్రకటించారు. కొత్త పార్లమెంటు భవనంలో 18వ లోక్‌సభ సమావేశాలు సోమవారం ప్రారంభం అయిన సందర్భంగా మోదీ వ్నిడియాతో మాట్లాడుతూ..లోక్ సభ సభ్యులకు స్వాగతం పలికారు. ఇది చాలా పవిత్రమైన రోజు అని పేర్కొన్నారు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరస్తామని, సామాన్య ప్రజల కలలు సాకారం చేస్తామని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తామన్నారు. మూడోసారి సేవచేసే భాగ్యాన్ని ప్రజలు కల్పించారని, సభ్యులందరినీ కలుపుకుని వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటామని మోదీ వివరించారు.
ప్రజలు తమ విధానాలను విశ్వసించారని, సరికొత్త విశ్వాసంతో కొత్త సమావేశాలు ప్రారంభిస్తున్నామని, రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల స్వప్నం నెరవేర్చే సంకల్పం తీసుకున్నామని, మంగళవారంతో అత్యయిక పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తివుతుందని, అత్యయిక పరిస్థితి ఒక మచ్చ అని, 50 ఏళ్ల క్రితం జరిగిన పొరపాటు పునరావృతం కాకూడదని మోదీ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల పక్రియ నిర్వహించామని, 65 కోట్ల మంది వోటర్లు ఈ పక్రియలో పాల్గొన్నారన్నారు. తమ విధానాలకు, అంకితభావానికి జనామోదం లభించిందనే ప్రజలు తమకు వరుసగా మూడోసారి సేవచేసే అవకాశం కల్పించారరన్నారు. కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగి, అందరి సహకారంతో భరతమాత సేవలో పాల్గొంటామన్నారు. కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి సమష్టిగా కృషి చేయాలన్నారు. 2047 వికసిత్ భారత్ సంకల్పం, లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా సాగుతామని, రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటామన్నారు. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతామని, భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కృషి చేస్తామని మోదీ తెలిపారు. ఎమర్జెన్సీలో ప్రజలను జైళ్లలో వేసినట్లు చెప్పారు.
50 ఏళ్లకిందట జరిగిన తప్పు మరెవరూ చేయకూడదన్నారు. మూడో దఫాలో మూడు రెట్లు అధికంగా పనిచేస్తామని ఈ సందర్భంగా మోదీ పునరుద్ఘాటించారు. జనహితం కోసం సభ్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. 18వ లోక్‌సభలో విపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. కాగా ఉదయం పార్లమెంట్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వాగతం పలికారు. స్వాతంత్య్రం వొచ్చిన తర్వాత తొలిసారిగా లోక్‌సభ ఎంపీల ప్రమాణస్వీకారం మన కొత్త పార్లమెంట్ భవనంలో జరగనుందన్నారు.
ఈ శుభ సమయాన కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగతాభినందనలు తెలియజేస్తున్నానన్నారు. ప్రజల స్వప్నం నెరవేర్చే సంకల్పం తీసుకున్నామని ఈ సందర్భంగా విపక్ష ఎంపీలకు ప్రధాని దిశనిర్దేశం చేశారు. ఈ దేశానికి మంచి, బాధ్యతాయుతమైన విపక్షం అవసరమని, ప్రజాస్వామ్య మర్యాదను కాపాడేలా, సామాన్య పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతిపక్షాలు నడుచుకుంటాయని ఆశిస్తున్నానని, డ్రామాలు, ఆటంకాలను ప్రజలు కోరుకోవట్లేదని, నినాదాలు ఆశించట్లేదని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విపక్షాలు కూడా సహకరించాలని ప్రధాని హితవు పలికారు.





